Union Minister Ashok gajapati raju
-
ఎందుకు పడతాం!
విజయవాడలో టీడీపీ ఎంపీ కేసీనేని నాని నడిరోడ్డుపై సీనియర్ ఐపీఎస్ అధికారిని నిలదీసి... ఆయన గన్‌మన్‌పై చేయిచేసుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో చాలా వివాదాస్పదమైంది. అంతలా కాకున్నా... విజయనగరంలో కేంద్ర మంత్రి ఏకంగా అధికారుల సమీక్షలో ఎన్హెచ్ఏఐ సూపరింటెండెంట్ ఇంజినీర్‌పై విరుచుకుపడ్డారు. అయితే ఈసారి ఆ అధికారి మౌనంగా ఉండలేదు. తిరిగి అంతే దీటుగా సమాధానమిచ్చి... అందరినీ ఆశ్చర్యపరిచారు. తప్పు చేయనపుడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదంటూ తెగేసి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అండతో అధికారులపై విరుచుకుపడితే సహించలేరనడానికి విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరం సాక్షిగా జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలో రైల్వే వంతెనకు సంబంధించి అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు, జాతీయ రహదారుల శాఖ అధికారికి మధ్య జరిగిన వాగ్వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌తో సహా అనేక మంది అధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో వారి సంవాదం ప్రభుత్వాధికారుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తికి అద్దం పట్టింది. అంతేకాదు కొన్ని విషయాలు కేంద్ర మంత్రికి తెలియకుండా ఆయన కోటరీలోని కొందరు దాచిపెడుతున్నారన్న విషయం రూఢీ అయ్యింది. అసలేం జరిగిందంటే... జిల్లాలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఇక్కడి కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎస్పీ పాలరాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంశాల వారీగా సమీక్షిస్తున్న మంత్రి పట్టణంలో రైల్వే శాఖ రూ.13.4 కోట్లతో నిర్మిస్తున్న వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతోందంటూ జాతీయ రహదారుల విభాగం(ఎన్హెచ్ఏఐ) సూపరింటెండెంట్ ఇంజినీర్ మనోహర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి కూడా అంతే దీటుగా సమాధానమిచ్చారు. తమకు ప్రతిపాదనలు తమకు అందలేదని అందితే నిర్మించడానికి, తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఆ విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మంత్రి అశోక్ గట్టిగా అడిగే సరికి అంతే తీవ్ర స్వరంతో ఇప్పటికే పలుమార్లు ఆ విషయాన్ని మీ ఓఎస్డీ అప్పలరాజుకు చెప్పామని ఆయన ఆ విషయాన్ని మీకు చెప్పకపోవడం మా తప్పు కాదని స్పష్టంచేశారు. ఓఎస్డీ నిర్వాకం వల్లే... నిజానికి రైల్వే అధికారులు సరైన క్రమంలో ప్రతిపాదనలు పంపించలేదనేది ఎన్హెచ్ఏఐ అధికారుల వాదన. ఆ విషయం తనకెందుకు చెప్పలేదనేది మంత్రి ఆగ్రహం. అయితే అసలు మూలం అప్పలరాజు దగ్గర ఉంది. తనకు అధికారులు చెప్పిన ఏ విషయాన్నీ ఆయన మంత్రికి తెలియపరచడంలేదు. విషయం తెలియక, ఎందుకు జాప్యం జరుగుతుందో అర్ధం కాక అశోక్ గజపతి తొమ్మిది జిల్లాల అధికారిని నలుగురిలో నిలదీశారు. మంత్రి వాదనకు తలవంచితే తమ వైపు తప్పున్నట్లు అంగీకరించినట్లవుతుందని భావించిన ఎస్ఈ ఏ మాత్రం తగ్గలేదు. చివరి వరకూ తన వాదనను బలంగానే వినిపించారు. ఇదే విషయాన్ని ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పారు..మంత్రికి ఎదురు చెప్పాలనే ఉద్దేశం తనకు లేదని, అయితే చేయని తప్పుకు నలుగురిలో నిలదీస్తుంటే ఒప్పుకోలేకపోయానని ఎస్ఈ అన్నారు. రైల్వే శాఖ అధికారులు కాగితంపై మామూలుగా రాసేసి రూ.3.4 కోట్లు ఇమ్మంటున్నారని, పద్ధతి ప్రకారం అడిగితే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఓఎస్డీకి కూడా చెప్పామని ఆయన వివరించారు. -
అశోక్ వనంలో కలుపు మొక్కలు.!
♦ షాడో మంత్రులుగా చెలామణీ అవుతున్న రాజు గారు, రావు గారు ♦ తాము చెప్పిందే చేయాలంటూ అధికారులకు బెదిరింపులు ♦ వేధింపులు భరించలేక బదిలీపై వెళ్లిపోవాలనుకుంటున్న కొందరు ♦ మంత్రికి తెలియకుండా ఇలా జరగదంటున్న ప్రజలు రాజుగారు... రావుగారు... ఇప్పుడు జిల్లా అధికారుల్లో కలవరపెడుతున్న పేర్లు. వీరెవరని అనుకుంటున్నారా... సాక్షాత్తూ కేంద్ర మంత్రి అశోక్ అనుచరులే. కోటలో ఉండే మొత్తం కథ నడిపిస్తూ... అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. షాడో మంత్రులుగా వ్యవహరిస్తూ... మొత్తం చక్రం తిప్పుతున్నారు. వీరి ఒత్తిళ్లు... ఇప్పుడు అధికారులకు వేధింపులుగా మారాయి. అందుకే ఇక్కడ పనిచేయలేం మహాప్రభో అంటూ వెళ్లిపోవడానికే మొగ్గు చూపిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కీలక పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులకు ముఖ్య అనుచరులుండటం సహజం. చాలావరకూ కార్యకలాపాలు వారిద్వారా చక్కబెట్టడం సాధారణం. కానీ అవి హద్దులు దాటితే ఇక భరించడం ఎవరి తరమూ కాదు. జిల్లాలో ప్రస్తుతం కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు అనుచరుల ఆగడాలు అలానే పెచ్చుమీరుతున్నాయి. మంత్రికి తెలిసో లేక తెలియకుండానో వీరు చేస్తున్న పనులు జిల్లా స్థాయి అధికారులను సైతం కలవరపరుస్తున్నాయి. అన్నిటిలో తలదూరుస్తూ, అభివృద్ధి పనులకు అడ్డుతగులుతున్నారు. ఇక వారికి ఎదురు చెప్పలేక... వాటిని పాటించలేక ఇక్కడినుంచి బదిలీ చేయించుకుని వెళ్లిపోవాలనే యోచనలో పలువురు అధికారులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో స్పష్టమువుతోంది. ‘రాజు’గారు చెప్పిందే వేదం అశోక్ అనుచరుల్లో ముఖ్యుడైన రాజుగారు తానే బాస్‌లా చెలామణి అవుతున్నారు. అధికారులనెత్తినెక్కి కూర్చున్నారు. కొన్ని నెలల క్రితం వీధి దీపాల కాంట్రాక్టు విషయంలో తాను చెప్పిన వ్యక్తికి కాంట్రాక్టులో భాగం ఇవ్వాలంటూ జిల్లా పంచాయతీ అధికారిని భయపెట్టారు. అదే విషయంలో చీఫ్ ప్లానింగ్ అధికారిపైనా ఒత్తిడి తీసుకువచ్చారు. జిల్లాలోని ఓ మున్సిపల్ కమిషనర్ తమకు అనుకూలంగా ఉండటం లేదన్న కారణంతో ఆయనపై ఏసీబీని ప్రయోగించి కేసులు పెట్టించారనే అపవాదునూ మూటగట్టుకున్నారు. తాజాగా జిల్లా అధికారి ఒకరిని ఫోన్లో బెదిరించారు. విజయనగరం పట్టణంలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి విడుదలైన రూ.కోట్ల నిధులను ఖర్చు చేయవద్దనేది ఆ బెదిరింపు సారాంశం. ఎంతోమంది యువతీ యువకులతో ముడిపడి ఉన్నప్పటికీ ఆ పని చేయడం వల్ల తమకు ఉపయోగం లేదనే ఒకే ఒక్క కారణంతో దానిని జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆ అధికారి చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బదిలీ చేయించుకుపోవడం తప్ప తమకు వేరే గత్యంతరం లేదని ‘సాక్షి ప్రతినిధి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చెప్పని పనులు పనికి‘రావు’ ఇక రావుగారి వ్యవహరశైలికూడా ఏమాత్రం తీసిపోవట్లేదు. సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో తమ వాటాలు తెప్పించుకోవడంలో ఈయన దిట్ట. ఎంపీ లాడ్స్ ఎక్కడెక్కడ ఖర్చు చేయాలి, ఏ డిపార్ట్మెంట్కు కేటాయించాలనేది ఈయనే నిర్ణయించాలి మరి. ఏ అధికారైనా తాను చెప్పిన వారికి కాంట్రాక్టు ఇవ్వకపోయినా, అడిగిన వాటా అందించకపోయినా తిట్ల దండకం అందుకుంటారట. సాక్షాత్తూ గత జాయిట్ కలెక్టర్‌పైనే చిందులు తొక్కిన చరిత్ర ఉంది. జాతీయ స్థాయిలో జరిగిన ఓ కుంభకోణంలో అతని కాల్ లిస్ట్‌పై అనుమానాలు రావడంతో కొంతకాలంగా దూకుడుకు కళ్లెం పడింది. జిల్లా స్థాయిలో మాత్రం అతని హవా కొనసాగుతూనే ఉంది. వీరిరువురి ఆగడాల గురించి మంత్రికి ఫిర్యాదు చేసేందుకు ఎవరూ సాహసించడం లేదు. ‘పెద్దాయనకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా.. ఎందుకొచ్చిన గొడవలే’ అని ఎవరికి వారు తమలో తామే బాధపడుతున్నారు. విచారించే తీరికెక్కడిది? కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు ప్రజలకు ఏం చేశారనేదానిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఇంత వరకూ అటునుంచి సమాధానం రాలేదు. ఆయన మౌనం అర్ధంగీకారమేనన్నది విపక్షాల నమ్మకం. ప్రస్తుతానికి కేంద్ర మంత్రికిగానీ, ఆయన అనుచరులకు గానీ ఇటు ప్రజలకు, అటు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే తీరిక లేదు. జిల్లాలో తమ పనులు జరిపించుకోవడం, తమకు నచ్చని వారిని వేధించడం, వచ్చిన నిధులను తమకు అనుకూలంగా ఖర్చు చేసుకోవడంలో వారు చాలా బిజీగా ఉన్నారు. కుమార్తెను రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనేదే ఆయన ముందున్న లక్ష్యం. అందుకే తన అనుచరగణం ఏం చేస్తోందనేది పరిశీలించే తీరిక లేదు. దీంతో వారు అధికారులపైనా, జనంపైనా పడుతున్నారు. -
రాజధాని భూములపై ఆరోపణలు సహజమే
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి ప్రాంత భూములపై ఆరోపణలు సహజమేనని కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూముల పేర్ల మార్పులు, బదలాయింపులు న్యాయపరంగా చెల్లవని బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రైతులు వారి భూములను పూలింగ్ కింద ఇచ్చారని, అది కొందరికి ఇష్టం లేక ఆరోపణలు చేస్తున్నార ని చెప్పుకొచ్చారు. అసైన్డ్ భూములను టీడీపీ నాయకులు స్వంత పేర్లపై రాయించుకుంటే న్యాయ పరంగా చెల్లదన్నారు. భోగాపురంలో విమానాశ్రయానికి సూత్రప్రాయ అనుమతులు లభించాయని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి ఉందని తెలిపారు. -
కేంద్ర మంత్రి నిద్రపోతున్నారా ?
* గిరిజన యూనివర్సిటీ తరలిపోవడంపై మండిపాటు * ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా విజయనగరం క్రైం : జిల్లాలో నెలకొల్పాల్సిన గిరిజన యూనివర్సిటీ విశాఖపట్నం తరలిపోతుంటే కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నిద్రపోతున్నారా అని ఎస్ఎఫ్ఐ విజయనగరం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జె. రామయ్య, కె. సురేష్ ప్రశ్నించారు. యూనివర్సిటీ తరలింపును నిరసిస్తూ శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు జిల్లాకు ప్రకటించిన పది వరాల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఒకటన్నారు. యూనివర్శిటీని పక్క జిల్లాకు తరలించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జిల్లాకు చెందిన శాసనసభ్యుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు తక్షణమే స్పందించి గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును అడ్డుకోవాలన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనువైన స్థలం లేదనే కారణం సరికాదన్నారు. ఇప్పటికే సాలూరు, నెల్లిమర్ల, బొండపల్లి, గుర్ల, గంట్యాడ, మెరకముడిదాం, తదితర ప్రాంతాలో అనువైన స్థలాలు ఉన్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించారన్నారు. ఇప్పటికే పార్వతీపురంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల, జీఎల్.పురంలో ఉన్న పాలిటెక్నికల్ కళాశాలను విశాఖపట్నానికి తరలించారని, ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ కూడా తరలించడం అన్యాయమన్నారు. తక్షణమే ప్రజా ప్రతినిధులు స్పందించి యూనివర్సిటీ తరలింపును అడ్డుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, మణికంఠ, జిల్లా కమిటీ సభ్యుడు గణేష్, అప్పన్న పాల్గొన్నారు. యునివర్శిటీ నిర్మించాల్సిందే.. సాలూరు రూరల్ : జిల్లా విద్యార్థులకు మేలు జరగాలంటే సాలూరు నియోజకవర్గంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించాల్సిందేనని టీడీపీ నాయకురాలు, అరుకు పార్లమెంట్ ఇన్చార్జి సం ధ్యారాణి అభిప్రాయపడ్డారు. తన నివాసగృహంలో విలేకరులతో మాట్లాడు తూ, జిల్లాకు మంజురైన యునివర్శిటీ వైజాగ్ వెళ్లిపోతుందనే వార్తలు పత్రికల్లో రావడం చూసి తనకు చాలా బాధగా ఉందన్నారు. పాచిపెంట మండలం చాపరాయివలస గ్రామం సమీపంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారని, అందుకు గాను కేంద్రమంత్రి పి. అశోక్ గజపతిరాజు మాన్సాస్ నుంచి 3200 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. అయితే ఇప్పుడెందుకు యూనివర్శిటీని తరలిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పాచిపెంటలో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయకుమారి, చిన్నిదొర, నిమ్మాది పాల్గొన్నారు.