హైదరాబాద్:తెలుగుదేశం పార్టీని వీడేందుకు టీ.టీడీపీ ఎమ్మెల్యేలు సన్నద్ధమవుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టమైన వైఖరి తెలపకపోవడంతో ఆ ప్రాంతానికి చెందిన పలువరు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకొచ్చేందుకు సిద్ధమైయ్యారు. ఎమ్మెల్యేలు నగేశ్, సత్యవతి రాథోడ్ లు టీడీపీని విడిచిపెట్టి టీఆర్ఎస్ లో చేరనున్నారు. వీరు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర రావు టీ.టీడీపీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ లో చంద్రబాబుకు అందజేశారు.
ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఎర్రబెల్లి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్నరాజకీయ పరిణామాలను చూస్తే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైన నేపథ్యంలో ఎర్రబెల్లి తన రాజకీయ భవితవ్యంపై పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విఫలయత్నం చేశారని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. తమ పార్టీలో స్థానం లేదని స్పష్టం చేశారని, ఈ పరిస్థితుల్లో మరో ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ లో చేరేందుకు మార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.