కశ్మీర్లో కర్ఫ్యూ వాతావరణం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. పెట్రోల్ బాంబు దాడిలో గాయపడిన ట్రక్ నిర్వాహకుడు జహీద్ మరణించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జహీద్ మృతికి నిరసనగా వేర్పాటువాదులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు పలువురు వేర్పాటు వాదులను గృహనిర్బంధం చేశారు. కశ్మీర్లో 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫూ తరహా ఆంక్షలు విధించారు. కాగా అనంతనాగ్, శ్రీనగర్ ప్రాంతాల్లో నిరసన జ్వాలలు మిన్నంటాయి. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
గోవధ చేశాడనే కారణంతో అనంతనాగ్‌కు చెందిన జహీద్‌పై ఈ నెల 9న దుండుగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. జహీద్ పాటు ట్రక్ డ్రైవర్ షౌకత్ అహ్మద్ కూడా గాయపడ్డారు. జహీద్ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.