ట్రామ్‌ను విక్రయించే ఆలోచన లేదు
సాక్షి, ముంబై : నగర చరిత్రకు చిహ్నంగా గుర్తింపు పొందిన ‘ట్రామ్’ను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించబోమని బెస్ట్ సమితి అధ్యక్షుడు అరుణ్ దుద్వడ్కర్ స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాల నుంచి ఆనిక్ బస్ డిపోలో నిలిచి ఉన్న ట్రామ్‌ను ఆయన శనివారం సందర్శించారు. ట్రామ్‌కు శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు చేసి భావితరాల కోసం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని బెస్ట్ పరిపాలన విభాగాన్ని ఈ సందర్భంగా ఆదేశించారు. ‘ట్రామ్‌ను తుక్కు సామాను కింద విక్రయించడం వల్ల వచ్చే ఆదాయంతో బెస్ట్ సంస్థకు ఒరిగేదేమి లేదు. 45 ఏళ్ల కిందట నగర రహదారులపై పరుగులు తీసిన ట్రామ్‌ల గురించి వృద్ధులు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు.
అందులో ప్రయాణించిన ముంబైకర్లు ఆ జ్ఞాపకాలను ఇప్పటి కి నెమరు వేసుకుంటున్నారు. అంతటి చరిత్ర ఉన్న ట్రామ్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. వందలాది ట్రాముల్లో ప్రస్తుతం ఒకటే మిగిలింది. కనీసం దాన్నైనా కాపాడుకోవాలి’ అని దుద్వడ్కర్ అన్నారు. ఆనిక్ బస్ డిపోలో నిలిచి ఉన్న ఏకైక డబుల్ డెక్కర్ ట్రామ్‌ను వేలం పాటలో లేదా తుక్కు సామాను కింద విక్రయించాలని బెస్ట్ పరిపాలన విభాగం రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శివసేనతోపాటు ఇతర పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో స్పందించిన అరుణ్ దుద్వడ్కర్, ట్రామ్‌ను విక్రయించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.