అంతర్మథనం | is trs planning to merge in congress? | Sakshi
Sakshi News home page

అంతర్మథనం

Published Wed, Aug 7 2013 3:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

is trs planning to merge in congress?

 సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీన అంశం తెరపైకి రావడంతో ఆ పార్టీలోని పలువురు జిల్లా నేతలలో అంతర్మథ నం మొదలైంది. విలీనమైనా, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినా, తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని టిక్కెట్టు ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన నేతలున్నారు. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వంటి నేత లు అటు అధిష్టానం వద్ద, ఇటు రాష్ట్ర రాజకీయాలలోనూ కీలక పాత్రను పోషిస్తున్నారు. విలీనం జరిగినా.. కలిసి పోటీ చేసినా వీరిని కాదని తమకు టిక్కెట్లు దక్కుతాయో లేదోనని పలువురు గులాబీ నేతలకు సందేహం పట్టి పీడిస్తోంది.
 
 వ్రతం చెడినా.. ఫలం దక్కేనా
 డీఎస్ ప్రధాన అనుచరులలో ఒకరైన బస్వ లక్ష్మీనర్సయ్య నిజామాబాద్ అర్బన్ టిక్కెట్టును ఆశించి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి డీఎస్‌ను కాదని తనకు టిక్కె ట్టు దక్కుతుందా? అని బస్వ సంశయం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన అనుచరులు చర్చించుకుం టున్నారు. ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీ తొలి అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పేరును అధికారికంగానే ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఉన్నారు. తెలంగాణపై యూపీఏ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ఈయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతినిధిగా హాజరై తన గళాన్ని విని పించారు. ఇక్కడ సురేశ్‌రెడ్డిని కాదని.. టీఆర్‌ఎస్ ప్రకటించినట్లు జీవన్‌రెడ్డి అభ్యర్థిగా ఉంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి స్థానం నుంచి ఇరు పార్టీల నుంచి అగ్రనేతలే ఉన్నారు. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీలలో ఎవరో ఒకరే పోటీకి దిగాల్సి వస్తుంది. దీంతో ఎవరు ప్రత్యామ్నాయ స్థానానికి వెళతారో తెలియదు. జిల్లాలో మరి కొన్ని స్థానాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 అప్పుడలా... ఇప్పుడు?
 తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ఇన్నాళ్లు నాన్చు డు ధోరణిని అవలంభించడంతో టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు పెరిగాయి. అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేం దుకు మొగ్గు చూపారు. అధికార పార్టీ నుంచి కూడా పలువురు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నా రు.కొందరు నేతలు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఇప్పుడు యూపీఏ సర్కారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడం, ఆ దిశగా వేగంగా పావులు కదుపుతుండటంతో రాష్ట్రంతో పాటు జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారిపోతోంది. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టిన తర్వాతే విలీన అంశంపై స్పందిస్తానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో విలీనం లేనట్లేనని నిర్ధారణ జరగకపోవడంతో ఈ చర్చంతా సాగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement