transffer
-
నా బదిలీ వెనుక మంత్రి సత్యవతి కుట్ర
సాక్షి, మహబూబాబాద్: పదవీ విరమణకు 16 నెలల సమయమే ఉన్నప్పటికీ తనను అకారణంగా బదిలీ చేశారని, ఇందుకు మంత్రి సత్యవతి రాథోడే కారణమని డాక్టర్ ఎస్.భీంసాగర్ ఆరోపించారు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయనను తాజాగా హైదరాబాద్ లోని టీవీవీపీ రాష్ట్ర జాయింట్ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్‌గా బదిలీ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన కన్నీరు మున్నీరయ్యారు. మంత్రి బంధువుకు సూపరింటెండెంట్ పదవి కట్టబెట్టేందుకే తనను బదిలీ చేయించారని పేర్కొన్నా రు. మంత్రి కుమారుడు, ఛాతీ వైద్య నిపుణుడు సతీష్ రాథోడ్ నెలలో వారం రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారని, అయినప్పటికీ పూర్తి జీతం ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. అలా ఇవ్వకపోవడంతోనే తనను లక్ష్యంగా చేసుకుని బదిలీ చేయించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పదోన్నతి ఇవ్వకపోగా, కేవలం డిప్యుటేషన్‌పై బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పని హైదరాబాద్‌లో చేస్తూ వేతనం మహబూబాబాద్‌లో తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమేనన్నారు. కాగా, సూపరింటెండెంట్ డాక్టర్ భూక్యా వెంకట్రాములు మాట్లాడుతూ, భీంసాగర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి సత్యవతి, ఆమె కుమారుడు డాక్టర్ సతీ‹Ùతో పాటు తనపై వ్యతిరేక ప్రచారం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. -
విషాదం: బదిలీ ఆనందం తీరకుండానే
సాక్షి, విశాఖపట్నం : భార్య పనిచేస్తున్న మండలానికి బదిలీ అయింది. ఇన్నాళ్లు పడిన ఇబ్బందులు తీరాయని ఆనందంగా ఉన్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. బాధ్యతలు చేపట్టి నాలుగు రోజులు గడవక ముందే కుటుంబ యజమానిని గుండెపోటు రూపంలో కబళించి విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. నాతవరం మండలం తాండవ హైస్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడిగా గడుతూరి వెంకట గోపాలకృష్ణ (48) నాలుగురోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కొయ్యూరు హైస్కూల్లో పనిచేసే వారు. ఈయన భార్య ప్రసన్న ప్రస్తుతం నాతవరం పీహెచ్సీలో వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఆమె కూడా గతంలో కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్సీలో వైద్యాధికారిగా పనిచేసే వారు. రెండేళ్ల క్రితం ఆమె నాతవరం పీహెచ్‌సీకి బదిలీపై వచ్చారు. ఈమె భర్త గోపాలకృష్ణకు కూడా ఇటీవల ఇదే మండలంలోని తాండవ హైస్కూల్‌కు బదిలీ అవడంతో నాలుగురోజులక్రితం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇలా ఆ కుటుంబంలో నెలకొన్న ఆనందం కొద్దిరోజులకే పరిమితం అయింది. గడుతూరి వెంకట గోపాలకృష్ణ(48) శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం నర్సీపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతిచెందినట్టు నాతవరం ఎంఈవో తాడి అమృత్‌కుమార్ తెలిపారు .భార్యాభర్తలిద్దరూ ఒకే మండలంలో పనిచేసే అవకాశం వచ్చిన నేపథ్యంలో గోపాలకృష్ణ గుండెపోటుతో మృతి చెందడం అందర్నీ కలచివేసింది. ఆయన మృతిపట్ల తాండవ హైస్కూల్ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాలు, కొయ్యూరు హైస్కూల్ హెచ్ఎం రామారావు, ఎంఈవో బోడంనాయుడు, ఇతర ఉపాధ్యాయులు తదితరులు సంతాపం తెలిపారు. -
బోధనపై ఆంక్షలా?
వివేచనపైనా, వివేకంపైనా పిడివాదమే గెలిచింది. వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యా లయం(బీహెచ్‌యూ)లోని సంస్కృత విద్యా ధర్మ విజ్ఞాన్(ఎస్వీడీవీ) విభాగంలో సంస్కృత విద్యా బోధన కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితుడైన ఫిరోజ్‌ఖాన్ దాన్నుంచి తప్పుకుని మరో విభాగంలో చేరవలసి వచ్చింది. విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఆయన మరో 9మందితో పోటీపడి రెండు నెలలక్రితం ఆ పోస్టుకు ఎంపికయ్యాడు. ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన బోర్డులో ప్రముఖ సంస్కృత పండితుడు ప్రొఫెసర్ రాధావల్లభ్ త్రిపాఠీతోసహా హేమాహేమీలున్నారు. ఇతరులతో పోలిస్తే ఆ పోస్టుకు కావాల్సిన సకల అర్హతలూ ఆయనకు ఉన్నాయని, ఫిరోజ్‌ఖాన్ సంస్కృతంలో సాహిత్య సంబంధ అంశాలే బోధిస్తారు తప్ప మతపరమైన అంశాలతో ఆయనకు ప్రమేయం ఉండదని బీహెచ్‌యూ వైస్‌చాన్సలర్ రాకేష్ భట్నాగర్, సంస్కృత సాహిత్య విభాగం అధిపతి ప్రొఫెసర్ ఉమాకాంత్ చతుర్వేది, విశ్వవిద్యాలయ పాలకమండలి నచ్చ జెప్పినా విద్యార్థులు అంగీకరించలేదు. సంస్కృతాన్ని మతంతో లేదా కులంతో ముడిపెట్టడం, దాన్ని ఫలానా మతం వారు మాత్రమే నేర్చుకోవాలని, వారు మాత్రమే బోధించాలని ఆంక్షలు పెట్టడం రాజ్యాంగ విలువలకు అపచారం చేయడం మాత్రమే కాదు. ఆ భాషకు కూడా అన్యాయం చేసినట్టే. ప్రజల్లో విస్తృతంగా వాడుకలో ఉన్నప్పుడే ఏ భాషైనా అభివృద్ధి చెందుతుంటుంది. చిర కాలం వర్థిల్లుతుంది. కొందరికే పరిమితమైనప్పుడు కుంచించుకుపోతుంది. సంస్కృత వ్యాకరణం, సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తులు ఔపోసనపట్టిన ఫిరోజ్‌ఖాన్‌ను విధ్వంసక శక్తిగా చూడటం, ఆయన బోధనాచార్యుడిగా వస్తే ఏదో అపచారం జరిగిపోతుందని బెంబేలెత్తడం ఆశ్చర్యం కలిగి స్తుంది. రాజస్తాన్‌కు చెందిన ఫిరోజ్ కుటుంబం మూడు తరాలనుంచి సంస్కృతంపైనా, హిందూ మత ఆచారాలపైనా ఆసక్తి, అనురక్తీ పెంచుకుంది. ఒకపక్క మసీదులో నమాజు చేస్తూనే గోవును పూజించడం, వారి స్వస్థలమైన బంగ్రూలో ఉన్న దేవాలయాల్లో భజన గీతాలు పాడటం ఫిరోజ్ తండ్రి రంజాన్ఖాన్కు దశాబ్దాలుగా అలవాటు. రంజాన్‌ఖాన్ సంస్కృతంలో పట్టభద్రుడు. తన కుటుంబం అనుసరిస్తున్న ఆచారాల విషయంలోగానీ, దేవాలయాల్లో భజనగీతాలు పాడటం విషయంలోగానీ ముస్లింలెవరూ అభ్యంతరం చెప్పలేదని ఆయనంటున్నాడు. సంస్కృతంపై తనకు వల్లమాలిన ప్రేమ ఉండబట్టే కుమారుణ్ణి ఆ భాషలో నిష్ణాతుడయ్యేలా ప్రోత్సహించానని చెబుతున్నాడు. ఫిరోజ్‌ఖాన్ సంస్కృత భాషపై చేసిన పరిశోధనైనా, ఆయన మాట్లాడే సంస్కృత భాషైనా అత్యున్నత ప్రమాణాలతో ఉన్నదని ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు తెలిపారు. ఈ విషయమే ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తెలియజెప్పి వారిని ఒప్పించాలని చూశారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ ఆందోళన కొనసాగినంతకాలం ఫిరోజ్‌ఖాన్ అజ్ఞాతవాసం గడపవలసి వచ్చింది. చిత్రమేమంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో సంస్కృత విభాగ అధిపతిగా ఉన్న సల్మా మఫీజ్కు ఇలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. అందరూ అత్యంత సంక్లిష్టమైనదిగా భావించే పాణిని విరిచిత సంస్కృత వ్యాకరణం అష్టాధ్యాయిని ఆమె అలవోకగా బోధిస్తారు. సంస్కృత భాషలో పాండిత్యం గడించిన తొలి ముస్లిం మహిళగా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్న 15మంది విద్యార్థులకు ఆమె గైడ్. వారణాసికి చరిత్రలో విశిష్ట స్థానముంది. అక్కడ షా జహాన్ చక్రవర్తి పెద్ద కుమారుడు దారా షికో సంస్కృత భాషను అధ్యయనం చేయడమే కాదు... అందులో నిష్ణాతుడై భగవద్గీతను, 52 ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. సాగర సంగమం పేరుతో హిందూ, ఇస్లాం, ఇతర మతాల మధ్య ఉన్న వైవిధ్యతలనూ, ఏకత్వాన్ని సోదాహరణంగా వివరిస్తూ పర్షియన్ భాషలో గ్రంథం రచించాడు. ఆయనకన్నా ఏడువందల ఏళ్ల ముందు అల్–బిరూని అనే ముస్లిం విద్యాధికుడు ఇప్పటి ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్ల నుంచి భారత్ వచ్చి సంస్కృతంలో పాండిత్యం గడించి ఈ దేశంలోని సంస్కృతి, మతం, జీవనవిధానం, తాత్విక చింతనలను చాటిచెబుతూ ఉద్గ్రంథాన్ని రచించాడు. పర్షియన్ ప్రపంచానికి హిందూ మతాన్ని పరిచయం చేసే వంద గ్రంథాలు వెలువరించాడు. సూఫీ కవి, పండితుడు అమిర్ ఖుస్రో వేదాల్ని, పురాణాల్ని ఔపోసన పట్టి, సంస్కృతంలోనే అనేక రచనలు చేశాడంటారు. ఆయన వచనంలోనూ, కవిత్వంలోనూ అడుగడుగునా అనేక సంస్కృత పదాలుంటాయి. వీరు మాత్రమే కాదు... యూరప్ దేశాలకు చెందిన ఎందరో సంస్కృతాన్ని నేర్చుకున్నారు. 1785లో చార్లెస్ విల్కిన్స్తో మొదలుపెట్టి జర్మనీకి చెందిన మాక్స్ ముల్లర్ వరకూ అనేకులు సంస్కృత కావ్యాలను, గ్రంథాలను ఇంగ్లిష్, జర్మన్ తది తర భాషల్లోకి అనువదించారు. కొందరు పర్షియన్ భాషలోకి అనువాదమైన సంస్కృత కావ్యాలను తర్జుమా చేశారు. సంస్కృతభాషను నిశితంగా అధ్యయనం చేసి భిన్న శతాబ్దాల్లో వెలువడిన సంస్కృత కావ్యాల్లోని భాషా ప్రయోగాల్లో చోటుచేసుకున్న మార్పులపై పరిశోధనలు చేసిన కొలం బియా యూనివర్సిటీ ప్రొఫెసర్ షెల్డన్ పొలాక్ వర్తమాన ప్రపంచంలోని సంస్కృత భాషా పండి తుల్లో అగ్రగణ్యుడు. భాష నేర్చుకోవడానికి కులమో, మతమో అడ్డురావడం అంతిమంగా దానికి ప్రతిబంధక మవుతుంది తప్ప అది విస్తరించడానికి దోహదపడదు. మన దేశంలో ఉన్న కుల వ్యవస్థ ఇలాంటి ప్రతిబంధకాలు సృష్టించబట్టే ఆర్యభట, కణాదుడు, వరాహమిహిరుడు, చరకుడు, సుశ్రుతుడు, బ్రహ్మగుప్తుడు తదితరులు సంస్కృత భాషలో అభివృద్ధి చేసిన ఎన్నో విజ్ఞానశాస్త్రాలు అనంతర కాలంలో విస్తరించలేకపోయాయి. నిజానికి ఇలాంటివి మనకు గుణపాఠాలు కావాలి. మన దృష్టి కోణాన్ని విశాలం చేయాలి. మరింతమంది ఫిరోజ్‌ఖాన్‌లు రూపొందేందుకు దోహదపడాలి. కానీ జరుగుతున్నదంతా అందుకు విరుద్ధం. అది విచారకరం. -
మూడేళ్లు..ఏడుగురు ఎస్సైలు
సాక్షి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజన తరువాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటైన కొత్త మండలం అది. పేరు తంగళ్లపల్లి. ఈ మండలానికి ఎస్సై ఎస్‌హెచ్‌వోగా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఠాణాలో పోస్టింగ్‌కు వచ్చిన ఏ ఎస్సై కూడా సగటున ఆరునెలలకు మించి పని చేయడం లేదు. పోలీస్‌శాఖలో ఎస్సై, సీఐ స్థాయిలో విధుల్లో చేరిన అధికారి కనీసం రెండేళ్లపాటు పని చేయడం ఆనవాయితీ. కానీ తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్ ఏర్పాటైన మూడేళ్లలో ఇప్పటికే ఏడుగురు ఎస్సై విధులు నిర్వర్తించడం గమనార్హం. నెల రోజుల కనిష్టకాలం నుంచి గరిష్టంగా 8 నెలలు మాత్రమే ఇక్కడ పని చేయడం గమనార్హం. ఎక్కువకాలం పని చేసిన ఎస్సైగా గురువారం బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఎస్సై వి.శేఖర్ రికార్డు దక్కించుకున్నారు. ఇసుక దందాతోనే... సిరిసిల్ల మండలంలో భాగంగా ఉన్న తంగళ్లపల్లిని జిల్లాల పునర్విభజన అనంతరం మండలంగా మార్చిన విషయం తెలిసిందే. సిరిసిల్ల పట్టణాన్ని ఆనుకొని ఉండే మానేరు కాలువ ఇసుక దందాకు పుట్టినిల్లు . తంగెళ్లపల్లి మండలంలోనే మానేరు వాగు ప్రధానంగా సాగుతుండడంతో లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇక్కడి నుంచి రాష్ట్ర రాజధాని వరకు తరలివెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరేళ్ల సంఘటన ఈ మండలంలోనే జరిగింది. ట్రక్కు ఓనర్లు, ట్రాక్టర్ ఓనర్లతోపాటు ఇసుక దందా సాగించే వారికి తంగెళ్లపల్లి మండలం కల్పతరువుగా మారింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎస్సై పోస్టింగ్‌కు చాలా డిమాండ్ . ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎస్సైలు ఆదాయం మీద దృష్టి పెట్టేవారో లేక అధికారుల మాట వినలేదోకానీ... మూణ్నాళ్ల ముచ్చటగానే పని చేసి వెళ్లడం జరుగుతోంది. తమకు సంబంధం లేకుండానే ఇసుక దందా ఉచ్చులోకి వెళ్లడమే ఎస్సైలు ఎక్కువ కాలం పని చేయకపోవడానికి కారణమని పోలీస్ ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. జిల్లాలో ఒకేసారి ముగ్గురు సీఐల బదిలీలు ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రక్షాళన దిశగా దృష్టిసారించారు. పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో ఇటీవల మొదలైన బదిలీల పర్వం కొనసాగుతోంది. ముగ్గురు సీఐలను ఏకకాలంలో బదిలీ చేసిన అధికారులు వారెవరికి పోస్టింగ్ ఇవ్వకుండా అటాచ్డ్ చేశారు. తాజాగా తంగెళ్లపల్లి ఎస్సై వి.శేఖర్‌ను కూడా స్పెషల్ బ్రాంచ్ నివేదిక ఆధారంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ బదిలీ చేశారు. ఈ ఎస్సై బదిలీకి కూడా ఇసుక దందానే ప్రధాన కారణం. తదుపరి విచారణ స్పెషల్ బ్రాంచ్ ద్వారా సాగనుంది. -
ఆ అధికారి బదిలీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం
సాక్షి,మేడ్చల్(హైదరాబాద్) : మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా రెవెన్యూ శాఖకు బదిలీ కావడం జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి అంచెలు అంచెలుగా ఎదిగిన శ్రీనివాస్‌రెడ్డి జాయింట్ కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు. మేడ్చల్ జాయింట్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదిన్నర కాలంలో రెవెన్యూశాఖలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం బొమ్మరాసిపేటలో రైతులను ఒప్పించి భూములను సేకరించగలిగారు. ప్రభుత్వ పథకాలు నేరుగా పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సందర్శకులు, బాధితులు ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తూ మర్యాదపూర్వకంగా మెలిగేవారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి ఆదేశాలను పాటిస్తూనే ఉద్యోగులందరితో ఐక్యంగా మెలుగుతూ మంచి అధికారిగా గుర్తింపు సాధించారు. జిల్లా ప్రజల హృదయాన్ని గెలుచుకున్న శ్రీనివాస రెడ్డి బదిలీ ఆగిపోతే బాగుంటుందని ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు. -
లాటరీ ఎంపిక ద్వారా హోంగార్డుల బదిలీ
సాక్షి, ఆదిలాబాద్ : లాటరీ ద్వారా ఎంపిక చేసి 209 మంది హోంగార్డులతో పాటు 38 మంది మహిళ హోంగార్డులను సైతం బదిలీలు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్విరామదంగా లాటరీ పద్ధతిన హోంగార్డుల బదిలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా హోంగార్డులకు కౌన్సెలింగ్ నిర్వహించి, అందరి ఆమోదం ప్రకారమే లాటరీ పద్ధతిని ఎంచుకున్నట్లు తెలిపారు. చిన్న జిల్లాలు ఏర్పడ్డాక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హోంగార్డులు దీర్ఘకాలంగా ఇతర జిల్లాలో పనిచేస్తున్నారని, వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని బదిలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. లాటరీ పద్ధతి ద్వారా నిర్మల్ జిల్లా 29+1, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 41+1, ఆదిలాబాద్ జిల్లా 61+36 హోంగార్డులను బదిలీ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో 38 మంది మహిళ హోంగార్డులు ఉన్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో స్థానికంగా ఉన్న హోంగార్డులే పని చేస్తున్నారని, అక్కడ బదిలీ సమస్య లేదన్నారు. లాటరీ ద్వారా బదిలీ ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. రోజువారీ విధులకు ఆటంకాలు కలగకుండా తుది ఉత్తర్వులు వెలువడిన అనంతరం కొంత మంది రిలీవ్ కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టీఎస్ రవి కుమార్, శిక్షణ కేంద్రం డీఎస్పీ ఎల్సి నాయక్, ఆదిలాబాద్ ఏఆర్ డీఎస్పీ సయ్యద్ సుజా ఉద్దీన్, పోలీస్ కార్యాలయం అధికారులు సందీప్, జగదీష్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ, ఆర్ఐలు ఓ.సుధాకర్‌రావు, వి.వామనమూర్తి, కె.ఇంద్రవర్ధన్, సిబ్బంది విఠల్, మదన్, భారత్ తదితరులు పాల్గొన్నారు. -
కమిషనర్ జనార్ధన్‌రెడ్డిపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్ : హెచ్ఎండీఏ కమిషనర్ బి. జనార్ధన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. సోమవారం ఉదయం జనార్ధన్‌రెడ్డిని హెచ్ఎండీఏ కమిషనర్ బాధ్యతలనుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోస్టింగ్ ఇవ్వకుండా ప్రస్తుతానికి వెయిటింగ్లో పెట్టింది ప్రభుత్వం. హెచ్ఎండీఏ కమిషనర్‌గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. విదేశీ పర్యటనలో ఉండగానే జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది. -
కొత్త కలెక్టర్‌గా లోకేష్ కుమార్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా నూతన కలెక్టర్‌గా డీఎస్ లోకేష్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సుదీర్ఘకాలం మన జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన ఎం.రఘునందన్‌రావు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లోకేష్ కుమార్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2003 బ్యాచ్‌కు చెందిన ఈయన స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. భార్య విజయేంద్ర కూడా ఐఏఎస్ అధికారే. ప్రస్తుతం ఆమె రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన కలెక్టర్‌గా లోకేష్ కుమార్ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. కాగా, 2015 జనవరి 12న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘునందన్‌రావు మూడున్నరేళ్లపాటు పనిచేశారు. జిల్లాలో అత్యధిక కాలం పనిచేసిన కలెక్టర్‌గా రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లోనూ ఆయన కీలక భూమిక పోషించారు. సంతృప్తితో వెళ్తున్నా.. హైదరాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ పొందిన రఘునందన్‌రావు ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే జనవరిలో అమెరికాకు వెళ్లనున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలో తాను సంతృప్తిగా పనిచేశానని చెప్పారు. ‘కలెక్టర్‌గా జిల్లాలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం ఎనలేని సంతృప్తినిచ్చింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టాను. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధుల నుంచి మంచి సహకారం లభించింది. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచారు’ అని రఘునందన్‌రావు తెలిపారు. -
అదనపు ఎస్పీ చంద్రశేఖర్ బదిలీ
ఏలూరు అర్బ¯ŒS : జిల్లా అడిషనల్ ఎస్పీ ఎ¯ŒS.చంద్రశేఖర్‌ను ఏసీబీ అడిషనల్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న వి.రత్నను జిల్లా అడిషనల్ ఎస్పీగా నియమిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ 2013 నవంబర్ 22న హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చారు. నాటి నుంచి ఆయన బాధ్యతల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు పలు కేసుల్లో చాకచక్యంగా నిందితులను గుర్తించడం, కేసులను ఛేదించడంలో ప్రముఖంగా వ్యవహరించారు. అదే సమయంలో చాలా సౌమ్యునిగా మంచిపేరు సంపాదించుకున్నారు. -
44 మంది ఐపీఎస్‌ల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల్ని పెద్ద ఎత్తున బదిలీ చేసింది. 44 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో ఎస్పీ నుంచి అదనపు డీజీ స్థాయి అధికారుల వరకు ఉన్నారు. 11 జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో సీనియర్ అధికారులు ఏఆర్ ఆనూరాధ, ఉమేష్ షరాఫ్, వీవీ శ్రీనివాసరావు, జితేందర్, యోగానంద్, ఏఎస్కే దాస్, దామోదర్, గంగాధర్, శివప్రసాద్, సూర్యప్రకాశరావు, డీఎస్ చౌహాన్ తదితరులున్నారు. టీటీడీ ముఖ్య భద్రత అధికారిగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.