ప్రమాదానికి గురైన లారీ, తుఫాన్ వాహనం
కల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం బాచేపల్లి చందర్‌నాయక్ గేట్ సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారిపై లారీ, తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన ఒకే కుటుంబానికి సంబంధించిన 14 మంది హైదరాబాద్‌లో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు తుఫాన్ వాహనంలో బయలు దేరారు. వీరి వాహనం మార్గమధ్యలో చందర్‌నాయక్ తండా గేట్ వద్దకు రాగానే నిజాంపేట వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో తుఫాన్ వాహనం డ్రైవర్ షేక్ మన్నాన్(35), శిరిసింబే శివానీ(20)లు అక్కడికక్కడే మృతి చెందారు.
డ్రైవర్ మన్నాన్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోగా స్థానికులు, పోలీసులు వచ్చి బయటికి తీశారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. క్షతగాత్రుల్లో రజని(60), చిప్తి అనే 7 నెలల చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. మిగతావారిలో అర్చన, సంధ్య, మహదేవి, ప్రథమేశ్, ప్రగతి, లత, స్వాతి, అశోక్‌తోపాటు మొత్తం 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరి ల్లింది. రోడ్డంతా రక్తసిక్తమై భయానకంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణరాజు, కంగ్టి సీఐ తిరుపతియాదవ్ సందర్శించారు. కల్హేర్ ఎస్‌ఐ ఎం.స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment