UN envoy
-
‘ఉక్రెయిన్ విషయంలో భారత్‌కు ఏం చేయాలో తెలుసు’
Don’t patronize us: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి విషయంలో యూఎన్ జనరల్ అసెంబ్లీలో పెట్టిన పలు తీర్మానాల పై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అయితే ఉక్రెయిన్- రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న తటస్థ వైఖరిని విమర్శిస్తూ యూకేలోని నెదర్లాండ్ రాయబారి తాజాగా కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నెదర్లాండ్ రాయబారి కరెల్ వాన్ ఊస్టెరోమ్ ట్విట్టర్లో.." ఐక్కరాజ్యసమితలో ప్రవేశపెడుతున్న తీర్మానాల ఓటింగ్‌కి భారత్ దూరంగా ఉండకూడదు. యూఎన్ నిబంధనలను గౌరవించాలి" అని ట్వీట్ చేశారు.ఈ వ్యాఖ్యాలకు ఐక్యరాజ్య సమితిలోని భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఘాటుగా స్పందించారు. ...ఉక్రెయిన్ విషయంలో భారత్‌కు ఏం చేయాలో తెలుసు. దయచేసి మీరు సలహాలు ఇవ్వకండి అని గట్టి కౌంటరిచ్చారు. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ సమస్యపై బుధవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సమావేశంలో ఈ ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ... ఉక్రెయిన్ విషయంలో భారత్‌కు ఏం చేయాలో తెలుసునని ధీటుగా సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దాడిని నిరసిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన తీర్మానాల ఓటింగ్‌కి భారత్ దూరంగానే ఉంది. అంతేకాదు యూఎన్ మానవహక్కుల నుంచి రష్యాను నిషేధించేలా చేసిన తీర్మానంపై ఓటింగ్‌కి, ఉక్రెయిన్‌లోని మానవతా సంక్షోభంపై చేసిన తీర్మానం పై ఓటింగ్‌కి కూడా భారత్ దూరంగా ఉంటూ వస్తూ ఉంది. అదీగాక భారత్ ఇప్పటి వరకు ఈ తీర్మానాలన్నింటికీ దూరంగా ఉంటూ తటస్థ వైఖరిని అవలంభించడంతో ప్రపంచ దేశాల నుంచి సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఎన్‌లోని భారత రాయబారి తిరుమూర్తి గట్టి కౌంటరిచ్చారు. భారత్‌కు ఎవ్వరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, తామేం చేస్తున్నామో తమకు పూర్తి అవగాహన ఉందని తిరుమూర్తి స్పష్టం చేశారు. (చదవండి: యావత్ ప్రజల ప్రయోజనం కోసం ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలి!) -
చరిత్ర సృష్టించిన నిక్కీ హెలీ!
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన నిక్కీ హెలీ నియామకాన్ని అమెరికా సెనేట్ మంగళవారం ఖరారు చేసింది. ప్రస్తుతం దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఉన్న ఆమె త్వరలోనే తన పదవికి రాజీనామా చేసి.. అమెరికాలోనే అత్యున్నత దౌత్యపదవిని చేపట్టనున్నారు. రిపబ్లికన్ పార్టీ రైజింగ్ స్టార్‌గా పేరొందిన నిక్కీ హెలీకి దౌత్య అనుభవం లేకపోయినా.. ఈ పదవి చేపట్టేందుకు ఆమెకు సెనేట్‌లో బంపర్ మెజారిటీ లభించడం గమనార్హం. డెమొక్రాట్లు సైతం ఆమెకు మద్దతు పలుకడంతో 96-4 మార్జిన్‌తో సెనేట్ ఆమోదం లభించింది. దీంతో అమెరికా అధ్యక్ష యంత్రాంగంలో క్యాబినెట్ ర్యాంకు పొందిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిక్కీ హెలీ చరిత్ర సృష్టించారు. తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే వ్యక్తిగా పేరొందిన నిక్కీ హెలీ సెన్సిబుల్ దౌత్యవేత్తగా అమెరికా ఖ్యాతిని ఐరాసలో నిలబెడతారని డెమొక్రాట్లు కూడా భావిస్తుండటంతోనే ఆమెకు ఈ స్థాయిలో మద్దతు లభించింది. అమెరికా ఎన్నికల ప్రచారంలో ఐరాసపై కూడా ట్రంప్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ అభిప్రాయాలతో నిక్కీ హెలీ నిర్ద్వంద్వంగా విభేదించారు. రాయబారి పదవీ ధ్రువీకరణ విషయంలో సెనేట్ కమిటీ ముందు హాజరైన నిక్కీ.. రష్యా తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. నాటో కొనసాగింపును స్వాగతించారు. అలాగే ముస్లింలపై నిషేధం విధించాలి, వారి జనాభా రిజిస్టర్‌ను కొనసాగించాలన్న వ్యాఖ్యలను సైతం వ్యతిరేకించారు. ఇవన్ని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయాలను విభేదించేవే. అయినా నిర్భయంగా నిక్కీ తన అభిప్రాయాలను వ్యక్తీకరించడంతో ప్రతిపక్ష డెమొక్రాట్ సభ్యుల మద్దతును కూడా ఆమె పొందగలిగారు. -
మృత్యువుకు చేరువలో ఎనిమిదివేలమంది!
ఉక్రెయిన్: తూర్పు ఉక్రెయిన్ ఇప్పుడు ఓ తీవ్ర సమస్యను ఎదుర్కొంటుంది. వైద్య సదుపాయాలు లేక, మందులు దొరక్క దాదాపు 8,000 మంది ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఏదో ఒకలా కోలుకుంటారులే అనుకోవడానికి వారేం సాధారణ రోగులు కాదు. ఎయిడ్స్ బాధితులు. హెచ్ఐవీ సోకిన వీరంతా కూడా కనీసం మరికొద్ది రోజులు బతికి ఉండే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ కాన్ఫరెన్స్‌లో ఆ సంస్థ చీఫ్ మైఖెల్ కజచ్కినే(ఈయన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి కూడా) తెలిపారు. రష్యాకు తూర్పు ఉక్రెయిన్‌కు మధ్య ఏర్పడిన రాజకీయ సంక్షోభం వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. గత కొంత కాలంగా రష్యాకు ఉక్రెయిన్ను మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద బలగాలు మోహరించారు. ఇంతకుముందు ఇరు దేశాలమధ్య పంపిణీ అయిన యాంటీ రిట్రోవైరల్ మెడిసిన్ ఇప్పుడు ఉక్రెయిన్‌కు చేరకుండా రష్యా సేనలు, రష్యా మద్దతు దారులు చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులైన 8000 మంది ప్రాణాలు క్లిష్ట పరిస్థితుల మధ్య ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ సమస్యలో కీలక దేశాలనై జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఉక్రెయిన్ ఏదో ఒక ముందడుగు వేసి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు నెల సగంనాటికి మెడిసిన్ అందించకుంటే ఓ ప్రమాదం చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. అది మానవత్వానికి మచ్చలా కనిపిస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో ఆసక్తి కరమైన విషయమేమిటంటే ఇక్కడివారికి ఎయిడ్స్ రావడానికి సిరంజిల ద్వారా డ్రగ్స్ తీసుకోవడమే ప్రధాన కారణమట.