‘గణేష్’ విక్రయాలకు ‘సమైక్య’ సెగ
జియాగూడ, న్యూస్‌లైన్: వినాయక విగ్రహాల విక్రయాలకూ సమైక్య సెగ తగిలింది. ఫలితంగా ధూల్‌పేట్‌లో ఈ ఏడాది దాదాపు రెండు వేల గణేష్ విగ్రహాలు అమ్ముడుకాక మిగిలిపోయాయి. ప్రతి సంవత్సరం ధూల్‌పేట్‌లో కళాకారులు 25 వేల నుంచి 30 వేల విగ్రహాలను తయారు చేస్తారు. ఈ విగ్రహాలు నగరంతోపాటు రాష్ర్టంలోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖపట్నం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు తదితర జిల్లాల వాసులు కొనుగోలు చేసి తీసుకువెళ్తారు. కాగా ఈ సంవత్సరం గత 40 రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమం ధూల్‌పేట్ కళాకారులను నిరాశకు గురిచేసింది.
పలు జిల్లాల వాసులు ఇక్కడి కళాకారులకు రెండు, మూడు నెలల ముందు గణేష్ విగ్రహాల కోసం అడ్వాన్స్‌లు ఇచ్చినా.. సమైక్య ఉద్యమంతోపాటు బంద్, ఇతర ఆందోళనల కారణంగా వాటిని తీసుకెళ్లలేదు. దాంతో దాదాపు 2వేల విగ్రహలు అలాగే మిగిలిపోయాయి. కళాకారులకు సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లింది.