జిల్లాలో నెలకొల్పాల్సిన గిరిజన యూనివర్సిటీ విశాఖపట్నం తరలిపోతుంటే కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నిద్రపోతున్నారా అని ఎస్‌ఎఫ్‌ఐ విజయనగరం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జె. రామయ్య, కె. సురేష్ ప్రశ్నించారు.
* గిరిజన యూనివర్సిటీ తరలిపోవడంపై మండిపాటు
* ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా
విజయనగరం క్రైం : జిల్లాలో నెలకొల్పాల్సిన గిరిజన యూనివర్సిటీ విశాఖపట్నం తరలిపోతుంటే కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నిద్రపోతున్నారా అని ఎస్‌ఎఫ్‌ఐ విజయనగరం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జె. రామయ్య, కె. సురేష్ ప్రశ్నించారు. యూనివర్సిటీ తరలింపును నిరసిస్తూ శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు జిల్లాకు ప్రకటించిన పది వరాల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఒకటన్నారు. యూనివర్శిటీని పక్క జిల్లాకు తరలించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
జిల్లాకు చెందిన శాసనసభ్యుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు తక్షణమే స్పందించి గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును అడ్డుకోవాలన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనువైన స్థలం లేదనే కారణం సరికాదన్నారు. ఇప్పటికే సాలూరు, నెల్లిమర్ల, బొండపల్లి, గుర్ల, గంట్యాడ, మెరకముడిదాం, తదితర ప్రాంతాలో అనువైన స్థలాలు ఉన్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించారన్నారు.
ఇప్పటికే పార్వతీపురంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల, జీఎల్.పురంలో ఉన్న పాలిటెక్నికల్ కళాశాలను విశాఖపట్నానికి తరలించారని, ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ కూడా తరలించడం అన్యాయమన్నారు. తక్షణమే ప్రజా ప్రతినిధులు స్పందించి యూనివర్సిటీ తరలింపును అడ్డుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, మణికంఠ, జిల్లా కమిటీ సభ్యుడు గణేష్, అప్పన్న పాల్గొన్నారు.
యునివర్శిటీ నిర్మించాల్సిందే..
సాలూరు రూరల్ : జిల్లా విద్యార్థులకు మేలు జరగాలంటే సాలూరు నియోజకవర్గంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించాల్సిందేనని టీడీపీ నాయకురాలు, అరుకు పార్లమెంట్ ఇన్‌చార్జి సం ధ్యారాణి అభిప్రాయపడ్డారు. తన నివాసగృహంలో విలేకరులతో మాట్లాడు తూ, జిల్లాకు మంజురైన యునివర్శిటీ వైజాగ్ వెళ్లిపోతుందనే వార్తలు పత్రికల్లో రావడం చూసి తనకు చాలా బాధగా ఉందన్నారు.
పాచిపెంట మండలం చాపరాయివలస గ్రామం సమీపంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారని, అందుకు గాను కేంద్రమంత్రి పి. అశోక్ గజపతిరాజు మాన్సాస్ నుంచి 3200 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. అయితే ఇప్పుడెందుకు యూనివర్శిటీని తరలిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పాచిపెంటలో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయకుమారి, చిన్నిదొర, నిమ్మాది పాల్గొన్నారు.