మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా! | Lambretta to come back to India in 2020 | Sakshi
Sakshi News home page

మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా!

Published Tue, Jan 15 2019 5:01 AM | Last Updated on Tue, Jan 15 2019 5:01 AM

Lambretta to come back to India in 2020 - Sakshi

దేశీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం రెట్రో ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో ఓ వెలుగు వెలిగి.. కనుమరుగైపోయిన పాత బ్రాండ్స్‌ ఒక్కొక్కటిగా మళ్లీ తిరిగొస్తున్నాయి. ఇటీవలే జావా మోటార్‌ సైకిల్‌ రీఎంట్రీ ఇవ్వగా .. తాజాగా సుమారు మూడు దశాబ్దాల తర్వాత స్కూటర్‌ బ్రాండ్‌ లాంబ్రెటా కూడా పునరాగమనానికి సిద్ధమవుతోంది. లాంబ్రెటా తయారీ సంస్థ ఇన్నోసెంటి ఈ విషయం తెలియజేసింది. 2020లో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో లాంబ్రెటా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నమూనాను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. భారత మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా ఉక్కుతో తయారు చేసే సూపర్‌ లాంబ్రెటాను డిజైన్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుత లాంబ్రెటాతో పోలిస్తే పరిమాణంలో మరింత పెద్దగా ఉండే సూపర్‌ లాంబ్రెటా డిజైనింగ్‌ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

ఎక్స్‌పోలో ప్రదర్శించబోయే లాంబ్రెటా ఎలక్ట్రిక్‌ ప్రస్తుతం మిలన్‌లో రూపుదిద్దుకుంటోంది. ప్రత్యర్థి సంస్థ పియాజియో వెస్పా ఎలట్రికా స్కూటర్‌కు పోటీగా దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఇన్నోసెంటి ఉంది. లాంబ్రెటా ఉత్పత్తులను గతంలో స్కూటర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఐఎల్‌) భారత్‌లో విక్రయించేది. అప్పట్లో లాంబ్రెటా స్కూటర్స్‌ను విజయ్‌ సూపర్‌ పేరుతో, త్రిచక్రవాహనాలను విక్రమ్‌ పేరుతో ఉత్పత్తి చేసింది. 1997లో లాంబ్రెటా స్కూటర్స్‌ తయారీని పూర్తిగా నిలిపివేసిన ఎస్‌ఐఎల్‌ ఆ తర్వాత పూర్తిగా త్రిచక్ర వాహనాల ఉత్పత్తికే పరిమితమైంది. స్కూటర్‌ ఇండియాతో ట్రేడ్‌మార్క్‌ వివాదాలను పరిష్కరించుకుంటున్న ఇన్నోసెంటి మళ్లీ ఇన్నాళ్లకు లాంబ్రెటాను అందుబాటులో తేబోతోంది.  

లోహియా ఆటోతో జట్టు..
భారత్‌లో లాంబ్రెటాల తయారీ కోసం నోయిడా కేంద్రంగా పనిచేసే లోహియా ఆటోతో ఇన్నోసెంటి జట్టు కట్టింది. ప్లాంటుపై కసరత్తు కూడా జరుగుతోంది. ముంబైకి దగ్గర్లో... పుణె పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆటోమొబైల్‌ దిగ్గజాలైన టాటా మోటార్స్, బజాజ్‌ ఆటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మెర్సిడెస్‌ బెంజ్, ఫోక్స్‌వ్యాగన్‌ మొదలైన వాటి ప్లాంట్లు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. భారత్‌లో ఏర్పాటు చేసే ప్లాంటులో ఇటు దేశీ మార్కెట్‌తో పాటు అటు పొరుగుదేశాలు, ఆఫ్రికా మార్కెట్‌కి కూడా అవసరమైన స్థాయిలో స్కూటర్లు తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది.

ప్రీమియం మార్కెట్‌..
విలాసవంతమైన లాంబ్రెటా స్కూటర్లతో ప్రీమియం సెగ్మెంట్‌ కస్టమర్ల దృష్టిని ఆకర్షించాలని ఇన్నోసెంటి భావిస్తోంది. ఇటాలియన్‌ డిజైన్‌లోని సృజనాత్మకతతో యువ కస్టమర్లకు చేరువ కావాలని యోచిస్తోంది. అయితే, అప్పట్లో బజాజ్‌ చేతక్, వెస్పాలతో పోటీలో చాలా దూరంలో ఉండిపోయిన లాంబ్రెటాకు ఇది సాధ్యపడుతుందా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ, ఇన్నోసెంటి టార్గెట్‌ చేసుకుంటున్న ప్రీమియం విభాగంలో ప్రస్తుతం గణనీయంగా వ్యాపార అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించగలిగే ఫీచర్స్‌ లాంబ్రెటాలో పుష్కలంగా ఉంటాయంటున్నాయి.

ఇందుకు జావాకి వచ్చిన బుకింగ్సే ఉదాహరణ అని చెబుతున్నాయి. వింటేజ్‌ బ్రాండ్‌గా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కూడా మంచి సక్సెస్‌ సొంతం చేసుకుందని పేర్కొన్నాయి. మైలేజీతో సంబంధం లేకుండా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను రోజువారీ పనులపై తిరిగేందుకు ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటోంది.  అయితే, వెస్పా క్రమక్రమంగా అమ్మకాలు పెంచుకుంటున్నప్పటికీ.. ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో మార్కెట్‌లో పట్టు సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియం సెగ్మెంట్‌లో అడుగుపెట్టాలనుకుంటున్నా లాంబ్రెటా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమనేది కొన్ని వర్గాల మాట!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement