upsrtc
-
టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా యూపీఎస్‌ఆర్‌టీసీకి 1,297 బస్ ఛాసిస్‌లను కంపెనీ సరఫరా చేయనుంది. ఒక ఏడాదిలో యూపీఎస్ఆర్టీసీ నుండి ఆర్డర్ అందుకోవడం టాటా మోటార్స్‌కు ఇది మూడవది.మొత్తం ఆర్డర్ పరిమాణం 3,500 యూనిట్లకుపైమాటే. పోటీ ఈ–బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆర్డర్ గెలుచుకున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం బస్ ఛాసిస్‌లను దశలవారీగా డెలివరీ చేస్తామని వివరించింది. టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్ ఛాసిస్ నగరాల మధ్య, సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.‘ఈ ఆర్డర్ మెరుగైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో సంస్థ నిబద్ధతకు శక్తివంతమైన ధృవీకరణ. స్థిర పనితీరు, అభివృద్ధి చెందుతున్న యూపీఎస్ఆర్టీసీ రవాణా అవసరాలను తీర్చగల సామర్థ్యం.. ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థలో కంపెనీ సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి’ అని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ ఎస్.ఆనంద్ తెలిపారు.టాటా ఎల్‌పీవో 1618 బస్టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్సు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారైంది. ఇందులోని కమ్మిన్స్ 5.6L ఇంజన్ 180 బీహెచ్పీ, 675 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6 ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఫేస్ కౌల్ రకం ఛాసిస్ 10,700 కిలోల వరకు మోయగలదు. -
అధికారుల వింత రూల్స్.. బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్ల చెకింగ్.. ఎందుకంటే..?
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ ఏ వింతైన నిబంధనను తీసుకువచ్చింది. ఇకపై బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్ల ఫోన్లను కూడా తనిఖీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. చెకింగ్ అధికారుల రూట్ వివరాలను బస్సు డ్రైవర్లు తమ సహోద్యోగులకు చేరవేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. చెకింగ్ అధికారుల రూట్‌కు అనుగుణంగా ఇతర రూట్లలోని ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారని తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది. సంస్థ ప్రయోజనాల కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారులు బస్సుల్లో చెకింగ్ చేసే సమయంలో మొదట బస్సు డ్రైవర్, కండక్టర్ ఫోన్లను చెక్ చేస్తారని మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ గార్గ్ తెలిపారు. చెకింగ్ సమయంలో డ్రైవర్, కండక్టర్ సహోద్యోగులకు సంబంధిత వివరాలను పంపినట్లు తేలితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని కనుగొన్నట్లు వ్లెడించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి దయా శంకర్ సింగ్ కూడా ఈ నిబంధనలపై స్పందించారు. ఉద్యోగులందరూ ఈ నియమాలను పాటించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే విధుల నుంచి తప్పిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్‌ను వాడడం తమ వ్యక్తిగత హక్కు అని చెబుతున్నాయి. వ్యక్తిగత వివరాలు సెల్ఫోన్లో భద్రపరుచుకుంటామని వెల్లడించాయి. చెకింగ్‌ల పేరిట తమ వ్యక్తిగత హక్కుకు భంగం వాటిల్లుతుందని తెలిపాయి. ఈ నిబంధనల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించాయి. ఇదీ చదవండి: పండుగ సెలవుల్లో విషాదం: రెస్టారెంట్లో పేలిన సిలిండర్.. 31 మంది దుర్మరణం -
‘ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీకి రూ.10,000’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూపీలోని 250 కిమీ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లే ట్యాక్సీలకు భారీ మొత్తంలో రూ 10,000 నుంచి రూ.12,000 చార్జీలుగా నిర్ణయించిన యూపీఎస్ఆర్టీసీ నిర్ణయం వివాదాస్పదమైంది. ఢిల్లీకి సమీపంలోని నోయిడా, ఘజియాబాద్‌లకు వెళ్లే క్యాబ్‌లకు కూడా ఇదే భారీ మొత్తం వసూలు చేయాలని యూపీఎస్ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగడంతో యూపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. చార్జీలను పునఃసమీక్షించేందుకు యూపీఎస్ఆర్టీసీ కమిటీని నియమించింది. వందే భారత్ మిషన్ కింద విదేశాల నుంచి ఢిల్లీకి తిరిగివచ్చే ప్రయాణీకులు అక్కడి నుంచి నోయిడా, ఘజియాబాద్ సహా యూపీలోని 250 కిమీ పరిధిలోని ప్రాంతాలకు క్యాబ్‌కు రూ 10,000, ఎస్‌యూవీకి అయితే రూ 12,000 చెల్లించాలని యూపీఎస్ఆర్టీసీ ఎండీ రాజశేఖర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతీయ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి యూపీలోని క్వారంటైన్ సెంటర్లకు తాము నడిపే సర్వీసులు పూర్తి ఉచితమని, ట్యాక్సీ సేవల కోసం నిర్ణయించిన చార్జీలపై సమీక్షించేందుకు కమిటీని నియమించామని, 24 గంటల్లో కమిటీ తమ నివేదికను సమర్పిస్తుందని యూపీఎస్ఆర్టీసీ ఎండీ రాజశేఖర్ ప్రకటించారు. చదవండి : ఢిల్లీలో బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన -
దారుణం : బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ..
అమ్రొహా(యూపీ) : ఉత్తర్ ప్రదేశ్‌లో అమ్రొహాలోని జాతీయ రహదారిపై దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్(యూపీఎస్ఆర్టీసీ)కి చెందిన బస్సు (యూపీ 27 టీ 8612) ఓ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం బస్సును ఆపకుండా డ్రైవర్ అలానే వేగంగా పోనిచ్చాడు. బైక్‌ను ఈడ్చుకుంటూ హైవేపై వెళుతున్న వాహనాలను ఓవర్ టెక్ కూడా చేశాడు. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిచికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీ బస్సులో పేలిన టికెటింగ్ మెషిన్
సాక్షి, లక్నో : ఓ ఆర్టీసీ బస్సులో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్(ఈటీఎమ్) పేలిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో యూపీ ఆర్టీసీ కండక్టర్ నేత్రాపాల్ తీవ్రంగా గాయపడ్డారు. అతని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఈటీఎమ్ పేలడానికి గల కారణాలు తెలియరాలేదని, బస్సులో ప్రయాణీకులున్నప్పటికీ కండక్టర్‌కు మాత్రమే గాయలైనట్లు పోలీసులు తెలిపారు. ఈటీఎమ్ మాత్రం పూర్తిగా ధ్వంసమైందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రాఖీ గిఫ్ట్: బస్సుల్లో ఉచిత ప్రయాణం
లక్నో : ఉత్తరప్రదేశ్ మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రక్షాబంధన్ కానుక ఇచ్చారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని మహిళలు ఆ రోజు ఉచితంగా ఎక్కడికైనా బస్సులో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా టిక్కెట్ కొనకుండా ఆగస్టు 6 అర్థరాత్రి నుంచి ఆగస్టు 7 అర్థరాత్రి వరకు మహిళలు ఈ ఉచిత రైడ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు, రవాణా కార్పొరేషన్‌కు యోగిఆదిత్యానాథ్ ఆదేశాలు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. ఉచితంగా బస్సులో మహిళలు సురక్షితంగా ప్రయాణించేలా రక్షణ కల్పించాలని ఆ రాష్ట్రప్రభుత్వం పోలీసులను కూడా ఆదేశించింది. సంఘవ్యతిరేక కార్యకలాపాలతో వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పోలీసులు సాయపడాలన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, యూపీఎస్‌ఆర్‌టీసీకి సంబంధించిన కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన యోగి ఆదిత్యానాథ్ ఈ ప్రకటన చేశారు. -
బస్సు నడిపిన కోతి.. డ్రైవర్‌కు చుక్కలు
బరేలి: ఉత్తరప్రదేశ్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నిలిపి ఉన్న బస్సులోకి ఓ కోతి జోరబడటమే కాకుండా నేరుగా ఇంజిన్ స్టార్ట్ చేసి రయ్ రయ్ మంటూ హారన్ కొడుతూ ముందుకు పోనిచ్చింది. ఇది చూసిన డ్రైవర్ వెంటనే బస్సులోకి వెళ్లి దానిని నియంత్రించాడు కానీ, అప్పటికే అక్కడ పార్క్ చేసి ఉంచిన రెండు బస్సులను ఢీకొట్టింది. అయితే, పెద్దగా నష్టం జరగలేదు. వివరాల్లోకి వెళితే ఫిలిబిత్ కు చెందిన ఉత్తరప్రదశ్ రోడ్డు రవాణా సంస్థ(యూపీఎస్ఆర్టీసీ) బస్సు బరేలీకి వచ్చింది. తిరిగి బయలు దేరడానికి కొద్ది సమయం ఉండటంతో ఈలోగా ప్రయాణీకులకోసం కండక్టర్ చూస్తుండగా.. డ్రైవర్ బస్సు చివరి సీట్లో కూర్చోని ఒక చిన్న కునుకులోకి జారుకున్నాడు. ఈలోగా ఓ కోతి రయ్ మంటూ బస్సులోకి ఎక్కింది. ఎక్కిందే తడవుగా.. వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేసింది. ఈ లోగా కునుకులో ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా మేల్కోని క్యాబిన్ వద్దకు పరుగు తీశాడు. కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, అది డ్రైవర్ ను బెదిరిస్తూ మీదపడి కరిచేందుకు ప్రయత్నించడంతోపాటు ఆ క్రమంలో సెకండ్ గేర్ వేసి కిందికి దిగిపోయింది. బస్సు డ్రైవర్ సీట్లోకి వెళ్లి కూర్చొని బస్సును నియంత్రించేలోగానే అది కాస్త రెండు బస్సులను ఢీకొట్టింది. అలా డ్రైవర్‌కు కోతి చుక్కలు చూపించింది.