26న చేవెళ్లలో ‘టీ’ టీడీపీ విజయోత్సవ సభ
సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ క్రెడిట్ దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు రెడీ అవుతున్నారు. ‘మేం లేఖ ఇవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందనే’ ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందులోభాగంగా తెలంగాణ వ్యాప్తంగా ‘టీ’ విజయోత్సవ సభలు నిర్వహిం చాలని సంకల్పించింది.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 26న చేవెళ్లలో ‘తెలంగాణ విజయోత్సవ సభ’ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఘనత మాదంటే మాదని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వాదిస్తున్న క్రమంలో టీడీపీ కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీలకంటే ముందుగానే విజయోత్సవ సభల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ క్రమంలోనే చేవెళ్లలో 26న జరిగే ప్రతిష్టాత్మక సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది.
విజయం మనదే: దేవేందర్‌గౌడ్
తెలంగాణ పోరాటంలో టీడీపీ ఎనలేనిపాత్ర పోషించిందని రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లోనూ జిల్లాలో టీడీపీ విజయఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చింది మనమేననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపుని చ్చారు. మరో వారం, పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నందున శ్రేణులను కార్యోన్ముఖులను చేయాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కేఎస్ రత్నం, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, పార్టీ నేతలు తీగల కృష్ణారెడ్డి, సుభాష్‌యాదవ్, ఉదయ్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.