కేంద్రమంత్రి జేడీ శీలానికి విజయవాడలో అడుగడుగునా సమైక్య సెగ తాకింది.
కేంద్రమంత్రి జేడీ శీలానికి అడుగడుగునా సమైక్య సెగ తాకింది. తొలుత కొంతమంది సమైక్యవాదులు, ఆ తర్వాత సీమాంధ్ర లాయర్ల జేఏసీ సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేయడానికి ఉద్యుక్తుడవుతున్న జేడీ శీలం.. సమైక్యవాదుల ప్రతిఘటనతో మిన్నకుండిపోయారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తేనే సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
కాసేపటికి సీమాంధ్ర లాయర్ల జేఏసీకి చెందిన పలువురు న్యాయవాదులు కూడా శీలాన్ని అడ్డుకున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు తెలంగాణ బిల్లు రాకుండా అడ్డుకుంటామన్న హామీ ఇవ్వాలని ఆయనను లాయర్లు పట్టుబట్టారు. దాంతో.. ఏమీ చేయలేని పరిస్థితిలో, విభజనను అడ్డుకునేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామని చెప్పిన శీలం..అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరారు.
కాగా, ఈనెల 26వ తేదీన హైదరాబాద్లో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావానికి సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ తన మద్దతు తెలిపింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయవాదులు భారీ సంఖ్యలో ఆ సమావేశంలో పాల్గొంటారని జేఏసీ ప్రతినిధులు చెప్పారు.