గువాహతి: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాల్య వివాహాల కట్టడికి తమ రాష్ట్రంలో కఠిన చట్టం తేబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. మాతృత్వానికి తగిన వయసు ఉండాల్సిందేనని, లేకుంటే సమస్యలు తప్పవని మహిళలకు సూచించారు. అసోంలో ప్రతీ వందలో 31 పెళ్లిళ్లు.. నిషేధించిన వయసు వాళ్ల వివాహాలే కావడం గమనార్హం. ఈ తరుణంలో..
శనివారం ప్రభుత్వం తరపున నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, చిన్నవయసులోనే మాతృత్వంలాంటి అంశాల కట్టడికి కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైందని ప్రకటించారాయన. మాతృత్వానికి తగిన వయసు ఉండాల్సిందేనన్న ఆయన.. లేకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని మహిళలకు సూచించారు. ‘‘మహిళలు మాతృత్వం కోసం మరీ ఎక్కువ కాలం ఎదురు చూడడం సరికాదు. దానివల్ల సమస్యలు వస్తాయి. మాతృత్వానికి తగిన వయసు 22 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపే’’ అని తెలిపారాయన. ఇంకా పెళ్లికాని వారుంటే ఇది తప్పక పాటించండి అని చిరునవ్వుతో సూచించారు. ఇక బాల్యవివాహాల కట్టడికి తీసుకోబోయే చర్యల గురించి స్పందిస్తూ..
‘‘రాబోయే ఐదారు నెలల్లో.. వేల మంది పురుషులు కటకటాల పాలు కాకతప్పదు. ఎందుకంటే పద్నాలుగేళ్లలోపు బాలికలతో శారీరకంగా కలవడం నేరం కాబట్టి. వాళ్లు తాము భర్తలమని నిరూపించుకున్నా సరే!. చట్ట ప్రకారం.. వివాహ వయసు 18 ఏళ్లు. కాదని అంతకన్నా తక్కువ వయసులో ఉన్నవాళ్లను వివాహాలు చేసుకుంటే జీవిత ఖైదు తప్పదు అని అసోం సీఎం హెచ్చరించారు. చిన్నవయసులో మాతృత్వం కట్టడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ, అదే సమయంలో మహిళలు తల్లి కావడానికి ఎక్కువ ఏండ్లు తీసుకోవద్దు. ఎందుకంటే.. దేవుడు మన శరీరాలను తగిన వయసులో తగిన పనుల కోసమే సృష్టించాడు కాబట్టి అని సీఎం బిస్వా శర్మ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. పద్నాలుగేళ్లలోపు బాలికలను వివాహం చేసుకుంటే గనుక.. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని అసోం కేబినెట్ సోమవారం ఓ నిర్ణయం తీసుకుంది. అలాగే.. 14 నుంచి 18 ఏళ్లలోపు వాళ్లను వివాహం గనుక చేసుకుంటే బాల్యవివాహ నిర్మూలన చట్టం 2006 ప్రకారం కేసు నమోదు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment