సాక్షి, ఆదిలాబాద్ : లాటరీ ద్వారా ఎంపిక చేసి 209 మంది హోంగార్డులతో పాటు 38 మంది మహిళ హోంగార్డులను సైతం బదిలీలు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్విరామదంగా లాటరీ పద్ధతిన హోంగార్డుల బదిలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా హోంగార్డులకు కౌన్సెలింగ్ నిర్వహించి, అందరి ఆమోదం ప్రకారమే లాటరీ పద్ధతిని ఎంచుకున్నట్లు తెలిపారు.
చిన్న జిల్లాలు ఏర్పడ్డాక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హోంగార్డులు దీర్ఘకాలంగా ఇతర జిల్లాలో పనిచేస్తున్నారని, వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని బదిలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. లాటరీ పద్ధతి ద్వారా నిర్మల్ జిల్లా 29+1, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 41+1, ఆదిలాబాద్ జిల్లా 61+36 హోంగార్డులను బదిలీ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో 38 మంది మహిళ హోంగార్డులు ఉన్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో స్థానికంగా ఉన్న హోంగార్డులే పని చేస్తున్నారని, అక్కడ బదిలీ సమస్య లేదన్నారు. లాటరీ ద్వారా బదిలీ ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
రోజువారీ విధులకు ఆటంకాలు కలగకుండా తుది ఉత్తర్వులు వెలువడిన అనంతరం కొంత మంది రిలీవ్ కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టీఎస్ రవి కుమార్, శిక్షణ కేంద్రం డీఎస్పీ ఎల్‌సి నాయక్, ఆదిలాబాద్ ఏఆర్ డీఎస్పీ సయ్యద్ సుజా ఉద్దీన్, పోలీస్ కార్యాలయం అధికారులు సందీప్, జగదీష్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ, ఆర్‌ఐలు ఓ.సుధాకర్‌రావు, వి.వామనమూర్తి, కె.ఇంద్రవర్ధన్, సిబ్బంది విఠల్, మదన్, భారత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment