two weelar wehicle
-
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ. 4 వేల వరకు జరిమానా..! బాదుడే.. బాదుడు!!
ముంబై: రాష్ట్రంలో సెంట్రల్ మోటర్ వెహికల్ చట్టం 2021 అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంఘిస్తే బారీగానే జరిమానాలను విధిస్తారు. ఈమేరకు మహారాష్ట్ర రవాణా శాఖ డిసెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు విముఖత చూపినా.. రాష్ట్రంలో తరచూ జరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు, పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా దీన్ని అమలు చేసేందుకు రవాణా శాఖ సంకల్పించింది. దీని ప్రకారం గురువారం కొత్త నిబంధనల నోటిఫికేషన్ విడుదలైంది. నిబంధనలను ఉల్లంగించిన ద్విచక్ర వాహనాలకు వెయ్యి, ఫోర్ వీలర్ వాహనాలకు రెండు వేలు, ఇతర భారీ వాహనాలు నడిపేవారు నాలుగు వేల రూపాయల చొప్పున జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుమునుపు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే జరిమానాగా విధించేవారు. ఈ చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంగించినా, ఫోన్ మాట్టాడుతూ వాహనాలను నడిపినా తడిసిమోపెడవుతుంది! చదవండి: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్... దెబ్బతో అకౌంట్లో డబ్బులన్నీ మాయం! వాహనాలకు రిఫ్లెక్టర్ లేకపోయినా, ఫ్యాన్సీ నెంబర్ ఫ్లేట్స్ అమర్చినా.. వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. గతంలో ఇందుకు రెండువందల రూపాయలు జరిమానాగా విధించేవారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనాలకు నడిపిన వారికి ఏకంగా రూ.5 వేలు జరిమానా తప్పదు. కాగా మోటారు వాహనాల చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం జరిమానా మొత్తాన్ని పెంచారు. ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను అమలు చేయడానికి వెనుకాడింది.ఐతే తాజాగా వాటిని అమలు చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. చదవండి: ఒమిక్రాన్ ఎలుకల నుంచి మనుషులకు సోకిందా? ఎంతవరకు నిజం.. -
అమ్మాయిలకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వలేను
ఏ దేశంలోనైనా రెండే చోట్ల కరెన్సీ ప్రింట్ అవుతుంది. ఒకటి ప్రభుత్వ ముద్రణాలయం. ఇంకొకటి ఆర్టీఏ ఆఫీసు. రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ. ఇక్కడేం ప్రింటింగ్ మిషన్లు ఉండవు. లైసెన్సు కోసం, రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వాళ్ల నుంచి నోట్లను ‘మింట్’ చేసేస్తారు. గవర్నమెంట్ రూల్స్ ఉండటానికి ఉంటాయి. వాటితో మన బండి నడవదు. కౌంటర్లలో మనిషికో రూల్ ఉంటుంది. ఏ మనిషి దగ్గర ఆ రూల్ పాటించకపోతే ఆడీ కారు ఉన్నా బతుకు జట్కా బండే. ‘భారతీయుడు’ సినిమాలో శంకర్ శాంపిల్‌గా చూపించాడు. ఇప్పుడొక పాకిస్తానీయురాలి అనుభవం. ఆ అమ్మాయి పేరు శిరీన్. డ్రైవింగ్ లైసెన్సు కోసం ఆర్టీఏ ఆఫీసుకి వెళ్లింది. రిటర్న్ టెస్ట్ పాస్ అయింది. బండి మీద 8 కొట్టింది. ఆఫీసర్ ‘గుడ్’ అన్నాడు. అని కూడా ‘సారీ అమ్మా, అమ్మాయిలకు డ్రైవింగ్ లైసెన్సును నేనైతే ఇవ్వలేను‘ అన్నాడు. ‘ఇవ్వాల్సింది మీరే కదా సర్’ అంది ఆ అమ్మాయి మన దిల్ ఖుష్ దివ్యలా.. సర్ అనే మాటను నొక్కి పలుకుతూ. ‘అయిననూ ఇవ్వలేనమ్మా.. ఆడపిల్లలు బండ్లు పడేస్తారు’ అన్నాడు. ‘డబ్బుల కోసమా సర్ ’ అంటే.. ‘కాదమ్మా.. నీకు దెబ్బలు తగులుతాయని’ అన్నాడు. శిరీన్కి కోపం వచ్చింది. ట్విట్టర్లోకి వెళ్లి ‘ఏం రూల్ ఇది?’ అని నేరుగా ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్‌కి ట్వీట్ కొట్టింది. వెంటనే ఇమ్రాన్ లైన్లోకి వచ్చారు. ఆ ఇమ్రాన్ ఆర్టీఏ ఆఫీసర్. ‘వచ్చి లైసెన్స్ తీసుకెళ్లమ్మా..’ అని ఫోన్ చేశాడు. వెళ్లి లైసెన్స్ తెచ్చుకుని.. ‘థ్యాంక్యూ మిస్టర్ ఇమ్రాన్’ అని ట్వీట్ చేసింది. ఆర్టీఏ ఇమ్రాన్‌కి కాదు, పీఎం ఇమ్రాన్‌కి. ట్విట్టర్ వచ్చాక దేశ ప్రధానులు తప్ప ఎవరూ అందుబాటులో ఉండటం లేదు. మన మోడీనే చూడండి. ‘కువ’ అని పలకరిస్తే చాలు.. ‘కువ కువ’ అని బదులిస్తున్నారు! @ImranKhanPTI Can a woman not ride a bike in Pakistan? I'm being told by the License Office that they do not issue bike riding licenses to women. They said and I quote: "Larkiyo ko bike ka license nahi dete, aap gaari chalaye." Why? What kind of rule is this? Please respond. — Shireen Ferozepurwalla (@SFerozepurwalla) September 14, 2020 -
మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా!
దేశీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం రెట్రో ట్రెండ్ నడుస్తోంది. గతంలో ఓ వెలుగు వెలిగి.. కనుమరుగైపోయిన పాత బ్రాండ్స్ ఒక్కొక్కటిగా మళ్లీ తిరిగొస్తున్నాయి. ఇటీవలే జావా మోటార్ సైకిల్ రీఎంట్రీ ఇవ్వగా .. తాజాగా సుమారు మూడు దశాబ్దాల తర్వాత స్కూటర్ బ్రాండ్ లాంబ్రెటా కూడా పునరాగమనానికి సిద్ధమవుతోంది. లాంబ్రెటా తయారీ సంస్థ ఇన్నోసెంటి ఈ విషయం తెలియజేసింది. 2020లో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో లాంబ్రెటా ఎలక్ట్రిక్ స్కూటర్ నమూనాను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఉక్కుతో తయారు చేసే సూపర్ లాంబ్రెటాను డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుత లాంబ్రెటాతో పోలిస్తే పరిమాణంలో మరింత పెద్దగా ఉండే సూపర్ లాంబ్రెటా డిజైనింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎక్స్‌పోలో ప్రదర్శించబోయే లాంబ్రెటా ఎలక్ట్రిక్ ప్రస్తుతం మిలన్లో రూపుదిద్దుకుంటోంది. ప్రత్యర్థి సంస్థ పియాజియో వెస్పా ఎలట్రికా స్కూటర్‌కు పోటీగా దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఇన్నోసెంటి ఉంది. లాంబ్రెటా ఉత్పత్తులను గతంలో స్కూటర్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఎల్) భారత్‌లో విక్రయించేది. అప్పట్లో లాంబ్రెటా స్కూటర్స్‌ను విజయ్ సూపర్ పేరుతో, త్రిచక్రవాహనాలను విక్రమ్ పేరుతో ఉత్పత్తి చేసింది. 1997లో లాంబ్రెటా స్కూటర్స్ తయారీని పూర్తిగా నిలిపివేసిన ఎస్ఐఎల్ ఆ తర్వాత పూర్తిగా త్రిచక్ర వాహనాల ఉత్పత్తికే పరిమితమైంది. స్కూటర్ ఇండియాతో ట్రేడ్‌మార్క్ వివాదాలను పరిష్కరించుకుంటున్న ఇన్నోసెంటి మళ్లీ ఇన్నాళ్లకు లాంబ్రెటాను అందుబాటులో తేబోతోంది. లోహియా ఆటోతో జట్టు.. భారత్‌లో లాంబ్రెటాల తయారీ కోసం నోయిడా కేంద్రంగా పనిచేసే లోహియా ఆటోతో ఇన్నోసెంటి జట్టు కట్టింది. ప్లాంటుపై కసరత్తు కూడా జరుగుతోంది. ముంబైకి దగ్గర్లో... పుణె పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటార్స్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్, ఫోక్స్‌వ్యాగన్ మొదలైన వాటి ప్లాంట్లు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. భారత్‌లో ఏర్పాటు చేసే ప్లాంటులో ఇటు దేశీ మార్కెట్‌తో పాటు అటు పొరుగుదేశాలు, ఆఫ్రికా మార్కెట్‌కి కూడా అవసరమైన స్థాయిలో స్కూటర్లు తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రీమియం మార్కెట్.. విలాసవంతమైన లాంబ్రెటా స్కూటర్లతో ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్ల దృష్టిని ఆకర్షించాలని ఇన్నోసెంటి భావిస్తోంది. ఇటాలియన్ డిజైన్‌లోని సృజనాత్మకతతో యువ కస్టమర్లకు చేరువ కావాలని యోచిస్తోంది. అయితే, అప్పట్లో బజాజ్ చేతక్, వెస్పాలతో పోటీలో చాలా దూరంలో ఉండిపోయిన లాంబ్రెటాకు ఇది సాధ్యపడుతుందా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ, ఇన్నోసెంటి టార్గెట్ చేసుకుంటున్న ప్రీమియం విభాగంలో ప్రస్తుతం గణనీయంగా వ్యాపార అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించగలిగే ఫీచర్స్ లాంబ్రెటాలో పుష్కలంగా ఉంటాయంటున్నాయి. ఇందుకు జావాకి వచ్చిన బుకింగ్సే ఉదాహరణ అని చెబుతున్నాయి. వింటేజ్ బ్రాండ్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకుందని పేర్కొన్నాయి. మైలేజీతో సంబంధం లేకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లను రోజువారీ పనులపై తిరిగేందుకు ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటోంది. అయితే, వెస్పా క్రమక్రమంగా అమ్మకాలు పెంచుకుంటున్నప్పటికీ.. ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో మార్కెట్లో పట్టు సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియం సెగ్మెంట్లో అడుగుపెట్టాలనుకుంటున్నా లాంబ్రెటా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమనేది కొన్ని వర్గాల మాట!! -
మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం
దాచేపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు మూడు ద్విచక్రవాహనాలను దగ్ధం చేసిన సంఘటన దాచేపల్లి మండలం శంకరపురం గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. శంకరపురం నుంచి భట్రుపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డులోని దుగ్గిదేవమ్మ దేవాలయం పక్కన నిలిపి ఉన్న మూడు ద్విచక్రవాహనాలు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. ద్విచక్రవాహనాలకు అమర్చిన టైర్లు, ఇతర సామగ్రి కాలి బూడిదైపోయాయి. సంఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో రంగురాళ్లు, క్రిస్టల్స్ తీసే సోరంగాలు ఉన్నాయి. గత కొన్ని నెలల నుంచి ఇక్కడ భారీగా రంగురాళ్లు, క్రిస్టల్స్‌ను అక్రమంగా తీసి హైదరాబాద్, బెంగుళూరుకు తరలిస్తున్నారు. భట్రుపాలెం, శంకరపురం గ్రామాలకు చెందిన వారితో వీటిని తవ్విస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్రవాహనాలు ఈ ప్రాంతంలో నిలిచాయంటే రంగురాళ్ల కోసం వచ్చిన వారివేనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రంగురాళ్లు తీస్తున్న వారిలోనే విభేదాలు వచ్చి ఏవరైయినా తగులబెట్టారా..లేక ఇతరులు తగులబెట్టారా అనేది తెలియాల్సి ఉంది. మూడు ద్విచక్రవాహనాలు దగ్ధమైనట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని, దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్సై కట్టా ఆనంద్ చెప్పారు.