బస్సు నడిపిన కోతి.. డ్రైవర్కు చుక్కలు
బరేలి: ఉత్తరప్రదేశ్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నిలిపి ఉన్న బస్సులోకి ఓ కోతి జోరబడటమే కాకుండా నేరుగా ఇంజిన్ స్టార్ట్ చేసి రయ్ రయ్ మంటూ హారన్ కొడుతూ ముందుకు పోనిచ్చింది. ఇది చూసిన డ్రైవర్ వెంటనే బస్సులోకి వెళ్లి దానిని నియంత్రించాడు కానీ, అప్పటికే అక్కడ పార్క్ చేసి ఉంచిన రెండు బస్సులను ఢీకొట్టింది. అయితే, పెద్దగా నష్టం జరగలేదు. వివరాల్లోకి వెళితే ఫిలిబిత్ కు చెందిన ఉత్తరప్రదశ్ రోడ్డు రవాణా సంస్థ(యూపీఎస్ఆర్టీసీ) బస్సు బరేలీకి వచ్చింది. తిరిగి బయలు దేరడానికి కొద్ది సమయం ఉండటంతో ఈలోగా ప్రయాణీకులకోసం కండక్టర్ చూస్తుండగా.. డ్రైవర్ బస్సు చివరి సీట్లో కూర్చోని ఒక చిన్న కునుకులోకి జారుకున్నాడు.
ఈలోగా ఓ కోతి రయ్ మంటూ బస్సులోకి ఎక్కింది. ఎక్కిందే తడవుగా.. వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేసింది. ఈ లోగా కునుకులో ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా మేల్కోని క్యాబిన్ వద్దకు పరుగు తీశాడు. కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, అది డ్రైవర్ ను బెదిరిస్తూ మీదపడి కరిచేందుకు ప్రయత్నించడంతోపాటు ఆ క్రమంలో సెకండ్ గేర్ వేసి కిందికి దిగిపోయింది. బస్సు డ్రైవర్ సీట్లోకి వెళ్లి కూర్చొని బస్సును నియంత్రించేలోగానే అది కాస్త రెండు బస్సులను ఢీకొట్టింది. అలా డ్రైవర్కు కోతి చుక్కలు చూపించింది.