కంప్యూటర్ లాక్.. డేటా అన్‌లాక్
►సైబర్ ఎక్స్టార్షన్... ర్యాన్సమ్వేర్!
►బ్రౌజర్ లాకర్ వైరస్ ముప్పూ పొంచి ఉంది
►కంప్యూటర్లను లాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్ళు
►డేటాను అన్‌లాక్ చేసేందుకు డెడ్‌లైన్ నిర్దేశం
►ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్ పేర్లతోనూ బ్లాకింగ్
►బహుపరాక్ అంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు
సిటీబ్యూరో: ఓ వ్యక్తిని అపహరించి నిర్భంధించడం... కొంత మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేయడం... కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్ అనే ఈ నేరం నేరుగా జరుగుతుంది. ఇదే తరహాలో కంప్యూటర్ను తమ ఆధీనంలోకి తీసుకుని లాక్ చేయడం... అన్‌లాక్ చేయడానికి నిర్ణీత మొత్తం డిమాండ్ చేయడం... ర్యాన్స్మ్ వేర్‌గా పిలిచే ఈ క్రైమ్ ఆన్లైన్ ద్వారా జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ‘వన క్రై’ సైతం ర్యాన్స్మ్వేరే. సైబర్ ఎక్స్‌టార్షన్‌గా (బెదిరించి డబ్బు గుంజటం) పిలిచే ర్యాన్సమ్ వేర్, బ్రౌజర్ లాకర్ వంటి వాటి ముప్పు నానాటికీ పెరుగుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. కంప్యూటర్లను బ్లాక్ చేస్తున్న వ్యవస్థీకృత సైబర్ నేరగాళ్లు డెడ్‌లైన్ విధించి మరీ అనుకున్న మొత్తం వసూలకు ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు.
ఈ–మెయిల్‌తో మొదలు...
ర్యాన్సమ్ వేర్, బ్రౌజర్ లాకర్ వంటి వైరస్‌లను సైబర్ నేరగాళ్లు ఈ–మెయిల్స్, యాడ్స్ రూపంలో కంప్యూటర్లకు పంపిస్తున్నారు. ఉద్యోగార్థులకు సంబంధించిన ఈ–మెయిల్ ఐడీలను వివిధ ఉద్యోగ సంబంధిత వెబ్సైట్లు, అవివాహితులు, వివాహం కోసం రిజిస్టర్ చేసుకున్న వారికి మాట్రిమోనియల్ సైట్స్ నుంచి సైబర్ నేరగాళ్లు సంగ్రహిస్తున్నారు. వీటితో పాటు వృత్తి, వ్యాపార సంబంధిత సైట్లలోనూ పొందుపరిచే ఈ–మెయిల్స్ సంగ్రహిస్తున్న సైబర్ నేరగాళ్లు వీటి ఆధారంగా ఎక్స్‌టార్షన్‌కు పావులు కదుపుతున్నారు. అలా ఈ–మెయిల్ ఐడీలు సంగ్రహించే సైబర్ నేరగాళ్లు వాటిని అనుగుణంగానే ఉద్యోగావకాశం, వివాహసంబంధం, వృత్తి, వ్యాపార పెంపొందించే మార్గాలు అంటూ టార్గెట్ చేసిన వారికి మెయిల్స్ పంపడం, యాడ్స్ రూపంలో పాప్అప్స్ ఇవ్వడం చేస్తున్నారు. వీటిని చూసిన వారు సాధారణంగానే ఆకర్షితులవుతున్నారు. ఈ మెయిల్, యాడ్‌లోని వివరాలు చూడటానికి లింకును ఓపెన్ చేస్తే చాలు... ఆ వైరస్ కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లోకి జొరబడుతుంది.
దర్యాప్తు, నిఘా సంస్థల పేరుతోనూ...
ఇటీవల కాలంలో ర్యాన్సమ్వేర్తో పాటు బ్రౌజర్ లాకర్ వైరస్ ముప్పు పెరిగింది. ఇందులో కంప్యూటర్ మొత్తం లాక్ కావడంతో పాటు ఆ పని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ చేసినట్లు స్క్రీన్‌పై కనిపిస్తుంది. అన్ని దేశాల్లోనూ నేరంగా పరిగణించే చైల్డ్ పోర్న్ వెబ్‌సైట్స్ చూసినందుకో, మరో ఉల్లంఘన చేసినందుకో బ్లాక్ చేసినట్లు చెప్తుంది. ఈ వైరస్‌లో ఉన్న మరో లక్షణం ఏమిటంటే... దానంతట అదే వెబ్క్యాప్ను ఆపరేట్ చేయడంతో పాటు కంప్యూటర్ ఐపీ అడ్రస్, లోకేషన్స్ తెరపైన డిస్ప్లే చేస్తుంది. దీనికి కొనసాగింపుగా ‘మీ కదకల్ని గమనిస్తున్నాం. తదుపరి చర్యలకు ఉపక్రమించకూడదంటే చేసిన తప్పుకు పెనాల్టీ చెల్లించడం’ అంటూ డిస్ప్లే అవుతుంది. దీంతో పూర్తిగా భయానికి లోనయ్యే వినియోగదారుడు నిర్దేశించిన డెడ్‌లైన్‌లోపు చెల్లింపులు చేసేస్తున్నాడు.
యాంటీ వైరస్‌లకూ లొంగదు...
బ్రౌజర్ లాకర్ కొన్ని యాంటీ వైరస్‌లకు లొంగినా.. ర్యాన్సమ్వేర్కు మాత్రం పరిష్కారం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. సాధారణ వినియోగదారులకు డేటా అంత ప్రాముఖ్యం కాకపోయినా... సాఫ్ట్వేర్ రంగం, ఉన్నతోద్యోగులు, బీపీఓ ఉద్యోగులకు ఇది ఎంతో కీలకమైంది. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్ కీ ఏర్పాటు చేయడని వివరిస్తున్నారు. దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ వారు అడిగినంత చెల్లించాల్సి వస్తోందంటున్నారు. ఈ తరహాలో నేరాలు చేసే వారు బోగస్ సర్వర్లు, ఐపీ అడ్రస్‌లు వినియోగిస్తుండటంతో వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ర్యాన్సమ్వేర్ బారినపడిన వారిలో బయటకు చెబుతున్నది అతి తక్కువే అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ–మెయిల్స్, యాడ్స్‌కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో పటిష్టమైన యాంటీ వైరస్ ఏర్పాటు చేసుకోవడమే ఇందుకు పరిష్కారంగా సూచిస్తున్నారు.
లాక్ చేశామని చెబుతూనే...
ఈ ర్యాన్సమ్వేర్ వైరస్ కంప్యూటర్లో ప్రశించిన మరుక్షణం అందులో ఉన్న డేటా మొత్తాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి, సిస్టం మొత్తాన్ని లాక్ చేస్తుంది. మానిటర్‌పైన స్పష్టంగా ‘మీ కంప్యూటర్ను లాక్ చేశాం’ అనే మెసేజ్ కనిపిస్తుంది. దీన్ని అన్‌లాక్ చేయడానికి పాస్వర్డ్ మా వద్ద ఉందని చెప్తున్న సైబర్ నేరగాళ్లు గరిష్టంగా మూడు రోజుల గడువు ఇస్తూ 100 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ర్యాన్సమ్వేర్ వైరస్‌తో లాక్ అయిన కంప్యూటర్/ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై మూడు రోజులు (72 గంటలు) కౌంట్‌డౌన్ టైమింగ్ కూడా డిస్ప్లే అవుతుంటుంది. తాము ఆ పాస్‌వర్డ్‌ను ఆ సమయం తరవాత నిర్వీర్యం చేస్తామని, ఇక మీ కంప్యూటర్లోని డేటా శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని బెదిరిస్తుంటారు. ఎవరైనా ఆ టైమర్‌ను, వైరస్ ప్రొగ్రామ్‌ను మార్పు చేయాలని ప్రయత్నించినా, నగదు డిపాజిట్ చేసినట్లు తప్పుడు వివరాలు పొందుపరిచినా డెడ్‌లైన్ సమయం తగ్గిపోతూ... కౌంట్‌డౌన్ టైమర్‌లో మార్పులు రావడం ఈ వైరస్‌కు ఉన్న మరో లక్షణం.
ఆ ‘కీ’ లేకుండా అన్‌లాక్ కష్టమే...
కంప్యూటర్లోని డేటా ఎన్క్రిప్షన్ (లాక్ చేయడంలో) రెండు రకాలు ఉంటాయి. సెమెట్రిక్ విధానంలో లాకింగ్, అన్–లాకింగ్కు ఉపకరించే పబ్లిక్, ప్రైవేట్ ‘కీ’లు ఒకటే ఉంటాయి. నాన్–సెమెట్రిక్ విధానంలో వేర్వేరుగా ఉంటాయి. ర్యాన్సమ్వేర్ పంపే నేరగాళ్లు ఈ విధానంలోనే లాక్ చేస్తారు. దీంతో వారి వద్ద ఉన్న ప్రైవేట్ కీ తెలిస్తే తప్ప ఆ కంప్యూటర్ అన్‌లాక్ కాదు. ఫార్మాట్ చేస్తే అందులో ఉన్న డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో వినియోగదారులకు మరో దారి లేక మనీప్యాక్, ఓచర్స్, ఈ–మనీ రూపాల్లో నేరగాళ్లు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించాల్సి వస్తోంది. నగదు తమకు చేరిన తరవాత ఆ సైబర్ నేరగాళ్ళు వైరస్ ప్రొగ్రామ్ ద్వారానే ఆల్‌లాక్ కీ పంపిస్తున్నారు. దీన్ని వినియోగిస్తే మాత్రమే కంప్యూటర్/ల్యాప్టాక్ యథాప్రకారం ఓపెన్ కావడంతో పాటు అందులోని డేటా భద్రంగా అందుబాటులోకి వస్తుంది.