సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లాలో రెండు విడతలుగా మండల, ప్రాదేశిక ఎన్నికలు జరుగనున్నాయి. పురపాలక, సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్న యంత్రాంగానికి ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను రెండు దశల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రాదేశిక పోరును రెండు దఫాలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడంతో ఆ మేరకు తేదీల ఖ రారుపై కసరత్తు చేస్తోంది.
ఈ క్రమంలోనే జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లను రెండుగా విభజించి ఏప్రిల్ 6, 8వ తేదీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 6న వికారాబాద్, సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని 16జెడ్పీటీసీలు, 261ఎంపీటీసీలు, ఏప్రిల్ 8న చేవెళ్ల, రాజేంద్రనగర్, మల్కాజిగిరి రెవెన్యూ డివి జన్లలోని 17జెడ్పీటీసీలు, 353 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా యం త్రాంగం సూత్రప్రాయంగా నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నంకాకుండా పోలీసుశాఖతో చర్చించి రెండు దశల్లో ఎన్నికలు జరిపే మండలాలపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే మంగళవారం రంగారెడ్డి ఎస్పీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ లేఖ రాశారు. బందోబస్తు సమస్యలు తలెత్తకుండా పోలీసుశాఖ సూచనల మేరకు ఏయే మండలాల్లో తొలి, మలి విడత ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలావుండగా, ఓట్ల లెక్కింపుపై మాత్రం ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఏప్రిల్ 11 లేదా 13వ తేదీల్లో ఓట్ల కౌంటింగ్‌ను నిర్వహించేందుకు ఈసీ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జిల్లాకు ఇద్దరు పరిశీలకులు
జిల్లాలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పర్యవేక్షణకు ఇద్దరు పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు సంజయ్‌జాజు, వికాస్‌రాజులను ఎస్‌ఈసీ నియమించగా... ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకూ వీరు ప్రజలకు అందుబాటులో ఉంటారని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడమేగాకుండా... ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా ఈ అధికారులు స్పందిస్తారని చెప్పారు.
వికాస్‌రాజ్ : 81797 68735, సంజయ్‌జాజు : 81797 68736
ప్రాదేశిక పోరు 2 దశల్లో..
Published Tue, Mar 18 2014 11:48 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement