మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం
మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం
Published Mon, Oct 10 2016 8:25 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
దాచేపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు మూడు ద్విచక్రవాహనాలను దగ్ధం చేసిన సంఘటన దాచేపల్లి మండలం శంకరపురం గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. శంకరపురం నుంచి భట్రుపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డులోని దుగ్గిదేవమ్మ దేవాలయం పక్కన నిలిపి ఉన్న మూడు ద్విచక్రవాహనాలు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. ద్విచక్రవాహనాలకు అమర్చిన టైర్లు, ఇతర సామగ్రి కాలి బూడిదైపోయాయి. సంఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో రంగురాళ్లు, క్రిస్టల్స్ తీసే సోరంగాలు ఉన్నాయి. గత కొన్ని నెలల నుంచి ఇక్కడ భారీగా రంగురాళ్లు, క్రిస్టల్స్‌ను అక్రమంగా తీసి హైదరాబాద్, బెంగుళూరుకు తరలిస్తున్నారు. భట్రుపాలెం, శంకరపురం గ్రామాలకు చెందిన వారితో వీటిని తవ్విస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్రవాహనాలు ఈ ప్రాంతంలో నిలిచాయంటే రంగురాళ్ల కోసం వచ్చిన వారివేనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రంగురాళ్లు తీస్తున్న వారిలోనే విభేదాలు వచ్చి ఏవరైయినా తగులబెట్టారా..లేక ఇతరులు తగులబెట్టారా అనేది తెలియాల్సి ఉంది. మూడు ద్విచక్రవాహనాలు దగ్ధమైనట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని, దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్సై కట్టా ఆనంద్ చెప్పారు.
Advertisement