ఆలయం తరఫున 3 కిలోల బంగారంతో తయారు చేయించిన బోనాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి సమర్పించారు. ఆదయ్యనగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో 2వేల బోనాలు అమ్మవారి ఆలయానికి భారీ ఊరేగింపుగా వచ్చాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ ఊరేగింపును ప్రారంభించారు. డప్పుల దరువు.. కళాకారుల నృత్యాల నడుమ కవిత బంగారు బోనాన్ని తలపై మోస్తూ.. సిటీలైట్, కింగ్స్ వే, సుభాశ్ రోడ్ మీదుగా ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. బాటా వరకు ఊరేగింపు చేరుకోగానే మంత్రి తలసాని ఉత్సాహంగా నృత్యం చేశారు. ఊరేగింపులో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ «ఆధ్వర్యంలో దేవత.. రాక్షసులు.. పులి.. సింహాల వంటి వేషధారులు, లంబాడీల నృత్యాలు, కోలాటాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం 9.20కి బయలుదేరిన బంగారు బోనం 11.20కి ఆలయానికి చేరుకుంది.