డిపాజిట్‌దారులకు భారీ ఊరట!
- టీఎస్‌పీడీఎఫ్ చట్టంలో కీలక సవరణ
- చార్జ్‌షీట్ దాఖలుకు ఇన్స్పెక్టర్లూ అర్హులే
సాక్షి, హైదరాబాద్: బోగస్ ఆర్థిక సంస్థల్ని నమ్మి, డిపాజిట్లు పెట్టి నిండా మునిగిన డిపాజిట్‌దారులకు పెద్ద ఊరటే లభించింది. ఈ కేసుల దర్యాప్తులో ప్రధాన అడ్డంకిగా ఉన్న ‘చార్జ్‌షీట్ అధికారాల’సమస్యకు హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు మార్గం కనిపెట్టారు. ఇన్స్పెక్టర్ కంటే తక్కువ స్థాయి కాని వారు అభియోగపత్రాలు దాఖలు చేయవచ్చంటూ తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (టీఎస్‌పీడీఎఫ్) రూల్స్‌కు కీలక సవరణకు తీసుకువచ్చారు. సీసీఎస్ అధికారులు రూపొందించిన సవరణ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి కేవలం నగరానికే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ వర్తిస్తాయని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’కి తెలిపారు.
ఆస్తుల స్వాధీనానికి ఆస్కారం...
ఆర్థికాంశాలు ముడిపడి ఉన్న ప్రతి కేసులోనూ టీఎస్‌పీడీఎఫ్ చట్టాన్ని ప్రయోగించడానికి ఆస్కారం లేదు. ఏఏ ఉదంతాల్లో అయితే నిందితులు బాధితుల నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బు సేకరిస్తారో వాటిలో మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. మిగిలిన చట్టాల కింద నమోదైన కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు వారి ఆస్తులు మొత్తాన్ని స్వాధీనం చేసుకునే ఆస్కారం లేదు. కేవలం ఆ నేరానికి సంబంధించిన డబ్బుతో సమీకరించుకున్న వాటినే సీజ్ చేయాలి. అయితే టీఎస్‌పీడీఎఫ్ చట్టం కింద నమోదైన కేసుల్లో మాత్రం నిందితులతో వారి సన్నిహితుల ఆస్తుల్ని సైతం స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇలా సీజ్ చేస్తున్న ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి పంపడం ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని పోలీసు విభాగం న్యాయస్థానానికి అప్పగిస్తుంది. నిందితులపై నేరం రుజువై, దోషులుగా తేలిన తర్వాత వేలం వేసి, అలా వచ్చిన డబ్బును బాధితులకు పంచే ఆస్కారం ఉంటుంది.
సవరణ ప్రతిపాదించిన సీసీఎస్...
గతంలో ఈ తరహా కేసుల్లో పోలీసు కమిషనర్/జిల్లా కలెక్టర్ మాత్రమే అభియోగపత్రాలు దాఖలు చేసే ఆస్కారం ఉంది. అలా కాకుండా దర్యాప్తు అధికారులు అభియోగపత్రాలు దాఖలు చేస్తే నిబంధనలకు విరుద్ధం కావడంతో న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. దీంతో ఏళ్లుగా అనేక కేసులు పెండింగ్‌లో ఉండిపోయి బాధితులకు ఊరట లభించట్లేదు. ఒక్క సీసీఎస్‌లోనే దాదాపు 50 కేసులో ఈ కారణంగా పెండింగ్‌లో ఉండిపోయాయి.
నగర నేర పరిశోధన విభాగం డీసీపీగా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించిన తరువాత టీఎస్‌పీడీఎఫ్ చట్టం కింద నమోదైన కేసులు అనేకం పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీయగా... అభియోగపత్రాలు దాఖలు అధికారం అంశం బయటపడింది. దీంతో ఇన్స్పెక్టర్ కంటే తక్కువ స్థాయి కాని అధికారి ఎవరైనా అధీకృతులే అని, వారు అభియోగపత్రాలు దాఖలు చేయవచ్చంటూ సవరణకు ప్రతిపాదించారు. దీనికి ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీసీఎస్‌లో ఉన్న టీఎస్‌పీడీఎఫ్ కేసుల్లో అభియోగపత్రాలు దాఖలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.