సాక్షి, అనంతపురం : ప్రాదేశిక ఎన్నికల ప్రచార పర్వానికి బుధవారం సాయంత్రం తెరపడింది. 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 32 మండలాల్లో జరగనున్న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 32 జెడ్పీటీసీ స్థానాలకు 118 మంది.. 399 ఎంపీటీసీ స్థానాల్లో 966 మంది పోటీలో ఉన్నారు.
బ్యాలెట్ మార్పు కారణంగా వాయిదా పడిన రాయదుర్గం మండలం 74-ఉడేగోళం గ్రామంలో ఎంపీటీసీ స్థానానికి కూడా ఇదే రోజు పోలింగ్ నిర్వహించనున్నారు. తుది విడత పోలింగ్ జరిగే అన్ని మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల హవా స్పష్టంగా కన్పిస్తోంది.
ముందు నుంచి ప్రచారంలో దూసుకెళ్తున్న నాయకులు వైఎస్‌ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజాభిమానం చూరగొనలేని టీడీపీ నేతలు అడ్డదారులు వెతుకుతున్నారు. గురువారం రాత్రి భారీ స్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలోని ఒక ఎంపీ, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో జేసీ బ్రదర్స్ పేరు లేకపోయినా.. రెండో విడతలో ప్రకటించే అవకాశం ఉంది.
తుది విడత ప్రాదేశిక ఎన్నికలు టీడీపీ నేతలు జేసీ, పరిటాల, కందికుంట, పల్లె, సూరి నియోజకవర్గాల్లో జరగనుండడంతో నాయకులు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లేందుకు సిద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం తాగేందుకు స్లిప్పులు రాయించి నేరుగా మద్యం షాపులకే పంపిస్తున్నట్లు సమాచారం. కాగా, గ్రూపు తగాదాలతో ‘తమ్ముళ్లు’ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి బలమైన పునాదులు ఉండడంతో ఎవరెన్ని కుట్రలు, తాయిలాలు ఎరవేసినా ఓటర్లు మాత్రం వైఎస్‌ఆర్‌సీపీకే పట్టం కడతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ పొత్తు కుదరడం తమ కొంప ముంచుతుందని టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ప్రచారం.. సమాప్తం
Published Thu, Apr 10 2014 3:39 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement