సాగుకు రెండు విడతల విద్యుత్
♦ పగటివేళ 6 గంటలు, రాత్రివేళ 3 గంటలు సరఫరాకు ప్రభుత్వ నిర్ణయం
♦ పగటిపూటే నిరంతరాయంగా 9 గంటలు ఇస్తే సమస్యలు
♦ విద్యుత్ డిమాండ్‌లో విపరీత తారతమ్యాలతో గ్రిడ్‌పై ప్రభావం
♦ ఆర్థికంగానూ అనవసర భారం మోయాల్సిన పరిస్థితి
♦ 2 విడతల సరఫరానే ఉత్తమమని రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సిఫారసు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి పగటిపూటే నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. పలు సాంకేతిక కారణాలతో అందులో కొంత మార్పు చేస్తోంది. పగటిపూట నిరంతరాయంగా ఆరు గంటలు, రాత్రివేళలో మూడు గంటలు చొప్పున రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. వ్యవసాయానికి పగటిపూటే నిరంతరాయంగా సరఫరా చేయడం వల్ల రాత్రిపూట డిమాండ్ తగ్గి విద్యుత్ గ్రిడ్‌కు ప్రమాదకరంగా పరిణమించే అవకాశముండడం, భూగర్భ జలాలపై పెరిగే ఒత్తిడి, ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పగలు 6 గంటలు, రాత్రి 3 గంటలు చొప్పున సరఫరా చేయడమే మేలని రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ (టీఎస్పీసీసీ) చేసిన సిఫారసును ప్రభుత్వం ఆమోదించింది. ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో ప్రతినెలా సమావేశమయ్యే ఈ సమన్వయ కమిటీ రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది.
గ్రిడ్ రక్షణ కోసమే..
రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 6,000-7,000 మెగావాట్ల మధ్య ఉంటోంది. పగలూరాత్రి తేడా లేకుండా రెండు మూడు విడతల్లో 6 గంటలకు మించకుండా విద్యుత్ సరఫరా చేస్తేనే... వ్యవసాయానికి 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. అదే పగటిపూట 9 గంటలు నిరంతర సరఫరా చేస్తే వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 7,000 మెగావాట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అంటే వ్యవసాయంతో పాటు గృహ, వాణిజ్య, పరిశ్రమలు తదితర కేటగిరీల్లో కలిపి పగటి వేళ మొత్తం విద్యుత్ డిమాండ్ మొత్తంగా 13,000 మెగావాట్ల గరిష్ట స్థాయి (పీక్ డిమాండ్)కి చేరుకుంటుంది. అదే వ్యవసాయానికి సరఫరా ఉండని రాత్రివేళల్లో మాత్రం విద్యుత్ డిమాండ్ 6,000 మెగావాట్లకు పడిపోతుంది. ఇదే జరిగితే విద్యుత్ గ్రిడ్‌ను పరిరక్షించడం కష్టమని విద్యుత్ శాఖ అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పగలే 9 గంటల నిరంతర సరఫరా ఆలోచనను విరమించుకుంది.
ఆర్థికంగా చూసినా ఈ హామీ అమలుతో డిస్కంలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. రాత్రివేళల్లో 6,000 మెగావాట్లే సరఫరా చేయాల్సి ఉన్నా... మొత్తం 13,000 మెగావాట్లకు సంబంధించిన స్థిరచార్జీలను విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సి వస్తుంది. రాత్రివేళల్లో జెన్కో ప్లాంట్లలో విద్యుదుత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న విద్యుత్ శాఖ... పగలే 9 గంటల విద్యుత్ సరఫరాపై వెనక్కి తగ్గింది. అయితే ముందు ముందు పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చేసుకునే అవకాశం ఉంటుం దని మాత్రం ప్రభుత్వానికి వివరించడం గమనార్హం. మరోవైపు రైతులతో పాటు విద్యుత్ సంస్థల ప్రయోజనాల దృష్ట్యా రెండు విడతల సరఫరా చేయాలన్న నిర్ణయాన్ని విద్యుత్ రంగ నిపుణులు స్వాగతిస్తున్నారు.
భూగర్భ జలాల ఇబ్బంది
వర్షాలు బాగా కురిసి భూగర్భ జల మట్టాలు పైకి వచ్చిన సందర్భాల్లోనే బోరుబావుల నుంచి ఏకధాటిగా మూడు నాలుగు గంటలకు మించి నీళ్లు రావడం లేదని... బోరు రీచార్జ్ (తిరిగి నీటి స్థాయి పుంజుకోవాలంటే) కావాలంటే కొన్ని గంటలు వేచిచూడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అదే రెండు విడతల్లో విద్యుత్ సరఫరాతో మధ్యలో లభించే విరామంలో బోరు రీచార్జ్‌కు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఒకేవిడత 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తే పెద్ద రైతులు ఆపకుండా బోర్లను నడిపిస్తారని... దీంతో చుట్టుపక్కల ఉండే చిన్న, సన్నకారు రైతుల బోర్లు ఎండిపోతాయనే ఆందోళన కూడా వ్యక్తమైంది.