అమ్మవారికి బంగారు బోనం
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల నుంచి భక్తుల రద్దీ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో సహా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ శాసన సభ పక్ష నేత కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కల్వకుంట్ల కవిత, మల్లారెడ్డి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు సాయన్న, ఎన్వీఎస్ ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, మాజీ ఎంపీలు నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వివిధ పార్టీల నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్, శక్తి పీఠాధిపతి జగద్గురు భగవతి మహరాజ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులతో వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ యోగితారాణి, ఐజీ మురళీకృష్ణ తదితర అ«ధికారులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
బంగారు బోనమెత్తిన ఎంపీ కవిత
ఆలయం తరఫున 3 కిలోల బంగారంతో తయారు చేయించిన బోనాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి సమర్పించారు. ఆదయ్యనగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో 2వేల బోనాలు అమ్మవారి ఆలయానికి భారీ ఊరేగింపుగా వచ్చాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ ఊరేగింపును ప్రారంభించారు. డప్పుల దరువు.. కళాకారుల నృత్యాల నడుమ కవిత బంగారు బోనాన్ని తలపై మోస్తూ.. సిటీలైట్, కింగ్స్ వే, సుభాశ్ రోడ్ మీదుగా ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. బాటా వరకు ఊరేగింపు చేరుకోగానే మంత్రి తలసాని ఉత్సాహంగా నృత్యం చేశారు. ఊరేగింపులో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ «ఆధ్వర్యంలో దేవత.. రాక్షసులు.. పులి.. సింహాల వంటి వేషధారులు, లంబాడీల నృత్యాలు, కోలాటాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం 9.20కి బయలుదేరిన బంగారు బోనం 11.20కి ఆలయానికి చేరుకుంది.
ప్రజలంతా సుఖంగా ఉండాలి: మధుసూదనాచారి
రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా. ప్రకృతి మాత ఎంతో శక్తివంతమైంది.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక: స్వామిగౌడ్
మహంకాళి బోనాలు తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీక. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖంగా ఉండాలని కోరుకున్నా. జాతరలో అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయం.
దేశంలో నంబర్ వన్ చేయాలి: నాయిని
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ఇప్పటికే రాష్ట్రం నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అన్నింటిలో నంబర్ వన్‌కు తీసుకుని రావాలని అమ్మవారిని మొక్కుకున్నా. రాష్ట్రంలో బాగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖంగా ఉండాలి. 4 ఏళ్ల కాలంలో హోం శాఖ ఆధ్వర్యంలో పోలీసులు సమర్థవంతంగా శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఇలాగే ఎప్పటికీ శాంతి సామరస్యాలతో ఉండాలని కోరుకున్నా.
అచ్చమైన తెలంగాణ పండుగ: కిషన్‌రెడ్డి
అచ్చమైన తెలంగాణ పండుగ బోనాల జాతర. భక్తి, శక్తికి ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుంది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, మోదీకి మళ్లీ ప్రధాని అయ్యే శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని మొక్కుకున్నా.
3 వేల మందితో బందోబస్తు: సిటీ కమిషనర్ అంజనీకుమార్
బోనాల జాతర సందర్భంగా లక్షల మంది భక్తులు పాల్గొంటారనే ఉద్దేశంతో 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశాం. 70 మంది సీనియర్ అధికారులు, 60 షీటీమ్స్ ఇందులో పాల్గొన్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాం.
ఏర్పాట్లు భేష్: ఇంద్రకరణ్‌రెడ్డి
లక్షల మంది భక్తులు పాల్గొనే ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ బోనాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: తలసాని
రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలు, సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ అమ్మవారికి పూజలు చేశాం. లక్షల మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మొక్కు చెల్లించుకుంటున్నారు. లక్షల మంది భక్తులు పాల్గొనే ఈ జాతరలో అసౌకర్యాలు కలిగితే పెద్ద మనసుతో వాటిని అర్థం చేసుకుని మన్నించాలి.
అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం: ఉత్తమ్
లక్షల మంది ఇలవేల్పు అయిన అమ్మవారిని దర్శించుకునే అవకాశం రావడం నా అదృష్టం. భక్తులందరికీ బోనాల శుభాకాంక్షలు.