చిన్నారికి అకౌంట్.. పరిహారం ఇస్తానన్న ఫేస్బుక్
ఫేస్బుక్లో ఖాతా తెరవాలంటే కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. కానీ, 11 ఏళ్ల వయసులోనే ఓ అమ్మాయికి అకౌంట్ ఇచ్చి, ఆమె ఆన్లైన్లో లైంగిక వేధింపులకు గురవ్వడానికి కారణమైనందుకు పరిహారం చెల్లిస్తానని ఫేస్బుక్ అంగీకరించింది. కోర్టు వెలుపల కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో ఎంత మొత్తం ఇచ్చేదీ మాత్రం బయటకు తెలియలేదు. తగినంత వయసు లేనివారికి అకౌంట్ ఇవ్వకూడదన్న నిబంధనను అతిక్రమించినందుకు ఫేస్బుక్పై ఆ చిన్నారి తండ్రి దావా వేశారు. నాలుగేళ్ల పాటు తర్జనభర్జనలు జరిగిన తర్వాత గత వారం కోర్టులో విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ అమ్మాయి తన అసభ్య ఫొటోలను తెలియక ఆన్లైన్లో పోస్ట్ చేసిందని, అనేక ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి చాలామంది మగవాళ్లను కాంటాక్ట్ చేసిందని కేసు పత్రాల్లో పేర్కొన్నారు. తర్వాత ఆ అకౌంట్లన్నింటినీ ఫేస్బుక్ తొలగించింది.
అయితే, అసలు అంత చిన్న పిల్లలకు అకౌంట్ ఇవ్వడమే ఫేస్బుక్ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని, యూజర్లు తమ వయసు తప్పుగా పేర్కొన్నా వాళ్లను ఆపేందుకు అందులో ఎలాంటి వ్యవస్థా లేదని అమ్మాయి తండ్రి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.