గువాహతి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపే క్రమంలో పోక్సో యాక్ట్‌ను ప్రధాన ఆయుధంగా ప్రయోగిస్తూ.. టీనేజ్ భర్తలను కటకటాల వెనక్కి నెడుతోంది అసోం ప్రభుత్వం. ఒకవేళ నేరం గనుక రుజువైతే వాళ్లంతా జీవిత ఖైదు ఎదుర్కోవాల్సి ఉంటుంది!. అయితే.. మైనర్‌లను లైంగిక నేరాల నుంచి రక్షించే ఉద్దేశంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతోంది. ఈ తరుణంలో.. అసోం ప్రభుత్వ చర్యపై అక్కడి హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం అసోంలో అమలు అవుతున్న చట్టం ప్రకారం.. బాల్య వివాహాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం 20 ఏళ్లైనా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. అభియోగాలు నమోదు అయిన తొమ్మిది మంది ముందస్తు బెయిల్ కోసం గువాహతి (గౌహతి) హైకోర్టును ఆశ్రయించారు. వాళ్లకు ఊరట ఇస్తూ బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే ఈ బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా బెంచ్ స్పందిస్తూ..
‘‘బాల్య వివాహం అనేది ముమ్మాటికీ చెడు ఆలోచనే. అలాగని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. అరెస్టుల పర్వంతో ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో అలజడి రేగుతోంది. వాళ్లపై ఆధారపడి పిల్లలు, వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులు బతుకుతున్నారు . ఈ అంశంపై మా అభిప్రాయాలను తెలియజేస్తాము. కానీ, ప్రస్తుతానికి వాళ్లందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టాలా అనేదే సమస్య!. అని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.
పోక్సో చట్టంలో మీరు ఏదైనా జత చేయొచ్చు. కానీ, ఇక్కడ పోక్సో అటే ఏమిటసలు?. న్యాయమూర్తులు అక్కడ ఏముందో చూడలేరు అనుకుంటున్నారా?. పోక్సో యాక్ట్‌ను ఎలా వర్తింపజేస్తారు?. అలాగని మేము ఇక్కడ ఎవరినీ నిర్దోషులుగా ప్రకటించడం లేదు. మిమ్మల్ని(అసోం పోలీసులను ఉద్దేశిస్తూ..) విచారించుకోవడానికి కూడా అడ్డుకోవట్లేదు.ఎవరైనా దోషి అని తేలితే.. ఛార్జ్‌షీట్ ఫైల్ చేయండి. అంతేగానీ కస్టోడియల్ విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముంది? అని జస్టిస్ సుమన్ శ్యామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇప్పటికే అసోం వ్యాప్తంగా.. 3 వేల మందిని బాల్య వివాహాల కట్టడి చట్టం పేరుతో అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. కుటుంబాలను పోషించే మగతోడును బంధించడంపై వాళ్ల భార్యలూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాత్రం బాల్య వివాహం అనేది సంఘానికి పట్టిన చెడు అని, దీని నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల మద్దతు అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు.
అసోంలో ప్రజారోగ్య జీవనవిధాన గణాంకాలు దారుణంగా ఉన్నాయి. ఈ తరుణంలోనే పరిస్థితికి మూలకారణమైన బాల్య వివాహాలను నిర్మూలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బాల్య వివాహాల నిర్మూలన డ్రైవ్‌ను చేపట్టగా.. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేల మందిపై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ డ్రైవ్‌ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.పోలీస్ చర్యలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని విరుచుకుపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment