51వ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ :
జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ వేడి చల్లార లేదు. వరుసగా 51వ రోజు కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదుల ఆందోళనలు ఉధృతంగా సాగాయి. ఎన్జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం ఒంగోలు నగరంతో పాటు, అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను ఉద్యోగులు ముట్టిడించారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులైన బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, బ్యాంక్‌లు మూతపడ్డాయి. బ్యాంక్‌ల్లో కార్యకలాపాలు స్తంభించిపోవడంతో ఆర్థిక లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆందోళనలు యథావిధిగా కొనసాగాయి. ఒంగోలులో ఆర్టీసీ కార్మికులు వైద్యశిబిరం నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పలు జేఏసీల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
స్తంభించిన కార్యకలాపాలు
ఉద్యోగులు కార్యాలయాల ముట్టడితో జిల్లా వ్యాప్తంగా కేంద్ర సర్వీసులు, బ్యాంక్‌ల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అన్ని కార్యాలయాలు, బ్యాంక్‌లను ఉద్యోగులు మూసివేయించారు. ఉద్యమంలో భాగంగా అద్దంకి పట్టణంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించిన జేఏసీ నాయకులు.. మేదరమెట్ల - నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. బంగ్లారోడ్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బల్లికురవలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు 8వ రోజుకు చేరాయి. చీరాల పట్టణంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. మున్సిపల్ ఉద్యోగులు సోనియాగాంధీ, కేసీఆర్ మాస్క్‌లు ధరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ చేపట్టిన రిలే దీక్షలో ఉపాధ్యాయినులు కూర్చున్నారు. పట్టణంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను స్తంభింప చేశారు.
వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలు చేపట్టారు. కారంచేడులో రాష్ట్ర సమైక్యత కోసం 95 ఏళ్ల వృద్ధుడు జాగర్లమూడి అక్కయ్య తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారు. కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రంలో ఉద్యోగులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను మూయించారు. కొండపి నియోజకవర్గంలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమంలో భాగంగా మర్రిపూడిలో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాల నుంచి బస్టాండ్ సెంటర్ వరకు 60 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. పొన్నలూరులో ఉపాధ్యాయులు రిలే దీక్ష చేపట్టారు. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంలో పాఠశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కనిగిరి సమైక్యాంధ్ర ఉద్యమంతో అట్టుడుకుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా నాలుగు రోజుల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హాస్టల్ వార్డ్న్లు, సిబ్బంది రిలేదీక్ష చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు 11వ రోజుకు చేరాయి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా వెలిగండ్లలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించారు. హెచ్‌ఎంపాడులో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సీఎస్‌పురం మండలం కంభంపాడు జంక్ష న్లో పి.నాగులవరం విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో చేశారు. పామూరులో రాష్ట్ర విభజనకు నిరసనగా ఉపాధ్యాయ జేఏసీ రిలే దీక్షలు చేపట్టింది. పామూరు సర్పంచ్ డీవీ మనోహర్ రెండో రోజు దీక్ష కొనసాగించారు. సంతనూతలపాడులో జేఏసీ నాయకులు బ్యాంక్‌ల కార్యకలాపాలను అడ్డుకున్నారు. మార్కాపురంలోనూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు మూతపడ్డాయి. పొదిలిలో సమైక్యాంధ్ర కోరుతూ మత్స్యకారులు ర్యాలీ నిర్వహించి కేసీఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలు దహనం చేశారు. యర్రగొండపాలెంలో సమైక్యాంధ్ర ఉద్యమం రగులుతోంది. సుగాలీలు నిర్వహించిన గర్జనతో పట్టణం దద్దరిల్లింది. భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు, గిరిజన నృత్యాలతో నిరసన తెలిపారు.
అలాగే రోడ్లపైనే వంటా-వార్పు చేపట్టారు. త్రిపురాంతకంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. దోర్నాలలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు 17వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వీధుల వెంట భిక్షాటన చేసి నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట జేఏసీ ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు కూర్చున్నారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, జేఏసీ నాయకులు పీఆర్ కాలనీ నుంచి పట్టణంలోని అన్ని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. బేస్తవారిపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమైక్యాంద్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. కంభంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గంట పాటు రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కొమరోలులో ముస్లిం సోదరులు రిలే నిరాహార దీక్ష చేశారు.