Urmilanagar
-
పరిహారం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తా: వైఎస్ జగన్
విజయవాడ: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. విజయవాడ ఊర్మిళానగర్‌లో విద్యుత్ షాక్ తో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. విద్యుత్ ప్రమాదం ఘటనలో మృతిచెందిన సుబ్బారెడ్డి భార్య చిన్నక్క, తిరుపతి రెడ్డి భార్య రాధమ్మలను వైఎస్ జగన్ ఓదార్చారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆయన మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 30 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబానికి ఓ ఉద్యోగం ఇవ్వాలని.. లేనిపక్షంలో విద్యుత్ శాఖపై న్యాయ పోరాటం చేస్తానంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు. అనంతరం అక్కడి నుంచి వైఎస్ జగన్ నగరానికి బయలుదేరతారు. ఇటీవలే నిర్మాణంలో ఉన్న భవనం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
ఊర్మిళానగర్ బాధితులకు నేడు జగన్ పరామర్శ
విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నగరంలో పర్యటించనున్నారు. భవానీపురంలోని ఊర్మిళానగర్‌లో ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి బయల్దేరి శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు జగన్ నగరానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అనంతరం ఊర్మిళానగర్‌లో విద్యుత్ షాక్‌తో మరణించిన ఘంటా సుబ్బారెడ్డి, బొమ్మారెడ్డి తిరుపతిరెడ్డి కుటుంబీకులను పరామర్శించి వారికి ధైర్యం చెబుతారని తెలిపారు. అనంతరం సాయంత్రం నగరం నుంచి బయల్దేరి హైదరాబాద్ వెళ్తారని చెప్పారు. -
విద్యుదాఘాతం మృతులకు కన్నీటి వీడ్కోలు
భవానీపురం : స్థానిక ఊర్మిళానగర్‌లో మంగళవారం విద్యుదాఘాతంతో మృతి చెందిన ఐదుగురి అంతిమ యాత్ర బుధవారం జరిగింది. ఈ యాత్రలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఐరన్ పైప్‌లను కింద నుంచి పైఅంతస్తుకు తీసుకువెళుతుండగా అవి 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్‌కు గురై జి సుబ్బారెడ్డి, జి. శ్రీనివాసరెడ్డి, జి.నాగార్జునరెడ్డి, సన్నపురెడ్డి తిరుపతమ్మ, బొమ్మారెడ్డి తిరుపతి రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సూరారపు వెంకటేశ్వరరెడ్డి, కందుల వెంకటలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలు ఇంటికి వచ్చేసరికి సాయంత్రం కావడంతో బుధవారం అంతిమ యాత్ర నిర్వహించారు. ఊర్మిళానగర్ మెయిన్ రోడ్‌లోని మృతుల ఇంటి వద్ద నుంచి క్రాంబ్వే రోడ్, జాతీయ రహదారి మీదుగా తిరుపతిరెడ్డిని విద్యాధరపురంలోని హిందూ శ్మశానవాటికలో ఖననం చేయగా, ఒకే కుటుంబంలోని నలుగురిని కృష్ణలంక స్వర్గపురిలో దహనం చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బట్టిపాటి సంధ్యారాణి, 37వ డివిజన్ కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మి, వైఎస్సార్ సీపీకి చెందిన 29వ డివిజన్ కన్వీనర్ ఎస్. రామిరెడ్డి, నాయకులు బట్టిపాటి శివ, ఎం.పోలిరెడ్డి, కంది శ్రీని వాసరెడ్డి, 26వ డివిజన్ కన్వీనర్ పోతిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, ఎం. వెంగళరెడ్డి, తుమ్మా ఆదిరెడ్డి, టీడీపీ కార్యకర్త కొండ, సీపీఐ 29వ డివిజన్ కార్యదర్శి మాగం ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు.