unmaritual relation
-
తాగుబోతు భర్తకు ఎదురుపడ్డ భార్య, మత్తులో ప్రాణాలు తీసి..
ముమ్మిడివరం: భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు నక్కావారిపేటలో సోమవారం రాత్రి ఈ హత్యోదంతం జరిగింది. నక్కవారిపేటకు చెందిన కాశి రవీంద్రకు 14 ఏళ్ల కిందట ఉప్పలగుప్తం మండలం గోపవరానికి చెందిన అంబటి దుర్గా ఈశ్వరి(32)తో పెళ్లయింది. వీరికి 12 ఏళ్ల భరత్, తొమ్మిదేళ్ల శరత్ అనే ఇద్దరు కుమారులున్నారు. నగర పంచాయతీలో రవీంద్ర కాంట్రాక్టు ప్రాతిపదికపై చెత్త తరలింపు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి తరచూ ఆలస్యంగా వచ్చేవాడు. అతడి తీరుతో విసిగిపోతున్న దుర్గా ఈశ్వరి పలుమార్లు నిలదీసింది. సోమవారం రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో భర్తకు ఫోన్ చేసింది. ఆ సమయంలో రవీంద్ర యానాంలో మద్యం తాగుతున్నట్టు తెలుసుకుని గట్టిగా నిలదీసింది. తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో అతడి కోసం బయలుదేరింది. 200 మీటర్ల దూరం వెళ్లేసరికి భర్త ఎదురు పడ్డాడు. వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రవీంద్ర భార్య దుర్గా ఈశ్వరిపై దాడిచేశాడు. అతడి పిడిగుద్దులకు ఆమె కింద పడింది. వెంటనే ఆమె తలను రోడ్డుకు వేసి కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతదేహన్ని రోడ్డు పక్కన కాలువలో పడేసి రవీంద్ర ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఉదయాన్నే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తానే భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. అమలాపురం డీఎస్సీ ఎం.మాధవరెడ్డి, సీఐ ఎం.జానకీరామ్, ఎస్సై కె.సురేష్‌బాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. శవ పంచనామా నిర్వహించారు. -
ప్రియుడితో ఉంటానని భార్య చెప్పడంతో..
అన్నానగర్: భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని భరించలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యకు కారణమైన భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరంలో చోటుచేసుకుంది. చెన్నై, తాంబరం సమీపంలోని సంతోషపురం పార్కు వీధికి చెందిన రాజన్ (31) విజయనగర్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. ఇతని భార్య సీతాలక్ష్మి. వీరికి శృతి (6), వినీష్ (5) సంతానం. ఈ క్రమంలో గత శనివారం ఉదయం రాజన్ తల్లిదండ్రులు గది తలుపుకొట్టగా అతడు తలుపు తెరవలేదు. తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కి రాజన్ ఉరి వేసుకుని శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న సేలైయూర్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి రాజన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన చావుకు భార్య, ఆమె ప్రియుడు ఐవర్‌రాజ్ కారణమని రాజన్ రాసిన సూసైట్‌నోట్ పోలీసులకు లభ్యమైంది. సంతోషపురం ప్రాంతంలో జిరాక్స్ షాపు నడుపుతున్న ఐవర్‌రాజ్‌తో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసుల విచారణలో సీతాలక్ష్మి అంగీకరించింది. ఈ విషయం తెలిసి భర్త తనను మందలించగా.. తాను పిల్లలను రాజన్ వద్ద వదలి పుట్టింటికి వెళ్లినట్లు చెప్పింది. తప్పు సరిదిద్దుకునే అవకాశమిస్తూ కాపురానికి రావాలని భార్యకు ఫోన్ చేశాడని పోలీసులు చెప్పారు. ప్రియుడు ఐవర్‌రాజ్‌తో కలిసి జీవిస్తానని, కాపురానికి రానని చెప్పడంతో మనస్తాపం చెందిన రాజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్ ఆత్మహత్యకి కారణమైన సీతాలక్ష్మిని, ఐవర్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు. -
ప్రియుడితో కలిసి.. భర్త గొంతు నులిమేసింది!
బెంగుళూరు: అనైతిక వ్యవహారానికి స్వస్తి పలకాలని చెప్పిన భర్తను, భార్య తన ప్రియుడితో కలిసి అంతమొందించింది. ఈఘటన జేసీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. జేసీ.నగరలో మాన్సింగ్, చంద్రబాయి దంపతులు నివాసముంటున్నారు. చంద్రబాయి, అశోక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. అనుమానం వచ్చిన మాన్సింగ్ తన భార్యను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయితే భర్తను అడ్డు తొలగించుకునేందుకు చంద్రబాయి తన ప్రియుడు అశోక్‌తో కలిసి పథకం వేసింది. ఈ మేరకు ఈ నెల 4 అర్ధరాత్రి మాన్సింగ్ను ఇద్దరూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి శ్మాశానానికి తీసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించగా ఈ ఉదంతం వెలుగు చూసింది. అక్కడే ఉన్న చంద్రబాయి, అశోక్‌ను అరెస్ట్ చేశారు. మాన్సింగ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. మాన్ సింగ్ ది హత్యేనని వైద్యులు తేల్చడంతో పాటు తమ విచారణలో చంద్రబాయి, అశోక్ తాము నేరం చేసినట్లు అంగీకరించారని పోలీసులు శనివారం వెల్లడించారు. -
వివాహేతర సంబంధమే ఉసురు తీసింది
గద్వాలటౌన్(మహబూబ్‌నగర్): నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని గద్వాల టౌన్ పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఆ దారుణానికి కారణమని తేల్చారు. గద్వాల డీఎస్పీ బాలకోటి తెలిపిన వివరాలివీ.. మండలంలోని చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన రాముడు మేస్త్రీ పనిచేస్తుంటాడు. అతని భార్య సుజాతకు గద్వాలకు చెందిన తెలుగు దర్శెల్లి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో చనువుగా ఉంటున్న విషయం తెలుసుకున్న రాముడు పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో అతడిని తమకు అడ్డుగా భావించి అంతమొందించాలనుకున్నారు. తెలుగు దర్శెల్లి తనకు సన్నితులుగా ఉన్న దౌదర్పల్లికి చెందిన జాన్, స్థానిక రాంనగర్‌కు చెందిన వెంకటేష్‌తో కలసి పథకం వేశాడు. దాని ప్రకారం ఈనెల 2వ తేదీ రాత్రి చెనుగోనిపల్లి నుంచి బైక్‌పై రాముడు గద్వాలకు వస్తున్న విషయాన్ని సుజాత ద్వారా తెలుసుకుని, గ్రామ శివారులో మాటువేసి ఇనుప రాడ్‌తో కొట్టి చంపారు. సమీపంలోని బావిలో రాముడు మృతదేహాన్ని పడవేశారు. ఈనెల 3వ తేదీ ఉదయం సుజాత ఏడుస్తూ భర్త కన్పించడం లేదని బంధువులకు చెప్పగా వారు అనుమానం వచ్చి నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సుజాతను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా నేరం అంగీకరించింది. హత్యకు పాల్పడిన ప్రియుడు తెలుగు దర్శెల్లితో పాటు అతనికి సహకరించిన జాన్, వెంకటేష్, సుజాతలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.