సెక్యూరిటీ లేని ‘మోసం’!
సాక్షి, హైదరాబాద్: తక్కువ వడ్డీకే రుణం.. ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు.. షరతులు అసలే లేవు.. ఇవే మాటలతో వందలాది మందిని మోసగించిందో ముఠా. నగరవాసి ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి రావడంతో గుర్గావ్, ఢిల్లీకి చెందిన ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. గుర్గావ్కు చెందిన మహిపాల్‌సింగ్ యాదవ్, ఢిల్లీ వాసులు విమల్ అరోరా, శాంతనూ కుమార్‌లను శనివారం గుర్గావ్లో అరెస్ట్ చేసి.. ట్రాన్సిట్ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు.
మరో ఇద్దరు నిందితులు సందీప్ జునేజా, రాకేశ్ శర్మ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఖుతుబుద్దీన్ రుణం పేరిట ఆరు లక్షల వరకు మోసపోయానని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి బాగోతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సోమవారం సీపీ మహేందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మహిపాల్‌సింగ్ 2005 నుంచి 2012 వరకు వివిధ కాల్ సెంటర్లలో వివిధ స్థాయిల్లో పనిచేశాడు.
2013 జూలైలో మై ఇన్వెస్ట్మెంట్ గురూజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను రాకేశ్ శర్మతో కలసి ప్రారంభించాడు. తొలినాళ్లలో సందీప్ జునేజాకు చెందిన వాల్యూ అడెడ్ కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వాల్యూ అడెడ్ కార్డ్స్ విక్రయించేవాడు. ఈ వ్యాపారం సక్సెస్ కాకపోవడంతో రుణాల పేరిట ప్రజలను మోసగించాలని జునేజాతో కలసి మహిపాల్ స్కెచ్ వేశాడు.
సెక్యూరిటీ, నిబంధనలు లేకుండా తక్కువ వడ్డీకే రుణమిస్తామని మై ఇన్వెస్ట్మెంట్ గురూజీ సర్వీసెస్ ద్వారా తతంగం నడిపించాడు. ఓకే అనుకున్న కస్టమర్‌కు ముందుగా అప్లికేషన్ పంపి.. ఆధార్, పాన్ కార్డ్ తదితర జిరాక్స్‌లు పంపాలని పోస్టల్ అడ్రస్ ఇచ్చేవారు. ఆ తర్వాత వాల్యూ ఫిన్వెస్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి లోన్ అప్రూవల్ అయిందనే సందేశాన్ని పంపేవారు.
ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 15 వేల నుంచి రూ. లక్ష వరకు.. ఆర్బీఐ, ఐటీ అధికారులను మేనేజ్ చేసేందుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు, వ్యాపారంలో నష్టం వస్తే ఇన్సూరెన్స్ కింద లక్ష.. ఇలా వివిధ రూపాల్లో రూ. ఐదు లక్షల వరకు డబ్బులు పిండుకునేవారు. ఇందుకోసం వివిధ బ్యాంక్ ఖాతాలు ఇచ్చేవారు. 30 బ్యాంక్ ఖాతాలు వీరి కంపెనీల పేరిట ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వాటిలో ఉన్న రూ. 1,51,49,675లను ఫ్రీజ్ చేశారు. కాగా, ఏపీ, తెలంగాణలో 118 మందితో కలిపి మూడు నెలల్లో 522 మంది బాధితులు ఉన్నట్టు నిం దితుల నుంచి సేకరించిన డాటా ప్రకారం పోలీసులు గుర్తించారు. ఈ సంఖ్య వేలల్లో ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.