బీజేపీ చేతిలో మమత కీలుబొమ్మ!
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ చేతిలో కీలుబొమ్మని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదురి విమర్శించారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు ఏర్పాటు చేయదలిచే ఉమ్మడి పోరాట వేదికలో మమతకు స్థానం కల్పించకూడదన్నారు. మమత ఒక అవిశ్వసనీయ మిత్రురాలని, కాంగ్రెస్ను పణంగా పెట్టి జాతీయ నేతగా ఎదగాలనుకుంటున్నారని దుయ్యబట్టారు.
‘‘అన్నం పెట్టే చేతులను కరవడం ఆమెకు అలవాటు. ప్రతిపక్షాల ఐక్య వేదికకు ఆమెను దూరంగా ఉంచాలి. ఆమె బీజేపీ పంపిన ట్రోజన్హార్స్ (శత్రువును మాయ చేసేందుకు గ్రీకులు వాడిన సాధనం). బీజేపీపై యుద్ధంలో ఆమెను నమ్మకూడదు’’ అని అధిర్ విమర్శించారు. తన కుటుంబసభ్యులను, పార్టీ నేతలను సీబీఐ దాడుల నుంచి రక్షించుకునేందుకు మమత ప్రధాని చెప్పినట్లు నడుచుకుంటారని, ఇందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే బీజేపీ లక్ష్య సాధనకు పరోక్షంగా సహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతకు టీఎంసీ వెన్నుపోటుదారన్నారు.
తొక్కేసి ఎదుగుతున్నారు
బెంగాల్లో కాంగ్రెస్ను పణంగా పెట్టి టీఎంసీ ఎదిగిందని, ఇప్పుడు జాతీయవ్యాప్తంగా ఇదే ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఇటీవల కాలంలో కీలక నేతలు టీఎంసీలో చేరడం కాంగ్రెస్లో కలకలం సృష్టించింది. దీంతో టీఎంసీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని మమత కలలు కంటున్నారని, వారికి కాంగ్రెస్ అడ్డంకిగా ఉందని అధిర్ చెప్పారు. కాంగెస్ర్ ఉన్నంతకాలం ఆమెను ప్రతిపక్ష ఉమ్మడి నేత కానీయమని, ఇది తెలిసే ఆమె కాంగ్రెస్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని విమర్శించారు.
మోదీకి దీటైన నేత రాహుల్ కాదు, మమత అని టీఎంసీ మీడియాలో రావడంపై ఆయన స్పందించారు. వారివి పిచ్చివాళ్ల ఊహలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్కు రాహుల్ గాంధీ సమర్ధవంతమైన ప్రతిజోడి అని అధిర్ చెప్పారు. దేశంలో ఇంకా కాంగ్రెస్కు 20 శాతం ఓట్ల వాటా ఉందని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీకి తప్ప మరే పార్టీకి ఇంత ఓట్ల వాటా లేదన్నారు. అందువల్ల ప్రతిపక్ష ఉమ్మడి నాయకత్వానికి కాంగ్రెస్ సహజ ఎంపికని అభివర్ణించారు. తమ పార్టీ లేకుండా యాంటీ బీజేపీ కూటమి ఏర్పడడం కల్ల అని చెప్పారు. పంజాబ్లో సంక్షోభం త్వరలో సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.