మృత్యువుకు చేరువలో ఎనిమిదివేలమంది!
ఉక్రెయిన్: తూర్పు ఉక్రెయిన్ ఇప్పుడు ఓ తీవ్ర సమస్యను ఎదుర్కొంటుంది. వైద్య సదుపాయాలు లేక, మందులు దొరక్క దాదాపు 8,000 మంది ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఏదో ఒకలా కోలుకుంటారులే అనుకోవడానికి వారేం సాధారణ రోగులు కాదు. ఎయిడ్స్ బాధితులు. హెచ్ఐవీ సోకిన వీరంతా కూడా కనీసం మరికొద్ది రోజులు బతికి ఉండే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ కాన్ఫరెన్స్లో ఆ సంస్థ చీఫ్ మైఖెల్ కజచ్కినే(ఈయన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి కూడా) తెలిపారు.
రష్యాకు తూర్పు ఉక్రెయిన్కు మధ్య ఏర్పడిన రాజకీయ సంక్షోభం వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. గత కొంత కాలంగా రష్యాకు ఉక్రెయిన్ను మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద బలగాలు మోహరించారు. ఇంతకుముందు ఇరు దేశాలమధ్య పంపిణీ అయిన యాంటీ రిట్రోవైరల్ మెడిసిన్ ఇప్పుడు ఉక్రెయిన్కు చేరకుండా రష్యా సేనలు, రష్యా మద్దతు దారులు చెక్పోస్టుల వద్ద అడ్డుకుంటున్నారు.
దీంతో ప్రస్తుతం ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులైన 8000 మంది ప్రాణాలు క్లిష్ట పరిస్థితుల మధ్య ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ సమస్యలో కీలక దేశాలనై జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఉక్రెయిన్ ఏదో ఒక ముందడుగు వేసి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు నెల సగంనాటికి మెడిసిన్ అందించకుంటే ఓ ప్రమాదం చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. అది మానవత్వానికి మచ్చలా కనిపిస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో ఆసక్తి కరమైన విషయమేమిటంటే ఇక్కడివారికి ఎయిడ్స్ రావడానికి సిరంజిల ద్వారా డ్రగ్స్ తీసుకోవడమే ప్రధాన కారణమట.