బీజేపీతో పొత్తు పెట్టుకుంటే..? | is trs planning alliance with bjp ? | Sakshi
Sakshi News home page

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే..?

Published Fri, Feb 28 2014 12:40 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే..? - Sakshi

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే..?

టీఆర్‌ఎస్ ముఖ్యులతో కేసీఆర్ ఆరా
 కాంగ్రెస్‌తో కుదిరేటట్టు లేదు
 ఆ పార్టీకి దిమ్మతిరగాలంటే బీజేపీతో పొత్తే కరెక్ట్

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్‌తో విలీనం, పొత్తు వంటివి కుదిరేటట్టు కనిపించడం లేదు. ప్రత్యామ్నాయంగా బీజేపీతో జతకడితే ఫలితాలు ఎలా ఉంటాయి’’ అని పార్టీ ముఖ్యులను టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆరా తీశారు. బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ గురువారం మెదక్ జిల్లాలోని ఫాంహౌస్‌కు చేరుకుని పార్టీ ముఖ్యనేతలతో అక్కడ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో జరుగుతున్న చర్చలు, విలీనం చేశాక టీఆర్‌ఎస్ పాత్ర, ఒంటరిగా పోటీచేస్తే ఉత్పన్నమయ్యే పరి స్థితులు, ఫలితాలు, హైదరాబాద్‌లో స్వాగత ర్యాలీ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించా రు.
 
 ‘‘విలీనం చేయాలని కోరడం తప్ప మనం అడిగిన అంశాలపై కాంగ్రెస్ నోరు విప్పట్లేదు. ఇదొకవైపు ఉండగానే మనల్ని విభేదించిన విజయశాంతి, అరవింద్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఇదేం పద్ధతి? ఇవన్నీ చూస్తుంటే మనల్ని తక్కువగా అంచనా వేస్తున్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే బీజేపీతో కలసి పోతే చాలు. కాంగ్రెస్‌కు దిమ్మ దిరిగిపోతది. కేంద్రంలో మంచి అవకాశం వస్తది. అవసరమైతే ఎన్డీయే కన్వీనర్‌ను కూడా చేస్తరు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే తెలంగాణలో దాదాపు 30 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు కీలకం అవుతాయని, వారి ఓట్లు వ్యతిరేకమైతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలాంటి వాటిపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయాలని పార్టీ ముఖ్యులకు కేసీఆర్ సూచించారు.
 
 విలీనం లేదా పొత్తు వంటివాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రజల్లో ఎలాంటి భావనలు ఉన్నాయో అధ్యయనం చేయాలని కోరారు. ఏదేమైనా జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ ఆందోళనగా కనిపించారని పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. ఈ సమావేశంలో నేతలు కె.కేశవరావు, ఎంపీలు మందా జగన్నాథం, జి.వివేక్, ముఖ్యనేతలు కె.తారక రామారావు, టి.హరీష్‌రావు, ఈటెల రాజేందర్, బి.వినోద్‌కుమార్, ఎస్.మధుసూదనాచారి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకోగానే అక్కడున్న కూలీలు బాణసంచాను కాల్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు కేసీఆర్‌కు వారు శుభాకాంక్షలను తెలియజేశారు.
 
 నేడు ఎమ్మెల్యేల చేరికలు: టీడీపీ ఎమ్మెల్యేలు జి.నగేశ్, పి.మహేందర్‌రెడ్డి, కె.ఎస్.రత్నం, ఎమ్మెల్సీ పి.నరేందర్ రెడ్డి తదితరులు శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ సమక్షంలో వీరు చేరతారు. మరో వారంలో టీడీపీకే చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement