underage girl
-
మాతృత్వానికి తగిన వయస్సు ఉండాల్సిందే!: అసోం సీఎం
గువాహతి: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాల్య వివాహాల కట్టడికి తమ రాష్ట్రంలో కఠిన చట్టం తేబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. మాతృత్వానికి తగిన వయసు ఉండాల్సిందేనని, లేకుంటే సమస్యలు తప్పవని మహిళలకు సూచించారు. అసోంలో ప్రతీ వందలో 31 పెళ్లిళ్లు.. నిషేధించిన వయసు వాళ్ల వివాహాలే కావడం గమనార్హం. ఈ తరుణంలో.. శనివారం ప్రభుత్వం తరపున నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, చిన్నవయసులోనే మాతృత్వంలాంటి అంశాల కట్టడికి కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైందని ప్రకటించారాయన. మాతృత్వానికి తగిన వయసు ఉండాల్సిందేనన్న ఆయన.. లేకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని మహిళలకు సూచించారు. ‘‘మహిళలు మాతృత్వం కోసం మరీ ఎక్కువ కాలం ఎదురు చూడడం సరికాదు. దానివల్ల సమస్యలు వస్తాయి. మాతృత్వానికి తగిన వయసు 22 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపే’’ అని తెలిపారాయన. ఇంకా పెళ్లికాని వారుంటే ఇది తప్పక పాటించండి అని చిరునవ్వుతో సూచించారు. ఇక బాల్యవివాహాల కట్టడికి తీసుకోబోయే చర్యల గురించి స్పందిస్తూ.. ‘‘రాబోయే ఐదారు నెలల్లో.. వేల మంది పురుషులు కటకటాల పాలు కాకతప్పదు. ఎందుకంటే పద్నాలుగేళ్లలోపు బాలికలతో శారీరకంగా కలవడం నేరం కాబట్టి. వాళ్లు తాము భర్తలమని నిరూపించుకున్నా సరే!. చట్ట ప్రకారం.. వివాహ వయసు 18 ఏళ్లు. కాదని అంతకన్నా తక్కువ వయసులో ఉన్నవాళ్లను వివాహాలు చేసుకుంటే జీవిత ఖైదు తప్పదు అని అసోం సీఎం హెచ్చరించారు. చిన్నవయసులో మాతృత్వం కట్టడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ, అదే సమయంలో మహిళలు తల్లి కావడానికి ఎక్కువ ఏండ్లు తీసుకోవద్దు. ఎందుకంటే.. దేవుడు మన శరీరాలను తగిన వయసులో తగిన పనుల కోసమే సృష్టించాడు కాబట్టి అని సీఎం బిస్వా శర్మ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పద్నాలుగేళ్లలోపు బాలికలను వివాహం చేసుకుంటే గనుక.. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని అసోం కేబినెట్ సోమవారం ఓ నిర్ణయం తీసుకుంది. అలాగే.. 14 నుంచి 18 ఏళ్లలోపు వాళ్లను వివాహం గనుక చేసుకుంటే బాల్యవివాహ నిర్మూలన చట్టం 2006 ప్రకారం కేసు నమోదు చేస్తారు. -
చిన్నారికి అకౌంట్.. పరిహారం ఇస్తానన్న ఫేస్బుక్
ఫేస్బుక్లో ఖాతా తెరవాలంటే కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. కానీ, 11 ఏళ్ల వయసులోనే ఓ అమ్మాయికి అకౌంట్ ఇచ్చి, ఆమె ఆన్లైన్లో లైంగిక వేధింపులకు గురవ్వడానికి కారణమైనందుకు పరిహారం చెల్లిస్తానని ఫేస్బుక్ అంగీకరించింది. కోర్టు వెలుపల కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో ఎంత మొత్తం ఇచ్చేదీ మాత్రం బయటకు తెలియలేదు. తగినంత వయసు లేనివారికి అకౌంట్ ఇవ్వకూడదన్న నిబంధనను అతిక్రమించినందుకు ఫేస్బుక్పై ఆ చిన్నారి తండ్రి దావా వేశారు. నాలుగేళ్ల పాటు తర్జనభర్జనలు జరిగిన తర్వాత గత వారం కోర్టులో విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ అమ్మాయి తన అసభ్య ఫొటోలను తెలియక ఆన్లైన్లో పోస్ట్ చేసిందని, అనేక ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి చాలామంది మగవాళ్లను కాంటాక్ట్ చేసిందని కేసు పత్రాల్లో పేర్కొన్నారు. తర్వాత ఆ అకౌంట్లన్నింటినీ ఫేస్బుక్ తొలగించింది. అయితే, అసలు అంత చిన్న పిల్లలకు అకౌంట్ ఇవ్వడమే ఫేస్బుక్ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని, యూజర్లు తమ వయసు తప్పుగా పేర్కొన్నా వాళ్లను ఆపేందుకు అందులో ఎలాంటి వ్యవస్థా లేదని అమ్మాయి తండ్రి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.