జీవో 39తో మళ్లీ పెత్తందారీ వ్యవస్థ
► ప్రస్తుత వ్యవస్థలనే బలోపేతం చేయాలి: కోదండరాం
► అక్టోబర్ రెండో వారంలో నిరుద్యోగ సభ
► పార్టీ కోసం ఒత్తిడి ఉన్నా నిర్ణయం తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితుల్లాంటి సమాంతర వ్యవస్థతో మేలుకన్నా హాని ఎక్కువని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. సమన్వయ సమితుల కోసం ఇచ్చిన జీవో 39లో లొసుగులున్నాయని, మళ్లీ పెత్తందారీ వ్యవస్థను తీసుకొచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. రైతు సమన్యయ సమితులతో కౌలు రైతుల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు.
రైతు సమితులను కేవలం అధికార పార్టీ కార్యకర్తలతో నామినేషన్ పద్ధతిలో నింపే ప్రమాదముందని, వీటి వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలహీనమయ్యే ముప్పుందని హెచ్చరించారు. సమగ్ర రైతాంగ విధానాన్ని ప్రకటించి, ప్రస్తుత వ్యవస్థలనే బలోపేతం చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. ఉద్యోగ, ఉపాధి కల్పనలో దాటవేత ధోరణిని కోదండరాం తీవ్రంగా ఖండిం చారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లోని 2 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేలండర్ను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో భూమి పుత్రులకు రిజర్వేషన్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే విషయమై అక్టోబర్ రెండో వారంలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ విలీన దినంగా సెప్టెంబర్ 17
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు ఐదో దశ స్ఫూర్తి యాత్రను విజయవంతం చేయాలని కోదండరాం కోరారు. జేఏసీ నిర్మాణాన్ని మండల, గ్రామ స్థాయికి విస్తరిస్తామని, ప్రతినెలా జిల్లా కమిటీల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినంగా రాష్ట్రవ్యాప్తంగా పాటిస్తామన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రాట్యుటీ, చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ మం జూరు చేయాలని, దీనిపై ఈ నెలలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. గాయకుడు ఏపూరి సోమన్నపై పోలీసుల నిర్బంధం అప్రజాస్వామికమన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి ఉన్న మాట నిజమేనని.. ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికైనా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమని కోదండరాం వ్యాఖ్యానించారు.