సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందేనని పలువురు మేధావులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుందని వక్తలు ముక్తకంఠంతో చెప్పారు. నీరులాంటి కీలకాంశాలను విస్మరించి ఏకపక్షంగా విభజన చేయడం సరికాదంటూ నిరసించారు.రాష్ట్ర విభజన ప్రక్రియపై సీమాంధ్రలో రగులుతున్న ఉద్యమాల నేపథ్యంలో సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో శనివారం నిర్వహించిన ‘ఎవరెటు’ చైతన్యపథం చర్చావేదికలో పలువురు అభిప్రాయాలను వెల్లడించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మేధావులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ విభజనలో శాస్త్రీయత లేదన్నారు. సీమాంధ్రలో ప్రజల మనోభావాలను గుర్తించే నాయకులకే భవిష్యత్తులో రాజకీయ మనుగడ ఉంటుందన్నారు.
నీటిపారుదల శాఖ ఇంజినీర్ తిరుమలరావు మాట్లాడుతూ విభజన ద్వారా సమన్యాయం కష్టమని గుర్తెరిగిఉమ్మడిగా ఉంచడమే శరణ్యమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి. తులసీరావు మాట్లాడుతూ విభజనకు వెనుకబాటే ప్రాతిపదికయితే ఉత్తరాంధ్ర కూడా వెనుకబడిందేనన్నారు. 60ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ శ్రమను హైదరాబాద్ అభివృద్ధికి వెచ్చించారన్నారు. ఆనాడే తెలంగాణను వేరే ప్రాంతంగా ఉంచితే నేటి అభివృద్ధి సాధ్యమయ్యేది కాదన్నారు. రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు బగాది రామ్మోహన్‌రావు మాట్లాడుతూ సెంటిమెంట్ పేరిట రాష్ట్రాన్ని విడగొట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయని చెప్పారు. జేఏసీ కన్వీనర్ జామి భీమ్‌శంకర్ మాట్లాడుతూ చిరంజీవి..బొత్ససత్యనారాయణల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ మీరిద్దరూ ఎక్కడున్నారు.. హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారా అంటూ హెచ్చరించారు. ఉద్యమంలోకి రాకపోతే భవిష్యత్తు ఉండ దన్నారు. విద్యావేత్త శ్రీనివాసరావు.. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల లతోపాటు చర్చలో పాల్గొన్న మరికొందరు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాత్రమే ఉద్యమాల్లో పాల్గొంటున్నారని, మిగిలిన రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరితో ఉన్నారని దుయ్యబట్టారు.
సమైక్యతే మా అభిమతం
Published Sun, Aug 18 2013 1:59 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement