
అశోక్ వనంలో కలుపు మొక్కలు.!
♦ షాడో మంత్రులుగా చెలామణీ అవుతున్న రాజు గారు, రావు గారు
♦ తాము చెప్పిందే చేయాలంటూ అధికారులకు బెదిరింపులు
♦ వేధింపులు భరించలేక బదిలీపై వెళ్లిపోవాలనుకుంటున్న కొందరు
♦ మంత్రికి తెలియకుండా ఇలా జరగదంటున్న ప్రజలు
రాజుగారు... రావుగారు... ఇప్పుడు జిల్లా అధికారుల్లో కలవరపెడుతున్న పేర్లు. వీరెవరని అనుకుంటున్నారా... సాక్షాత్తూ కేంద్ర మంత్రి అశోక్ అనుచరులే. కోటలో ఉండే మొత్తం కథ నడిపిస్తూ... అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. షాడో మంత్రులుగా వ్యవహరిస్తూ... మొత్తం చక్రం తిప్పుతున్నారు. వీరి ఒత్తిళ్లు... ఇప్పుడు అధికారులకు వేధింపులుగా మారాయి. అందుకే ఇక్కడ పనిచేయలేం మహాప్రభో అంటూ వెళ్లిపోవడానికే మొగ్గు చూపిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కీలక పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులకు ముఖ్య అనుచరులుండటం సహజం. చాలావరకూ కార్యకలాపాలు వారిద్వారా చక్కబెట్టడం సాధారణం. కానీ అవి హద్దులు దాటితే ఇక భరించడం ఎవరి తరమూ కాదు. జిల్లాలో ప్రస్తుతం కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు అనుచరుల ఆగడాలు అలానే పెచ్చుమీరుతున్నాయి. మంత్రికి తెలిసో లేక తెలియకుండానో వీరు చేస్తున్న పనులు జిల్లా స్థాయి అధికారులను సైతం కలవరపరుస్తున్నాయి. అన్నిటిలో తలదూరుస్తూ, అభివృద్ధి పనులకు అడ్డుతగులుతున్నారు. ఇక వారికి ఎదురు చెప్పలేక... వాటిని పాటించలేక ఇక్కడినుంచి బదిలీ చేయించుకుని వెళ్లిపోవాలనే యోచనలో పలువురు అధికారులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో స్పష్టమువుతోంది.
‘రాజు’గారు చెప్పిందే వేదం
అశోక్ అనుచరుల్లో ముఖ్యుడైన రాజుగారు తానే బాస్‌లా చెలామణి అవుతున్నారు. అధికారులనెత్తినెక్కి కూర్చున్నారు. కొన్ని నెలల క్రితం వీధి దీపాల కాంట్రాక్టు విషయంలో తాను చెప్పిన వ్యక్తికి కాంట్రాక్టులో భాగం ఇవ్వాలంటూ జిల్లా పంచాయతీ అధికారిని భయపెట్టారు. అదే విషయంలో చీఫ్ ప్లానింగ్ అధికారిపైనా ఒత్తిడి తీసుకువచ్చారు. జిల్లాలోని ఓ మున్సిపల్ కమిషనర్ తమకు అనుకూలంగా ఉండటం లేదన్న కారణంతో ఆయనపై ఏసీబీని ప్రయోగించి కేసులు పెట్టించారనే అపవాదునూ మూటగట్టుకున్నారు. తాజాగా జిల్లా అధికారి ఒకరిని ఫోన్లో బెదిరించారు. విజయనగరం పట్టణంలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి విడుదలైన రూ.కోట్ల నిధులను ఖర్చు చేయవద్దనేది ఆ బెదిరింపు సారాంశం. ఎంతోమంది యువతీ యువకులతో ముడిపడి ఉన్నప్పటికీ ఆ పని చేయడం వల్ల తమకు ఉపయోగం లేదనే ఒకే ఒక్క కారణంతో దానిని జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆ అధికారి చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బదిలీ చేయించుకుపోవడం తప్ప తమకు వేరే గత్యంతరం లేదని ‘సాక్షి ప్రతినిధి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన చెప్పని పనులు పనికి‘రావు’
ఇక రావుగారి వ్యవహరశైలికూడా ఏమాత్రం తీసిపోవట్లేదు. సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో తమ వాటాలు తెప్పించుకోవడంలో ఈయన దిట్ట. ఎంపీ లాడ్స్ ఎక్కడెక్కడ ఖర్చు చేయాలి, ఏ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించాలనేది ఈయనే నిర్ణయించాలి మరి. ఏ అధికారైనా తాను చెప్పిన వారికి కాంట్రాక్టు ఇవ్వకపోయినా, అడిగిన వాటా అందించకపోయినా తిట్ల దండకం అందుకుంటారట. సాక్షాత్తూ గత జాయిట్ కలెక్టర్‌పైనే చిందులు తొక్కిన చరిత్ర ఉంది. జాతీయ స్థాయిలో జరిగిన ఓ కుంభకోణంలో అతని కాల్ లిస్ట్‌పై అనుమానాలు రావడంతో కొంతకాలంగా దూకుడుకు కళ్లెం పడింది. జిల్లా స్థాయిలో మాత్రం అతని హవా కొనసాగుతూనే ఉంది. వీరిరువురి ఆగడాల గురించి మంత్రికి ఫిర్యాదు చేసేందుకు ఎవరూ సాహసించడం లేదు. ‘పెద్దాయనకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా.. ఎందుకొచ్చిన గొడవలే’ అని ఎవరికి వారు తమలో తామే బాధపడుతున్నారు.
విచారించే తీరికెక్కడిది?
కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు ప్రజలకు ఏం చేశారనేదానిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఇంత వరకూ అటునుంచి సమాధానం రాలేదు. ఆయన మౌనం అర్ధంగీకారమేనన్నది విపక్షాల నమ్మకం. ప్రస్తుతానికి కేంద్ర మంత్రికిగానీ, ఆయన అనుచరులకు గానీ ఇటు ప్రజలకు, అటు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే తీరిక లేదు. జిల్లాలో తమ పనులు జరిపించుకోవడం, తమకు నచ్చని వారిని వేధించడం, వచ్చిన నిధులను తమకు అనుకూలంగా ఖర్చు చేసుకోవడంలో వారు చాలా బిజీగా ఉన్నారు. కుమార్తెను రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనేదే ఆయన ముందున్న లక్ష్యం. అందుకే తన అనుచరగణం ఏం చేస్తోందనేది పరిశీలించే తీరిక లేదు. దీంతో వారు అధికారులపైనా, జనంపైనా పడుతున్నారు.