Transponder
-
మలేషియా విమానం మాల్దీవ్స్ వైపు వెళ్లిందా?
మలేషియా నుంచి బయలుదేరి మధ్యలోనే మాయమైన ఎంహెచ్ 320 విమానం మాల్దీవ్స్ లో కనిపించిందా? విమానం మాయమైన మార్చి 6 నాడే మాల్దీవ్స్ లో చాలా తక్కువ ఎత్తునుంచి ఒక జంబోజెట్ విమానం వెళ్లినట్టు అక్కడి కుడా హువాధూ ద్వీసం ప్రజలు చెబుతున్నారు. ఈ కథనం స్థానిక హావీరు న్యూస్ లో ప్రచురితం అయింది కూడా. చాలా తక్కువ ఎత్తు నుంచి ఒక విమానం వెళ్లడం చూశామని చాలా మంది స్థానికులు చెబుతున్నారు. ఆ విమానం తెల్లగా ఉందని, దానిపైఎర్ర చారలు పెయింట్ చేశారని చెబుతున్నారు. మలేషియన్ విమానాల రంగు కూడా ఇదే. 'విమానం ఎంత కింద నుంచి వెళ్లిందంటే దాని తలుపులు, కిటికీలను సైతం గుర్తించగలిగాం. చెవులు పగిలిపోయేంత శబ్దం వచ్చింది' అని స్థానికులు అంటున్నారు. ఎన్నెన్నో ప్రశ్నలు? ఎంతెంతో కన్ఫ్యూజన్ రాడార్ల దృష్టి నుంచి తప్పించుకోవాలంటే విమానాలు చాలా తక్కువ ఎత్తున ఎగరాల్సి ఉంటుంది. అయిదు వేల అడుగుల కన్నా తక్కువ ఎత్తున వెళ్తేనే రాడార్ల డేగ కళ్ల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి మలేషియన్ పైలట్లు విమానాన్ని అంత తక్కువ ఎత్తునుంచి తీసుకువెళ్లారా? అందరూ భావిస్తున్నట్టు విమాన క్యాప్టెన్, కో పైలట్లే హైజాకర్లుగా మారి చేను మేసిన కంచెల్లా పనిచేశారా? లేక విమానంలోని పరికరాలు సరిగ్గా పనిచేయక, విమానాన్ని ఎదో ఒక రకంగా సురక్షితంగా దించేందుకు పైలట్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు విమానం కాక్ పిట్ లో ఉన్న వారు విలన్లా లేక హీరోలా? కో పైలట్ ఫారిక్ అబ్దుల్ హమీద్ ప్రేమలో పడ్డాడని, ఇంకో విమానంలో కో పైలట్‌గా ఉన్న నిద్రా రామ్లీ అనే అమ్మాయికి ప్రపోజ్ కూడ చేశాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడని, అలాంటి వాడు విలన్ గా మారాల్సిన అవసరం ఏముందని కూడా అతని మిత్రులు వాదిస్తున్నారు. మాకూ విమానం కనిపించిందోచ్! తమాషా ఏమిటంటే మాయమైన విమానం కోసం వెతుకుతున్న 26 దేశాల్లో మాల్దీవ్స్ లేదు. కాబట్టి విమానం మాల్దీవ్స్ దాటి మరే అజ్ఞాత ద్వీపానికైనా వెళ్లిందా? లేక సముద్రంలో కుప్పకూలిపోయిందా? మలేషియా, చైనా సహా 26 దేశాలు మలక్కా జలసంధి దగ్గర వెతకడం నీళ్లు లేని చోట గాలం వేయడం లాంటిదేనా? మరో వైపు థాయ్ లాండ్ ఏవియేషన్ అధికారులు కూడా సరికొత్తగా గొంతు విప్పి ట్రాన్స్‌పాండర్ ని ఆపేసిన కొద్ది సేపటి వరకూ తమ రేడార్లలో విమానం మినుకుమినుకుమని కనిపించిందని, విమానం ఆగ్నేయాసియాలోని మలక్కా జలసంధి వైపు వెళ్లిందని ప్రకటించింది. ఈ వివరాలను తాము ఇన్నాళ్ల వరకూ గమనించలేదని, పాత రికార్డులు తిరగేస్తే ఈ డేటా కనిపించి డంగైపోయామని వారంటున్నారు. దీంతో ఇప్పుడు అన్వేషణ చేస్తున్న వారు ఎటు వెతకాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు! -
నా సామిరంగా....మాకే ఆ విమానం దొరికుంటేనా!
మలేషియా విమానం ఎక్కడకి పోయింది? మా గగనతలం మీదుగా పోలేదు గాక పోలేదు అని భారత పాకిస్తాన్ లు ఢంకా బజాయించి చెబుతున్నాయి. సముద్రంలో శకలాలేవీ కనిపించడం లేదని సాటిలైట్లు చెబుతున్నాయి. సమగ్ర పరమాణు పరీక్షా నిషేద ఒప్పంద సంస్థ (సీటీబీటీఓ) అధ్యయనాల్లో గత పది పన్నెండు రోజుల్లో రికార్డు అయేంత గగన విస్ఫోటనం జరగనేలేదని చెబుతోంది. దీన్ని యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రతినిధఙ స్టిఫాన్ డుజారిక్ ధ్రువీకరిస్తున్నారు. సీటీబీటీఓ తాలూకు అంతర్జాతీయ మానిటరింగ్ వ్యవస్థ ఎలాంటి భారీ పేలుడునూ రికార్డు చేయలేదు. కాబట్లి విమానం పేలిపోయి ఉండకపోవచ్చునని ఆయన అంటున్నారు. మలేషియా సహా దాదాపు పన్నెండు దేశాల విమానాలు, యుద్ధ నౌకలు ఎడతెగకుండా గాలిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అన్వేషణ అంతాకజాకిస్తాన్, కిర్గిజిస్తాన్ ల నుంచి ఇండోనీషియా దాకా జరుగుతోంది. విమానాన్ని అయిదు వేల అడుగుల కన్నా తక్కువ ఎత్తున తీసుకువెళ్తే తప్ప రాడార్లను తప్పించుకోవడం సాధ్యం కాదంటున్నారు ఏవియేషన్ రంగ నిపుణులు. అనువైన చోటే ట్రాన్స్ పాండర్ స్విచాఫ్ చేశారా? మలేషియన్ అదికారులు మాత్రం విమానం సిబ్బంది, ముఖ్యంగా కాప్టెన్ జహారీ అహ్మద్ షా, కో పైల్ ఫరీక్ అబ్దుల్ హమీద్ ల పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల ఇళ్లలో సోదాలు జరిగాయి. ముఖ్యంగా మలేషియా, వియత్నాం దేశాల మధ్య ఉన్న బఫర్ ప్రాంతంలో ట్రాన్స్ పాండర్లను పైలట్లు స్విచాఫ్ చేయడం జరిగింది. దీంతో మలేషియా వియత్నాం విమానం కోసం వెతుకుతోందని, వియత్నాం మలేషియా వెతుకుతుందని భ్రమలో ఉన్నాయి. ఇరు దేశాలు మేల్కొనేసరికి ఆలస్యం అయిపోయింది. పైలట్లు ఒక పక్కా ప్రణాళికతోనే ఇదంతా చేశారని అనుమానాలు వ్యక్తమైఔతున్నాయి. అందుకే ఆల్ రైట్ గుడ్ నైట్ అని చెప్పి ట్రాన్స్ పాండర్ ను స్విచాఫ్ చేసి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. విమానం కాప్టెన్, కో పైలట్ లు విమానం ఎక్కే ముందు బోర్డింగ్ పాస్ లు చెక్ చేస్తున్న క్లిప్పింగ్ లు కూడా యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి. మాకే ఆ విమానం దొరికుంటేనా... అంటున్న తాలిబాన్లు మరో వైపు చాలా మంది ఈ విమానం తాలిబాన్ల ఇష్టారాజ్యమైన ఖైబర్ ఫక్తూన్ ఖ్వాకో లేక భారతీయ విమానాన్ని తీసుకెళ్లిన కాందహార్ కో తీసుకువెళ్లి ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు. పాక్-అఫ్గన్ సరిహద్దుల్లో ఎక్కడో ఒకక్కడ విమానం ఉండొచ్చునని కూడా అంచనాలు వేస్తున్నారు. అయితే 'అలాంటి విమానమేదీ మా ప్రభావ క్షేత్రంలో లేదు. ఈ విమానానికీ మాకూ ఎలాంటి సంబంధమూ లేదు' అని పాక్ తాలిబాన్ కమాండర్ జబీహుల్లా ముజాహిద్ చెబుతున్నారు. 'మేమెలాంటి ఆపరేషన్ చేయలేదు' అని ఆయన తేల్చి చెప్పారు. అక్కడితో ఆగకుండా ముజాహిద్ 'అసలు అలాంటి విమానమే కనుక మాకే కనుక దొరికి ఉంటే ....' అని కూడా అనేశారు. 'ఈ సంఘటన మా ఏరియాలో జరగలేదు. ఇది బయట జరిగింది. చాలా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశాలు గాలిస్తున్నాయి.' అన్నారు ముజాహిద్.