
ముంబై: వృద్ధే లక్ష్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (I–CRR) విధానం నుంచి అక్టోబర్ 7 నాటికి దశల వారీగా పూర్తిగా వైదొలగాలని నిర్ణయించింది. దీనితో బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు రూ. లక్ష కోట్ల అదనపు నిధుల లభ్యత, ప్రస్తుత స్థాయిలోనే వడ్డీరేట్ల కొనసాగింపు వంటి సౌలభ్యతలు ఒనగూరే అవకాశం ఏర్పడుతుంది.
రూ.2000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను వెనక్కు తీసుకోడానికి, తద్వారా ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంచడానికి ఐ–సీఆర్‌ఆర్ నిర్వహించాలని బ్యాంకింగ్‌కు ఆగస్టు 10వ తేదీన ఆర్‌బీఐ తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆదేశించింది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ కీలక ప్రకటన చేస్తూ... బ్యాంక్ మొత్తం డిపాజిట్‌లో లిక్విడ్ క్యాష్ రూపంలో ఆ బ్యాంక్ నిర్వహించాల్సిన నగదుకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని యథాతథంగా 4.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
అయితే రూ.2,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి రావడం, ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి అందిన డివిడెండ్ వంటి చర్యల వల్ల వ్యవస్థలో ఏర్పడిన అధిక ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) తగిన స్థాయి వరకూ వెనక్కు తీసుకోడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ఇందులో భాగంగా మూడు నెలలకుపైగా కాలానికి (రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన తేదీ 2023 మే 19వ తేదీ నుంచి 2023 జూలై 28 వరకూ) ఎన్‌డీటీఎల్ (నెట్ డిమాండ్, టైమ్ లయబిలిటీ) ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ–సీఆర్‌ఆర్)10 శాతంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల వ్యవస్థ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు వెనక్కు మళ్లుతున్నట్లు కూడా సూచన ప్రాయంగా తెలిపింది. తాజాగా ఈ నిధులను మళ్లీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వదులుతున్నట్లు ఆర్‌బీఐ వర్గాలు పేర్కొన్నాయి.
మూడు దశల్లో...
అమలైన ఐ–సీఆర్‌ఆర్‌లో 25 శాతం సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. సెపె్టంబర్ 23న మరో 25 శాతం, పెండింగ్‌లో ఉన్న 50 శాతం అక్టోబర్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
‘ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఐ–సీఆర్‌ఆర్’ను దశలవారీగా నిలిపివేయాలని ఒక సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చలామణి నుండి కరెన్సీని ఉపసంహరించుకున్న తేదీ మే 19న చెలామణిలో ఉన్న మొత్తం రూ. 2,000 కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకింగ్‌కు తిరిగి వచి్చనట్లు ఆర్‌బీఐ తెలిపింది.