సాక్షి, వైఎస్సార్ కడప : రాయలసీమ ప్రాంతానికి నడిబొడ్డుగా ఉన్న వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో 2017–18 విద్యాసంవత్సరంలో ఎంఏ ఉర్దూ కోర్సును సెల్ఫ్‌సపోర్టింగ్ కోర్సుగా ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచనతో అప్పటి వీసీ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి దీనికి బాటలు వేయగా అప్పటి వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి కోర్సును ప్రారంభించారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఉర్దూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్లవుతున్నా ఇంకా సెల్ఫ్‌సపోర్టింగ్ కోర్సుగానే పరిగణిస్తూ వస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులకు ఆర్థికభారంతో పాటు పరిశోధనలకు అవకాశం లేకుండా పోతోంది. కోర్సును రెగ్యులరైజ్ చేసి పరిశోధనలకు అవకాశం కల్పించాలని ఉర్దూ భాషాభిమానులు కోరుతున్నారు.
తొలి సమావేశంలోనే తీర్మానం..
వైవీయూ తొలి మహిళా వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య మునగాల సూర్యకళావతి ఉర్దూ కోర్సును రెగ్యులరైజ్ చేసే అంశాన్ని 2020 ఫిబ్రవరి 25న నిర్వహించిన తొలి పాలకమండలి సమావేశంలోనే ఆమోదింపచేశారు. సెల్ఫ్ సపోర్టింగ్ నుంచి రెగ్యులర్ కోర్సుగా మార్పు చేస్తున్నట్లు జూన్ 23వ తేదీన రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ ఉత్తర్వులు మాత్రం బయటకు రాలేదు. ఈ ఏడాది నోటిఫికేషన్‌లో సైతం ఉర్దూను సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుగానే పరిగణించారు. కాగా ఎంఏ ఉర్దూ కోర్సును రెగ్యులర్ చేయడంతో పాటు కోర్సుకు అవసరమైన రెగ్యులర్ అధ్యాపక పోస్టులను మంజూరు చేయాలని వైవీయూ అధికారులు ఉన్నతవిద్య అధికారులకు ప్రతిపాదనలు పంపారు. జిల్లాకు చెందిన మైనార్టీశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్‌బాషా దృష్టికి కూడా తీసుకువెళ్లారు.
పరిశోధనలకు గండి
వైవీయూలో గతంలో కొన్ని కోర్సులను పాలకమండలిలో ఆమోదించి రెగ్యులర్ కోర్సుగా మార్పుచేశారు. ఇప్పుడు అలాగే చేయాలని ఉర్దూ భాషాభిమానులు కోరుతున్నారు. వైవీయూ అధికారులు మాత్రం గతానికి, ఇప్పటికి నిబంధనలల్లో చాలా మార్పులు వచ్చాయని, కోర్సును రెగ్యులర్ చేయాలంటే రెగ్యులర్ అధ్యాపకులు, సిబ్బంది అవసరమని పేర్కొంటున్నారు. కాగా వైవీయూలో ఉర్దూ రెగ్యులర్ అధ్యాపకులు లేనప్పటికీ రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఒకరు చొప్పున జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు ఉర్దూ విభాగంలో ఉన్నారు. వీరికి ఉర్దూ పరిశోధకులకు గైడ్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశం కల్పించకపోవడంతో పరిశోధన అవకాశాలకు కూడా గండిపడినట్లయింది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం..
వైవీయూలో ఎంఏ ఉర్దూ కోర్సును సెల్ఫ్‌సపోర్టింగ్ నుంచి రెగ్యులర్ కోర్సుగా మార్పు చేసేందుకు తొలి పాలకమండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నాం. కోర్సు నిర్వహణకు అవసరమైన రెగ్యులర్ అధ్యాపకులు, సిబ్బంది మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆమోదం వచ్చిన వెంటనే ఉరర్దూను రెగ్యులర్ కోర్సుగా మార్పుచేస్తాం.
– ఆచార్య మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్‌లర్, వైవీయూ
Comments
Please login to add a commentAdd a comment