TRS Merge in Congress
-
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే..?
టీఆర్ఎస్ ముఖ్యులతో కేసీఆర్ ఆరా కాంగ్రెస్‌తో కుదిరేటట్టు లేదు ఆ పార్టీకి దిమ్మతిరగాలంటే బీజేపీతో పొత్తే కరెక్ట్ సాక్షి, హైదరాబాద్: ‘‘పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్‌తో విలీనం, పొత్తు వంటివి కుదిరేటట్టు కనిపించడం లేదు. ప్రత్యామ్నాయంగా బీజేపీతో జతకడితే ఫలితాలు ఎలా ఉంటాయి’’ అని పార్టీ ముఖ్యులను టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆరా తీశారు. బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ గురువారం మెదక్ జిల్లాలోని ఫాంహౌస్‌కు చేరుకుని పార్టీ ముఖ్యనేతలతో అక్కడ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో జరుగుతున్న చర్చలు, విలీనం చేశాక టీఆర్ఎస్ పాత్ర, ఒంటరిగా పోటీచేస్తే ఉత్పన్నమయ్యే పరి స్థితులు, ఫలితాలు, హైదరాబాద్‌లో స్వాగత ర్యాలీ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించా రు. ‘‘విలీనం చేయాలని కోరడం తప్ప మనం అడిగిన అంశాలపై కాంగ్రెస్ నోరు విప్పట్లేదు. ఇదొకవైపు ఉండగానే మనల్ని విభేదించిన విజయశాంతి, అరవింద్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఇదేం పద్ధతి? ఇవన్నీ చూస్తుంటే మనల్ని తక్కువగా అంచనా వేస్తున్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే బీజేపీతో కలసి పోతే చాలు. కాంగ్రెస్‌కు దిమ్మ దిరిగిపోతది. కేంద్రంలో మంచి అవకాశం వస్తది. అవసరమైతే ఎన్డీయే కన్వీనర్‌ను కూడా చేస్తరు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే తెలంగాణలో దాదాపు 30 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు కీలకం అవుతాయని, వారి ఓట్లు వ్యతిరేకమైతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలాంటి వాటిపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయాలని పార్టీ ముఖ్యులకు కేసీఆర్ సూచించారు. విలీనం లేదా పొత్తు వంటివాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రజల్లో ఎలాంటి భావనలు ఉన్నాయో అధ్యయనం చేయాలని కోరారు. ఏదేమైనా జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ ఆందోళనగా కనిపించారని పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. ఈ సమావేశంలో నేతలు కె.కేశవరావు, ఎంపీలు మందా జగన్నాథం, జి.వివేక్, ముఖ్యనేతలు కె.తారక రామారావు, టి.హరీష్‌రావు, ఈటెల రాజేందర్, బి.వినోద్‌కుమార్, ఎస్.మధుసూదనాచారి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకోగానే అక్కడున్న కూలీలు బాణసంచాను కాల్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు కేసీఆర్‌కు వారు శుభాకాంక్షలను తెలియజేశారు. నేడు ఎమ్మెల్యేల చేరికలు: టీడీపీ ఎమ్మెల్యేలు జి.నగేశ్, పి.మహేందర్‌రెడ్డి, కె.ఎస్.రత్నం, ఎమ్మెల్సీ పి.నరేందర్ రెడ్డి తదితరులు శుక్రవారం టీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ సమక్షంలో వీరు చేరతారు. మరో వారంలో టీడీపీకే చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
అంతర్మథనం
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీన అంశం తెరపైకి రావడంతో ఆ పార్టీలోని పలువురు జిల్లా నేతలలో అంతర్మథ నం మొదలైంది. విలీనమైనా, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినా, తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని టిక్కెట్టు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన నేతలున్నారు. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వంటి నేత లు అటు అధిష్టానం వద్ద, ఇటు రాష్ట్ర రాజకీయాలలోనూ కీలక పాత్రను పోషిస్తున్నారు. విలీనం జరిగినా.. కలిసి పోటీ చేసినా వీరిని కాదని తమకు టిక్కెట్లు దక్కుతాయో లేదోనని పలువురు గులాబీ నేతలకు సందేహం పట్టి పీడిస్తోంది. వ్రతం చెడినా.. ఫలం దక్కేనా డీఎస్ ప్రధాన అనుచరులలో ఒకరైన బస్వ లక్ష్మీనర్సయ్య నిజామాబాద్ అర్బన్ టిక్కెట్టును ఆశించి టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి డీఎస్‌ను కాదని తనకు టిక్కె ట్టు దక్కుతుందా? అని బస్వ సంశయం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన అనుచరులు చర్చించుకుం టున్నారు. ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీ తొలి అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పేరును అధికారికంగానే ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఉన్నారు. తెలంగాణపై యూపీఏ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ఈయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతినిధిగా హాజరై తన గళాన్ని విని పించారు. ఇక్కడ సురేశ్‌రెడ్డిని కాదని.. టీఆర్ఎస్ ప్రకటించినట్లు జీవన్‌రెడ్డి అభ్యర్థిగా ఉంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి స్థానం నుంచి ఇరు పార్టీల నుంచి అగ్రనేతలే ఉన్నారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్అలీలలో ఎవరో ఒకరే పోటీకి దిగాల్సి వస్తుంది. దీంతో ఎవరు ప్రత్యామ్నాయ స్థానానికి వెళతారో తెలియదు. జిల్లాలో మరి కొన్ని స్థానాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడలా... ఇప్పుడు? తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ఇన్నాళ్లు నాన్చు డు ధోరణిని అవలంభించడంతో టీఆర్ఎస్లోకి భారీగా వలసలు పెరిగాయి. అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు టీఆర్ఎస్లో చేరేం దుకు మొగ్గు చూపారు. అధికార పార్టీ నుంచి కూడా పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా రు.కొందరు నేతలు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఇప్పుడు యూపీఏ సర్కారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడం, ఆ దిశగా వేగంగా పావులు కదుపుతుండటంతో రాష్ట్రంతో పాటు జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారిపోతోంది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టిన తర్వాతే విలీన అంశంపై స్పందిస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో విలీనం లేనట్లేనని నిర్ధారణ జరగకపోవడంతో ఈ చర్చంతా సాగుతోంది.