discontinue
-
కంచికి చేరిన కథ ఇది!
150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కోల్‌కతా ట్రామ్‌ల కథ ముగిసిపోతోంది. ట్రామ్‌ల సేవలను నిలిపేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రోడ్లపై ట్రామ్‌లు కనిపించవు. కేవలం ఒక మార్గంలో ట్రామ్‌లు నడిపిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అది కూడా ఎక్కవ రోజులు కొనసాగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోల్‌కతాకు పర్యాయపదమైన ఈ ప్రజా రవాణా వాహనాలు ప్రస్థానం ముగిసిపోతుండడం నగర ప్రజలను, పర్యాటకులను ఆవేదనకు గురిచేస్తోంది. ట్రామ్‌ల విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రామ్‌ల గురించి తెలుసుకోవడం ఆసక్తికరం. సుదీర్ఘ ప్రయాణం 👉 కోల్‌కతాలో(అప్పటి కలకత్తా) బ్రిటిష్ ప్రభుత్వం 1873 ఫిబ్రవరి 24న ట్రామ్‌లను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత ఉత్తర కలకత్తాలోని సీల్డా–అర్మేనియా ఘాట్ మధ్య 3.9 కిలోమీటర్ల మార్గంలో ట్రామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. గుర్రాలు ఈ ట్రామ్‌లను లాగేవి. 👉 ట్రామ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో 1873 నవంబర్‌లో సేవలు నిలిపివేశారు. 👉 1880 నవంబర్‌లో ట్రామ్‌లు మళ్లీ పట్టాలెక్కాయి. లండన్‌లో రిజిస్టరైన ‘కలకత్తా ట్రామ్వేస్ కంపెనీ’ఆధ్వర్యంలో మీటర్ గేజ్ ట్రామ్‌లను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ట్రామ్లకు ఎదురే లేకుండాపోయింది. 👉 1882లో స్టీమ్ ఇంజన్లు వచ్చాయి. 1900వ సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ ఇంజన్లు దశలవారీగా ప్రారంభించారు. 👉 1943 నాటికి కోల్‌కతాతోపాటు హౌరాలోనూ ట్రామ్‌లు విస్తరించాయి. ప్రయాణ మార్గం దాదాపు 70 కిలోమీటర్లకు చేరుకుంది. 1960 నాటికి ‘కలకత్తా ట్రామ్వేస్ కంపెనీ’ ఆధ్వర్యంలో ట్రామ్‌ల సంఖ్య 450కి చేరింది. 👉 1969 దాకా ట్రామ్‌లు వైభోగం అనుభవించాయి. విపరీతమైన ఆదరణ ఉండేది. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. క్షీణదశ ఆరంభమైంది. 👉 1970 అక్టోబర్‌లో హౌరాలోని బంధాఘాట్లో, 1971 డిసెంబర్లో శివపూర్‌లో ట్రామ్‌లను నిలిపివేశారు. 1973 మే నెలలో కోల్‌కతాలోని నిమ్తాలా ఘాట్‌లో ట్రామ్ సేవలకు తెరపడింది. 👉 వేర్వేరు ప్రయాణ సాధనాలు, ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ట్రామ్లకు ఆదరణ పడిపోయింది. 👉 కోల్‌కతాలో 1948లో బస్సులు, 1984ల మెట్రో రైళ్లను ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో ఎల్లో ట్యాక్సీలు, ఓలా, ఉబర్ వంటివి వచ్చాయి. ట్రామ్‌లతో పోలిస్తే ఇవన్నీ వేగవంతమైన ప్రయాణ సాధనాలే. అందుకే జనం అటువైపు మొగ్గుచూపారు. 👉 1969లో మొత్తం 70.74 కిలోమీటర్ల మార్గాల్లో పరుగులు పెట్టిన ట్రామ్‌లు ఇప్పుడు కేవలం 3 మార్గాల్లో 19.4 కిలోమీటర్లకు పరిమితం అయ్యాయి. నిత్యం కేవలం 3 వేల మంది ట్రామ్‌ల్లో ప్రయాణిస్తున్నారు. 👉 2011లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రామ్‌ల సంఖ్యను, ప్రయాణ మార్గాలను భారీగా తగ్గించారు. కోర్టు ఏం చెబుతుందో? ట్రామ్‌ల సంఖ్యలో ప్రభుత్వం కోత విధించడాన్ని సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టులో 2021, 2022లో రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెంగాల్ రవాణా సంస్థ చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ట్రామ్‌లను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని కమిటీకి సూచించింది. అధిక జనాభాతో కిక్కిరిసిపోతున్న కోల్‌కతాలో ఈ ట్రామ్‌ల వ్యవస్థ ఇకపై అవసరం లేదని కోల్‌కతా ట్రాఫిక్ పోలీసులు స్పష్టంచేశారు. ఈ మేరకు ఒక నివేదికను రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శికి అందజేశారు. ఈ నివేదికను హైకోర్టులో సమర్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు ట్రామ్లపై హైకోర్టులో తదుపరి విచారణ వచ్చే ఏడాది 8న జరుగనుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా రూ. లక్ష కోట్లు!
ముంబై: వృద్ధే లక్ష్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (I–CRR) విధానం నుంచి అక్టోబర్ 7 నాటికి దశల వారీగా పూర్తిగా వైదొలగాలని నిర్ణయించింది. దీనితో బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు రూ. లక్ష కోట్ల అదనపు నిధుల లభ్యత, ప్రస్తుత స్థాయిలోనే వడ్డీరేట్ల కొనసాగింపు వంటి సౌలభ్యతలు ఒనగూరే అవకాశం ఏర్పడుతుంది. రూ.2000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను వెనక్కు తీసుకోడానికి, తద్వారా ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంచడానికి ఐ–సీఆర్ఆర్ నిర్వహించాలని బ్యాంకింగ్‌కు ఆగస్టు 10వ తేదీన ఆర్బీఐ తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆదేశించింది. ఈ సందర్భంగా ఆర్బీఐ కీలక ప్రకటన చేస్తూ... బ్యాంక్ మొత్తం డిపాజిట్లో లిక్విడ్ క్యాష్ రూపంలో ఆ బ్యాంక్ నిర్వహించాల్సిన నగదుకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని యథాతథంగా 4.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే రూ.2,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి రావడం, ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి అందిన డివిడెండ్ వంటి చర్యల వల్ల వ్యవస్థలో ఏర్పడిన అధిక ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) తగిన స్థాయి వరకూ వెనక్కు తీసుకోడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా మూడు నెలలకుపైగా కాలానికి (రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన తేదీ 2023 మే 19వ తేదీ నుంచి 2023 జూలై 28 వరకూ) ఎన్‌డీటీఎల్ (నెట్ డిమాండ్, టైమ్ లయబిలిటీ) ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ–సీఆర్ఆర్)10 శాతంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల వ్యవస్థ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు వెనక్కు మళ్లుతున్నట్లు కూడా సూచన ప్రాయంగా తెలిపింది. తాజాగా ఈ నిధులను మళ్లీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వదులుతున్నట్లు ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. మూడు దశల్లో... అమలైన ఐ–సీఆర్ఆర్లో 25 శాతం సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. సెపె్టంబర్ 23న మరో 25 శాతం, పెండింగ్‌లో ఉన్న 50 శాతం అక్టోబర్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ‘ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఐ–సీఆర్ఆర్’ను దశలవారీగా నిలిపివేయాలని ఒక సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చలామణి నుండి కరెన్సీని ఉపసంహరించుకున్న తేదీ మే 19న చెలామణిలో ఉన్న మొత్తం రూ. 2,000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకింగ్‌కు తిరిగి వచి్చనట్లు ఆర్బీఐ తెలిపింది. -
ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..
కొత్త సిరీస్‌ను ప్రారంభించినప్పుడు యాపిల్ పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపివేస్తూ వస్తోంది.యాపిల్ ఐఫోన్15 (iPhone 15)ఈ సంవత్సరం ఆఖరులో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా కొన్ని పాత మోడళ్లను యాపిల్ నిలిపివేసే అవకాశం ఉంది. టామ్స్ గైడ్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్‌ని ప్రారంభించిన తర్వాత ఐఫోన్14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max), ఐఫోన్13 మిని (iPhone 13 mini)తో పాటు ఐఫోన్12 (iPhone 12) మోడళ్లను యాపిల్ కంపెనీ నిలిపివేయనుంది. ఇందులో ఐఫోన్ 12ను నిలిపివేయడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఏ మోడల్ ఫోన్‌నైనా మూడేళ్లకు మించి అందుబాటులో ఉంచదు. ఐఫోన్12 మోడల్ నిలిచిపోతే దాని స్థానాన్ని ఐఫోన్ 13 భర్తీ చేస్తుంది. యాపిల్ సాధారణంగా ఒక సంవత్సరం అమ్మకాల తర్వాత దాని ప్రో మోడల్లను ఆపేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. కానీ ఐఫోన్ 14 మాత్రం కొనసాగే అవకాశం ఉంది. దీని ధరను కూడా తగ్గించవచ్చు. రెండేళ్ల అమ్మకాల తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీని నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 మినీని కూడా నిలిపివేయవచ్చని నివేదిక సూచిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌ను కొనసాగిస్తుందా.. నిలిపేస్తుందా అన్నది చెప్పడం కష్టం. దీని ధరను రూ.8000లకుపైగా తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్ 15 విడులయ్యాక దానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా కంపెనీ నిలిపేసే అవకాశం ఉంది. కాగా ఐఫోన్ (iPhone 15) సిరీస్ కింద కంపెనీ నాలుగు మోడళ్లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. బేస్ ఐఫోన్15 వేరియంట్, ఐఫోన్15 Plus, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఉన్నాయి. వీటిని త్వరలో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో ప్రకటించే అవకాశం ఉంది. -
కియా ఇండియా కీలక నిర్ణయం..ఆ మోడల్స్ పూర్తిగా నిలిపివేత..!
సౌత్ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన పలు కార్ల వేరియంట్లను భారత్‌లో నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వేరియంట్స్ కనిపించవ్...! ఇండియాలో ప్రజాదరణ పొందిన సెల్టోస్ SUV, కార్నివాల్ MPV కార్లకు చెందిన పలు వేరియంట్లను భారతదేశంలో నిలిపివేయాలని కియా నిర్ణయించుకుంది. సెల్టోస్ SUV రేంజ్ లోని మిడ్-రేంజ్ HTK+ డీజిల్-ఆటోమేటిక్ ట్రిమ్, ఏడు సీట్ల ప్రీమియం MPV కార్నివాల్ బేస్ వేరియంట్‌ను కంపెనీ ఉపసంహరించుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ నిర్ణయం వెనుక నిర్దిష్ట కారణాలను కియా ఇండియా వెల్లడించలేదు. తక్కువ డిమాండ్... ఇండియాలో ఆయా వెరియంట్లకు తక్కువ డిమాండ్ ఉన్నందున కంపెనీ ఉపసంహరించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కార్ల కోసం డీలర్ల నుంచి బుకింగ్‌లు తీసుకోవడానికి కియా ఇండియా నిరాకరించినట్లుగా తెలుస్తోంది. వాటి బదులుగా.. కియా సెల్టోస్ HTK+ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.14.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). కియా కార్నివాల్ బేస్ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ రూ. 25.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. కాగా సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు GTX+ ఆటోమేటిక్ వేరియంట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది., దీని ధర రూ.17.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది HTK+ వేరియంట్ కంటే రూ. 3.7 లక్షలు ఎక్కువ. కార్నివాల్ MPV కొత్త బేస్ వేరియంట్ ఇప్పుడు ప్రెస్టీజ్ ట్రిమ్ సెవెన్-సీటర్ యూనిట్, దీని ధర రూ. 29.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది HTK+ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ల కంటే రూ.4.5 లక్షలు ఎక్కువ. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ !
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ షాకిచ్చింది. ఇకపై ఉద్యోగులపై ఇచ్చే ఓవర్ టైం అలవెన్సును నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పర్సనల్ మినిస్ట్రీ ఒక ఉత్తర్వు చేసింది. దీని ప్రకారం కార్యనిర్వాహక సిబ్బంది మినహా ఇతర ఉద్యోగులకు చెల్లించే ఓవర్ టైం అలవెన్సును రద్దు చేసింది. ఏడవ పే కమిషన్ సిఫారసులకనుగుణంగా ఈ చర్య తీసుకుంది. దీని ప్రకారం, అన్ని మంత్రివర్గ విభాగాలతో పాటు భారత ప్రభుత్వ అటాచ్డ్, సబార్డినేట్ కార్యాలయాలలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆపరేషనల్ స్టాఫ్ జాబితాను తయారు చేయవలసిందిగా సంబంధిత విభాగాలను కోరింది. అత్యవసరమైన సమయంలో అతని/ఆమె సీనియర్ అధికారి సంబంధిత ఉద్యోగి (లు)ను నిర్దేశించినప్పుడు మాత్రమే ఓటీఏ చెల్లించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్యనిర్వాహక సిబ్బంది అంటే నాన్ మినిస్ట్రీరియల్ గెజిటెడ్ సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్ లేదా యాంత్రిక పరికరాల సహాయంతో పనిచేసే ఉద్యోగులు. అలాగే బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఓవర్ టైం భత్యం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఓవర్ టైం అలవెన్స్ లేదా ఓటీ రేటును సవరించేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. 1991 లో జారీ చేసిన ఆర్డర్ ప్రకారమే ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: పీఎన్బీ స్కాం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్వోయూ, లెటర్ ఆఫ్ కంఫర్ట్‌లను లను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆథరైజ్డ్ డీలర్లకు అన్ని బ్యాంకుల లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్, లెటర్ ఆఫ్ కంఫర్ట్‌ను రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలోకి దిగుమతులకుద్దేశించిన వాణిజ్య రుణాలకోసం ఎల్వోయూ (స్వల్పకాలిక క్రెడిట్ రూపంలో బ్యాంకు మరొక ఇండియన్ బ్యాంకు విదేశీ బ్రాంచి నుంచి రుణం పొందానికి తన కస్టమర్‌ను అనుమతించే పత్రమే లెటర్ ఆఫ్ అండర్ స్టాండింగ్..ఎల్వోయూ) జారీ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. తక్షణమే తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో ప్రకటించింది. అయితే జూలై 1, 2015 నాటి బ్యాంకింగ్ నిబంధనలను లోబడి లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆర్బీఐ కీలక నిర్ణయంతో దిగుమతి దారులకు భారీ షాక్ ఇచ్చింది. దీనిపై పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఎల్వోయూ, ఎల్వోసీ రూపంలో బ్యాంక్ గ్యారంటీలు పొందే దిగుమతుదారులను భారీగా ప్రభావితం చేయనుందని వాదించాయి. -
మీరు మారుతి రిట్జ్ ఓనరా?అయితే..
న్యూఢిల్లీ : దేశంలో అతి పెద్ద కార్ మేకర్ మారుతీ సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ‘రిట్జ్’ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఇక రిట్జ్ కార్లను విక్రయించబోమని తెలిపింది. అయితే రాబోయే పదేళ్ల వరకు దీని విడి భాగాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని మారుతి సుజుకి ప్రతినిధి హామీ ఇచ్చారు. తమ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మార్పులు తీసుకొస్తున్న నేపథ్యంలో రిట్జ్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. తమ సక్సెస్ఫుల్ మోడల్స్ లో రిట్జ్ కూడా ఒకటని పేర్కొన్న ఆయన తమ ఉత్పత్తులను ఎప్పటికపుడు సమీక్షించి కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. కాంపాక్ట్ విభాగంలో కొత్త మోడల్ ఇగ్నిస్+తో పాటు స్విఫ్ట్, సెలిరియో, డిజైర్, బెలెనొ వంటి కార్లను విక్రయిస్తున్న మారుతీ సుజుకి, అమ్మకాల్లో 25.2 శాతం పెరుగుదల కనిపించిందని కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. గత ఏడాది జనవరిలో 44,575 కార్లను విక్రయించగా, ఈ ఏడాది అదే నెలలో 55,817 కార్లు అమ్ముడయ్యాయన్నారు. కాగా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో 2009 లోలాంచ్ చేసిన రిట్జ్ కారు మొత్తం 4 లక్షల యూనిట్లను విక్రయించింది. తమ హ్యాచ్‌బ్యాక్ ప్రొడక్షన్ రిట్జ్ కు ముగింపు పలకనున్నట్టు గత ఏడాది నవంబర్ లో ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లోకి అత్యంత ఆదరణ పొందిన ఈ హ్యాచ్‌బ్యాక్‌కు అప్డేట్స్ చేయకపోవడం ద్వారా రానురాను అమ్మకాలు తగ్గిపోవడతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు తక్కువ డిమాండ్ కారణంగా 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ ప్రీమియర్ క్రాస్ఓవర్ ఎస్-క్రాస్ అమ్మకాలను ఈ మార్కెట్ లీడర్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.