Tuvalu: ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశం.. ఉనికి మాటేమిటి?!
తాజాగా ఈజిప్టులో ముగిసిన కాప్ 27 సదస్సు మరోసారి ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాలపై చర్చకు వేదిక అయ్యింది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో జరిగిన ఈ సమావేశం చివరకు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోగలిగినందుకు సంతోషించాల్సిందే. పర్యావరణ మార్పుల వల్ల నష్టపోతున్న బడుగు దేశాలను ఆదుకోవడానికి ప్రత్యేక నిధి ఏర్పాటుకు ఈ సమావేశంలో అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. వాస్తవంగా ప్రపంచం పర్యావరణ ప్రమాదం బారిన పడటానికి ప్రధాన కారణం కాలుష్య కారకాలుగా మారిన ఈ అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలే. గ్రీస్హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవాల్సిన బాధ్యత ఈ దేశాల పైనే ఉంటుంది. అది ఒక చర్చనీయాంశం.
ఈ సమావేశం సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించింది పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం ‘టువాలు’. ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలో జరిగిన కాప్ 27 సమావేశంలో టువాలు ప్రపంచం ముందు ఒక సవాలుగా నిలబడింది. ప్రపంచ బాధ్యతను గుర్తు చేసింది. వేగంగా జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన అంశమే. ఈ పెరుగుదల ఇలానే కొనసాగితే మరో 60, 70 ఏళ్ళల్లో ఈ ద్వీప దేశం జల సమాధి కాకుండా ఎవరూ ఆపలేరు. టువాలు మొత్తం 9 ద్వీపాల సమూహం. హవాయి, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఒకదాని వెంట ఒకటిగా చిన్న చిన్న దీవులు బారులు తీరి ఉంటాయి. దేశం మొత్తం కేవలం 26 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే సుమారు 6400 ఎకరాలు. 2022 జనాభా అంచనా ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 11 వేల 200. బ్రిటన్ నుండి 1978లో స్వాతంత్య్రం పొందింది. ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి హైదరాబాద్ నగరం 542 మీటర్ల ఎత్తున ఉంటే... సముద్రం ఒడ్డునే ఉన్న విశాఖపట్నం 45 మీటర్ల ఎత్తున ఉంది. దీన్ని బట్టి టువాలు పరిస్థితిని అంచనా వేయవచ్చు.
సముద్ర మట్టానికి ఇంకా తక్కువలో ఉన్న మరో ద్వీప దేశం మాల్దీవులు. సముద్ర మట్టాలు పెరుగుతున్న కొద్దీ ఈ దేశాల ఉనికి ప్రమాదం దిశగా పయనిస్తున్నట్లే. టువాలు కంటే ఆర్థికంగా కాస్త బలమైన మాల్దీవులు తమ దేశాన్ని కాపాడు కోవటానికి తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. 20 వేల మంది జనాభాకు కృత్రిమంగా నిర్మిస్తున్న ఫ్లోటింగ్ సిటీ ఆవాసంగా మారనుంది. ఇటువంటి ఏర్పాట్లు చేసుకునే స్థోమత టువాలుకి లేదు. అందుకే అది తమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, భౌగోళిక స్వరూపం, రోడ్లు, నిర్మాణాలు.. మొత్తంగా తన అస్తిత్వాన్ని భద్ర పరుచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.
తమ దేశాన్ని వర్చ్యువల్ రియాలిటీ సాంకేతికత ఉపయోగించి ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశంగా అయినా మార్చాలనే సంకల్పంతో ఉంది. ఇక్కడే కొన్ని కీలకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ దేశంలోని జనాభాకు భౌతికంగా భూ మండలంపై ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది అనేది పెద్ద ప్రశ్న. పోనీ ఏదో ఒక దేశం స్వాగతించినా వీరు ఆ దేశానికి వలసదారులు, లేదంటే ఆ దేశ పౌరులు అనే హోదాను మాత్రమే పొందగలుగుతారు. మరి టువాలు సార్వభౌమత్వం సంగతి ఏంటి? స్వయం పాలనకు అవకాశం కోల్పోవటమేనా? దేశం సముద్రంలో మునిగిపోతే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇప్పుడు ఉన్న హక్కులు, మెరైన్ సరిహద్దు పరిధిలో ఉండే సహజ వనరులను కోల్పోక తప్పదా? భౌతికంగా కనిపించని టువాలును ఐక్యరాజ్యసమితి ఒక దేశంగా గుర్తించే అవకాశం ఉంటుందా? టువాలు ఇవాళ ప్రపంచం ముందు ఒక ప్రశ్నగా నిలబడి ఉంది. (క్లిక్ చేయండి: ముందు నుయ్యి... వెనుక గొయ్యి)
- రెహాన
సీనియర్ జర్నలిస్ట్