Tufan vechicle
-
రహదారి రక్తసిక్తం
కల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం బాచేపల్లి చందర్‌నాయక్ గేట్ సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారిపై లారీ, తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన ఒకే కుటుంబానికి సంబంధించిన 14 మంది హైదరాబాద్‌లో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు తుఫాన్ వాహనంలో బయలు దేరారు. వీరి వాహనం మార్గమధ్యలో చందర్‌నాయక్ తండా గేట్ వద్దకు రాగానే నిజాంపేట వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో తుఫాన్ వాహనం డ్రైవర్ షేక్ మన్నాన్(35), శిరిసింబే శివానీ(20)లు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మన్నాన్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోగా స్థానికులు, పోలీసులు వచ్చి బయటికి తీశారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. క్షతగాత్రుల్లో రజని(60), చిప్తి అనే 7 నెలల చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. మిగతావారిలో అర్చన, సంధ్య, మహదేవి, ప్రథమేశ్, ప్రగతి, లత, స్వాతి, అశోక్‌తోపాటు మొత్తం 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరి ల్లింది. రోడ్డంతా రక్తసిక్తమై భయానకంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణరాజు, కంగ్టి సీఐ తిరుపతియాదవ్ సందర్శించారు. కల్హేర్ ఎస్ఐ ఎం.స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పంది రూపంలో వచ్చిన మృత్యువు
ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్) : పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అడ్డువచ్చిన అడవి పందిని తప్పించబోయి ఓ వాహనం బోల్తా పడడంతో ముగ్గురు చెందారు. 11 మంది గాయపడ్డారు. ఖానాపూర్ మండలం పులిమడుగు గ్రామపంచాయతీ పరిధి అందోలి గ్రామం వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ కడారి వినోద్ తెలిపిన వివరాలివీ.. కుమురంభీం జిల్లా జైనూర్ మండలం జంగాం గ్రామంలో ఓ ఇంట్లో ఈ నెల 26న పెళ్లి ఉండడంతో నిజామాబాద్‌కు చెందిన బంధువులు వెళ్లారు. 28న మహారాష్ట్ర కిన్వట్లో జరిగిన రిసెప్షన్‌కు కూడా హాజరై తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఖానాపూర్ మండలంలోని పులిమడుగు గ్రామపంచాయతీ పరిధి అందోలి గ్రామం వద్ద తుఫాన్ (ఏపీ33బి5900) వాహనానికి అడవి పంది అడ్డు రావడంతో తప్పించబోయి బోల్తా పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ సలీం (35), బాబు మియా (40) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన బోధన్ సాలూర గ్రామానికి చెందిన బాబు ఖురేషి (55) ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడ్డ ఫర్హాన, రెహాన, గోరీబీ, షేక్ ఫరీన, మహిబూబ్బీ, అబ్దుల్ ఖాజీ, ఆబిదాబేగం, రుక్సాన్, డ్రైవర్ రబ్బానీ, ఘుడూతోపాటు అజీజ్‌లను 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలాన్ని సీఐ వినోద్ సందర్శించి మృతదేహాలను ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు పంపించారు. మృతుల బంధువైన అజీజ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబాల్లో అలుముకున్న విషాదం పెళ్లికి వెళ్లి అరగంట అయితే తమ ఇళ్లకు వెళ్తామనుకునే తరుణంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఇటు జంగాం బంధువుల ఇళ్లతోపాటు అటు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా మృతుల్లో షేక్ సలీం, బాబు ఖురేషీలు అన్నదమ్ముళ్లు. నిజామాబాద్ జిల్లా శాంతినగర్ కాలనీకి చెందిన వారు కాగా మేనమామ అయిన బాబుమియా బోధన్ మండలం సరూర్‌నగర్‌కు చెందిన వారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న మండలవాసులు, బంధువులు ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
మాజీ ఎమ్మెల్యే రాంబాబుకు తప్పిన ప్రమాదం
ప్రకాశం: ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే రాంబాబుకు బుధవారం రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన వెళుతున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో రాంబాబుతోపాటు మరో ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కొనకలమెట్ల మండలం పాతపాడు వద్ద చోటుచేసుకుంది. గాయపడిని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.