సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రాదేశిక పోరు మలివిడతకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని చేవెళ్ల, సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్లలోని 17 జెడ్పీటీసీ స్థానాలు, 311 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రితో అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. చేవెళ్ల డివిజన్‌లో 4,07,902 మంది, సరూర్‌నగర్ డివిజన్‌లో 3,77,602 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఆదివారం జరిగిన తొలివిడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జిల్లా యంత్రాంగం.. అదే ఉత్సాహంతో ఏర్పాట్లను పూర్తి చేసింది.
17 మండలాల్లో పోలింగ్
మలివిడతలో భాగంగా శుక్రవారం జిల్లాలోని 17 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. చేవెళ్ల, దోమ, గండేడ్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కుల్కచర్ల, మహేశ్వరం, మంచాల, మొయినాబాద్, నవాబ్‌పేట, పరిగి, పూడూరు, సరూర్‌నగర్, షాబాద్, శంకర్‌పల్లి, యాచారం మండలాల్లో 935 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మలివిడత పోలింగ్ ప్రక్రియకు 4,675 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. వీరిలో 935 పోలింగ్ అధికారులు, 935 సహాయ పోలింగ్ అధికారులు, 2,805 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా 10శాతం.. అంటే 468 మంది సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచారు. గురువారం సాయంత్రమే సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
జిల్లాలో 215 సున్నిత, 165 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ఓటింగ్ సరళిని వీడియో, వెబ్‌కాస్టింగ్‌లో చిత్రీకరించనున్నారు. అదేవిధంగా సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేసి ఓటింగ్ శాంతియుతంగా జరిగేందు కు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నాటి ఎన్నికల బరిలో 1,332 మంది అభ్యర్థులున్నారు. 17 జెడ్పీటీసీ స్థానాలకు 107 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. 311 ఎంపీటీసీ స్థానాలకు 1,225 మంది బరిలో నిలిచారు. చాలాకాలం తర్వాత ప్రాదేశిక సమరం జరుగుతుండ డం.. పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే పోటాపొటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు ఇప్పుడు అంతర్గత ప్రచారంలో నిమగ్నమయ్యారు.
జెడ్పీటీసీ స్థానాలు : 17
ఎంపీటీసీ స్థానాలు : 311
బరిలో ఉన్న అభ్యర్థులు : 1,332
ఓటర్లు : 7,85,504
ప్రాదేశిక పోరు మలివిడతకు ఏర్పాట్లు పూర్తి
Published Fri, Apr 11 2014 12:29 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement