అంతరిక్షం నుంచి సెల్ఫీ తీసుకుంటారా...
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, స్మార్ట్ఫోన్ల హవా కారణంగా సెల్ఫీల ట్రెండ్ ఊపందుకుంది. దీనిని ముందే అంచనా వేశారు కాబట్టే.. అక్కడా ఇక్కడా తీసుకుంటే ఏం మజా ఉంటుంది? ఏకంగా అంతరిక్షం నుంచే సెల్ఫీ(స్వీయ చిత్రం) తీసుకుంటే అదిరిపోదూ? అంటూ 2011లోనే రంగంలోకి దిగారు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ మాజీ విద్యార్థులు అలెక్స్ బేకర్, క్రిస్ రోస్‌లు.
ఫొటోలు, వస్తువులను స్పేస్ బెలూన్‌కు కట్టి పైకి పంపడం, బెలూన్‌కు అమర్చిన కెమెరాలు, ఫోన్లతో అంతరిక్షంలో సెల్ఫీలు క్లిక్‌మనిపించడం, బెలూన్ నేలపై పడిన తర్వాత జీపీఎస్, గాలివాటం ఆధారంగా వస్తువులను వెతికి పట్టుకోవడం. రోజూ ఇదే పని వీరికి. ఇప్పుడిదే వీరికి వ్యాపారం అయింది. ఆసక్తి ఉన్నవారు సంప్రదిస్తే ఫొటోలు, వస్తువులను రోదసికి పంపించి అందమైన సెల్ఫీలను తీసిస్తారు.
చనిపోయినవారి అస్థికలనూ పైకి పంపుతామని అంటున్నారు. ఒక్కసారి మన వస్తువులను పైకి పంపాలంటే రూ. 39 లక్షలు వసూలు చేస్తారు. మనమే పంపించుకుంటామంటే రూ. 48 వేలకే స్పేస్ బెలూన్లు ఇస్తారు. ఇంతవరకూ ఒకసారి తప్ప, అన్నిసార్లూ రోదసికి పంపించిన వస్తువులను వీరు తిరిగి పట్టుకోగలిగారట.