పిడుగుపాటుకు ముగ్గురు మృతి
బయ్యారం, న్యూస్‌లైన్: పిడుగు ముగ్గురిని బలితీసుకుంది. బయ్యారం మండలంలోని తులారం ప్రాజెక్టు అలుగుల వద్ద మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నా యి. మండలంలోని గౌరారం పంచాయతీ వినోభానగర్‌కు చెందిన జవ్వాది వెంకటమ్మ(50), ఆమె కుమార్తె శ్రీలత(21)తో పాటు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగలివారిపేటకు చెందిన బబ్లు(12)(వెంకటమ్మ మరో కుమార్తె కొడుకు) బట్టలు ఉతికేందుకు తులారం ప్రాజెక్టు వద్దకు మంగళవారం సాయంత్రం వెళ్లారు.
ఈ క్రమంలో పిడుగులతో భారీ వర్షం కురిసింది. చీకటి పడుతున్నా వారు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా బబ్లు తులారం ప్రాజెక్టు వద్ద నీటిలో తేలుతూ కనిపించాడు. ఉతికేందుకు తీసుకెళ్లిన దుస్తులు చిందరవందగా పడిపోయి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన వారు నీటిలో చూడగా వెంకటమ్మ, ఆమె కుమార్తె శ్రీలత మృతదేహాలు లభించాయి. వారు దుస్తులు ఉతికేందుకు వెళ్లిన సమయంలో అక్కడ పిడుగు పడిందని, పిడుగు పాటుకే వారు మృతి చెందారని స్థానికులు అంటున్నారు.