urdu course
-
ఏఎన్‌యూలో ఉర్దూ ప్రత్యేక విభాగం ఏర్పాటు
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మేలు బాటలు వేస్తోంది. మైనార్టీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఉర్దూను ద్వితీయ భాషగా గుర్తించింది. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఉర్దూ కోర్సు విభాగం ఏర్పాటుకు అనుమతి ఇచ్చి మరో ముందడుగు వేసింది. అంతేగాకుండా అరబిక్ కోర్సును ప్రవేశపెట్టేందుకు పరిశీలన చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్‌యూ(గుంటూరు): ముస్లిం మైనార్టీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం, యూనివర్సిటీ పెద్దపీట వేస్తోంది. ముస్లిం యువతీయువకులు అధికంగా అరబిక్, ఉర్దూ భాషల్లో విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తారు. రాష్ట్ర విభజన అనంతరం అరబిక్, ఉర్దూ భాషల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ప్రత్యేకంగా విభాగాలు, ఉన్నత విద్యాసంస్థలు లేకపోవడంతో ముస్లిం యువతీయువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దానికి అనుకూలంగా చర్యలు చేపడుతూ ముస్లిం మైనార్టీ వర్గాల ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. పదేళ్లుగా ముస్లిం సంఘాలు వినతి రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీలో ఉర్దూ, అరబిక్ విభాగాలను ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం ముస్లిం వర్గాల వినతులను పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సంఘాల వినతులను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంది. ముస్లిం సంఘాలు డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను కలిసి విన్నవించుకోగా ఏఎన్‌యూలో ఉర్దూ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ముస్లిం సంఘాల వినతులపై ఏఎన్‌యూ ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి కోర్సు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఎన్‌యూలో ఉర్దూ కోర్సు నిర్వహణకు చర్యలు ప్రారంభించింది. 20 సీట్లతో ఎంఏ ఉర్దూ కోర్సును నిర్వహించేందుకు యూనివర్సిటీ పరంగా కార్యాచరణ పూర్తి చేసింది. పరిశీలనలో అరబిక్ కోర్సు వినతులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కానీ కర్నూలులోని అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ శాఖను గుంటూరులో ఏర్పాటు చేసి అరబిక్ కోర్సు నిర్వహించాలని ముస్లిం సంఘాల జేఏసీ నాయకులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను విన్నవించారు. ఈ వినతికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చింది రాష్ట్రంలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు పదేళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మా ఆకాంక్షను నెరవేర్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉర్దూ, అరబిక్ కోర్సులకు మంచి ఆదరణ ఉంది. మన రాష్ట్రంలో ఈ కోర్సులు ప్రవేశ పెట్టడం వల్ల ముస్లిం యువతీయువకులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. – డాక్టర్ మస్తాన్ ఆలీ, ముస్లిం సంఘాల జేఏసీ సభ్యుడు ముస్లిం సంఘాల హర్షం ఏఎన్‌యూలో ఉర్దూ విభాగం ప్రారంభించడం, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అరబిక్ విభాగ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండటం, ఉర్దూ భాషను ఐచ్చిక ద్వితీయ భాషగా ప్రవేశ పెడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోవడం పట్ల ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మదరసాలలో ధార్మిక విద్యను అభ్యసించే విద్యార్థులతోపాటు, అరబిక్, ఉర్దూ బోధకులుగా స్థిరపడాలనుకునే వారికి, ధార్మిక పండితులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. ముస్లిం యువతీయువకులు ఉన్నత విద్యావంతులు అయ్యేందుకు ఈ చర్యలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఉర్దూ’ కోర్సుపై ఊగిసలాట
సాక్షి, వైఎస్సార్ కడప : రాయలసీమ ప్రాంతానికి నడిబొడ్డుగా ఉన్న వైఎస్ఆర్ కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో 2017–18 విద్యాసంవత్సరంలో ఎంఏ ఉర్దూ కోర్సును సెల్ఫ్‌సపోర్టింగ్ కోర్సుగా ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచనతో అప్పటి వీసీ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి దీనికి బాటలు వేయగా అప్పటి వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి కోర్సును ప్రారంభించారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఉర్దూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్లవుతున్నా ఇంకా సెల్ఫ్‌సపోర్టింగ్ కోర్సుగానే పరిగణిస్తూ వస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులకు ఆర్థికభారంతో పాటు పరిశోధనలకు అవకాశం లేకుండా పోతోంది. కోర్సును రెగ్యులరైజ్ చేసి పరిశోధనలకు అవకాశం కల్పించాలని ఉర్దూ భాషాభిమానులు కోరుతున్నారు. తొలి సమావేశంలోనే తీర్మానం.. వైవీయూ తొలి మహిళా వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య మునగాల సూర్యకళావతి ఉర్దూ కోర్సును రెగ్యులరైజ్ చేసే అంశాన్ని 2020 ఫిబ్రవరి 25న నిర్వహించిన తొలి పాలకమండలి సమావేశంలోనే ఆమోదింపచేశారు. సెల్ఫ్ సపోర్టింగ్ నుంచి రెగ్యులర్ కోర్సుగా మార్పు చేస్తున్నట్లు జూన్ 23వ తేదీన రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ ఉత్తర్వులు మాత్రం బయటకు రాలేదు. ఈ ఏడాది నోటిఫికేషన్లో సైతం ఉర్దూను సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుగానే పరిగణించారు. కాగా ఎంఏ ఉర్దూ కోర్సును రెగ్యులర్ చేయడంతో పాటు కోర్సుకు అవసరమైన రెగ్యులర్ అధ్యాపక పోస్టులను మంజూరు చేయాలని వైవీయూ అధికారులు ఉన్నతవిద్య అధికారులకు ప్రతిపాదనలు పంపారు. జిల్లాకు చెందిన మైనార్టీశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్‌బాషా దృష్టికి కూడా తీసుకువెళ్లారు. పరిశోధనలకు గండి వైవీయూలో గతంలో కొన్ని కోర్సులను పాలకమండలిలో ఆమోదించి రెగ్యులర్ కోర్సుగా మార్పుచేశారు. ఇప్పుడు అలాగే చేయాలని ఉర్దూ భాషాభిమానులు కోరుతున్నారు. వైవీయూ అధికారులు మాత్రం గతానికి, ఇప్పటికి నిబంధనలల్లో చాలా మార్పులు వచ్చాయని, కోర్సును రెగ్యులర్ చేయాలంటే రెగ్యులర్ అధ్యాపకులు, సిబ్బంది అవసరమని పేర్కొంటున్నారు. కాగా వైవీయూలో ఉర్దూ రెగ్యులర్ అధ్యాపకులు లేనప్పటికీ రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఒకరు చొప్పున జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉర్దూ విభాగంలో ఉన్నారు. వీరికి ఉర్దూ పరిశోధకులకు గైడ్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశం కల్పించకపోవడంతో పరిశోధన అవకాశాలకు కూడా గండిపడినట్లయింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.. వైవీయూలో ఎంఏ ఉర్దూ కోర్సును సెల్ఫ్‌సపోర్టింగ్ నుంచి రెగ్యులర్ కోర్సుగా మార్పు చేసేందుకు తొలి పాలకమండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నాం. కోర్సు నిర్వహణకు అవసరమైన రెగ్యులర్ అధ్యాపకులు, సిబ్బంది మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆమోదం వచ్చిన వెంటనే ఉరర్దూను రెగ్యులర్ కోర్సుగా మార్పుచేస్తాం. – ఆచార్య మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్‌లర్, వైవీయూ -
'బాంబే' బదులు 'బాంబ్' అని వాట్సాప్..
స్నేహితుడికి వాట్సాప్ ద్వారా 'బాంబే' బదులు 'బాంబ్' అని టైప్ చేసి పంపిన ఆరుగురు ముస్లిం విద్యార్థులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్(ఏటీఎస్) బృందం వారిని మంగళవారం విడిచిపెట్టారు. కేరళ నుంచి నెల రోజుల ఉర్దూ కోర్సు కోసం ముంబై వచ్చిన ఆరుగురు స్నేహితులు వేరే స్నేహితునికి 'బాంబే'కి బదులు 'బాంబ్' అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారు. ఇది గుర్తించిన ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని ఏటీఎస్ పోలీసులకు అప్పగించారు. విద్యార్థుల లగేజీని పరిశీలించిన పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. ఉర్దూ కోర్సు కొరకు విద్యార్థులు వెళ్తున్న ఇనిస్టిట్యూట్‌లో ఆరా తీయగా ఆరుగురు కోర్సు కోసం వస్తున్నట్లు పోలీసులకు విచారణలో తెలిసింది. దీంతో వారిని వదిలేసినట్లు పోలీసులు తెలిపారు.